రూతు
1
1 నాయకులు ఇస్రాయేల్‌ప్రజను పరిపాలించే కాలంలో దేశంలో కరవు వచ్చింది. యూదా ప్రదేశంలో ఉన్న బేత్‌లెహేం పురవాసి ఒకడు తన భార్యనూ ఇద్దరు కొడుకులనూ తీసుకొని మోయాబుదేశంలో కొంత కాలం ఉండడానికి వెళ్ళాడు. 2 అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని కొడుకుల పేర్లు మహలోను, కిల్యోను. వీరు యూదాలో ఉన్న బేత్‌లెహేంలో కాపురముండే ఎఫ్రాతావారు. వారు మోయాబుకు చేరి అక్కడ ఉండిపోయారు. 3 అక్కడ నయోమి భర్త ఎలీమెలెకు చనిపోవడంతో నయోమి, ఆమె ఇద్దరు కొడుకులు మిగిలారు. 4 ఆమె కొడుకులు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకొన్నారు. వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారంతా మోయాబులో పది సంవత్సరాలు కాపురం ఉన్నారు. 5 అప్పుడు మహలోను, కిల్యోను కూడా చనిపోయారు గనుక నయోమి తన భర్త, ఇద్దరు కొడుకులు లేకుండా ఉంది.
6 యెహోవా తన ప్రజను దయ చూచి వారికి భోజనం ప్రసాదించాడని మోయాబులో నయోమికి వినబడింది గనుక ఆమె తన ఇద్దరు కోడళ్ళతోపాటు ఇస్రాయేల్ దేశానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడింది. 7 అప్పటివరకు కాపురమున్న స్థలాన్ని విడిచి ఆమె, ఆమె ఇద్దరు కోడళ్ళు యూదా ప్రదేశానికి పోయే దారిన బయలుదేరారు.
8 అప్పుడు నయోమి తన కోడళ్ళతో “మీరు మీ పుట్టిండ్లకు తిరిగి వెళ్ళండి. చనిపోయినవారిమీద, నామీదా మీరు దయ చూపారు. ఆ విధంగానే యెహోవా మీమీద దయ చూపుతాడు గాక! 9 మీరు మళ్ళీ పెండ్లి చేసుకొని మీ భర్తల గృహాలలో నెమ్మది పొందేలా యెహోవా ప్రసాదిస్తాడు గాక!” అని చెప్పి వారిని ముద్దుపెట్టుకొంది.
10 అప్పుడు వారు బిగ్గరగా ఏడుస్తూ “నీతో పాటే నీ ప్రజల దగ్గరికి వస్తాం” అన్నారు.
11 అందుకు నయోమి ఇలా అంది: “నా బిడ్డలారా, మీరు నాతో రావడం దేనికి? మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. మీకు భర్తలు కావడానికి నా గర్భంలో ఇంకా కొడుకులున్నారా? 12 నా బిడ్డలారా, మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి. మరో భర్తతో కాపురం చేయలేనంతటి ముసలిదానిని నేను. ఒక వేళ నాకు నమ్మకం ఉన్నా కూడా, ఈ రాత్రే భర్తతో గడపగలిగినా, తరువాత కొడుకులను కన్నా, 13 వారు పెరిగి పెద్దవారయ్యేవరకు మీరు వారికోసం చూస్తారా? అంతవరకు పెండ్లి చేసుకోకుండా వారికోసం ఒంటరిగా ఉంటారా? నా బిడ్డలారా, అలా కాదు. యెహోవా నాకు వ్యతిరేకంగా తన చెయ్యి ఎత్తాడు. మీ పరిస్థితులకంటే నావి బాధకరంగా ఉన్నాయి.”
14 అందుకు వారు మళ్ళీ బిగ్గరగా ఏడ్చారు. ఓర్పా తన అత్తకు ముద్దు పెట్టుకొంది గాని, రూతు ఆమెను అంటిపెట్టుకొని ఉంది.
15 అప్పుడు నయోమి “చూడు! నీ తోడికోడలు ఆమె ప్రజల దగ్గరికి, ఆమె దేవుళ్ళ దగ్గరికి తిరిగిపోతూ ఉంది గదా! నీవు ఆమె వెంట వెళ్ళు” అంది.
16 అందుకు రూతు ఇలా జవాబిచ్చింది: “నీవెంట రావద్దనీ, నిన్ను విడిచి వెళ్ళిపొమ్మనీ నన్ను ప్రాధేయపడకు. నీవు వెళ్ళే చోటికే నేనూ వస్తాను. నీవు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. నీ ప్రజలే నాకు ప్రజలుగా ఉంటారు. నీ దేవుడే నాకు దేవుడుగా ఉంటాడు. 17 నీవు చనిపోయే స్థలంలోనే నేను చనిపోతాను. అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరేదీ నన్ను నీ దగ్గరనుంచి వేరుచేయదు. అలా కాకపోతే యెహోవా నాకు ఎంత కీడైనా చేస్తాడు గాక!”
18 తనతో రావడానికి రూతుకు దృఢ మనస్సు ఉండడం చూచి నయోమి ఇంకేమీ అనలేదు. 19 వారిద్దరూ బేత్‌లెహేం వరకు ప్రయాణం సాగించారు. వారు బేత్‌లెహేంకు చేరేసరికి వారిని చూచి ఊరిలో వారంతా కంగారుపడ్డారు. స్త్రీలు “ఈమె నయోమేనా?” అని చెప్పుకొన్నారు. 20 ఆమె “నన్ను నయోమి అనకండి. అమిత శక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు గనుక నన్ను ‘మారా’ అనండి. 21 నేను వెళ్ళిపోయినప్పుడు నాకు సమృద్ధి ఉంది. ఏమీ లేకుండా నన్ను తిరిగి వచ్చేలా యెహోవా చేశాడు. మీరు నన్ను ‘నయోమి’ అని ఎందుకు పిలుస్తారు? యెహోవా నాకు విరుద్ధ సాక్షిగా నిలబడ్డాడు. అమిత శక్తిమంతుడు నామీదికి ఆపద రప్పించాడు.”
22 ఆ విధంగా నయోమి మోయాబుదేశస్థురాలైన తన కోడలు రూతుతో కూడా మోయాబును విడిచి వచ్చింది. ఇద్దరూ యవల కోత ఆరంభించే సమయంలో బేత్‌లెహేం చేరారు.