4
1 ✝ఇంతలో బోయజు ఊరి ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అతడు చెప్పిన సమీప బంధువు ఆ దారిన వచ్చినప్పుడు “స్నేహితుడా, కూర్చుందువుగాని ఇలా రా!” అని బోయజు పిలిచాడు. అతడు వచ్చి కూర్చున్నాడు. 2 ✽అప్పుడు బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించి “ఇక్కడ కూర్చోండి” అన్నాడు. వారు కూడా కూర్చున్నారు.3 ఆ తరువాత అతడు ఆ సమీప బంధువుతో అన్నాడు. “నయోమి మోయాబునుంచి తిరిగి వచ్చింది గదా. ఆమె మన సోదరుడు✽ ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మివేస్తుంది✽. 4 కనుక ఈ సంగతి నీకు తెలియజేయాలనుకొన్నాను. ఇక్కడ కూర్చునివున్న వారి ఎదుట, నా ప్రజల పెద్దల సమక్షంలో ఆ భూమిని ఖరీదు చేసుకో. దానిని విడిపించాలని నీవు అనుకొంటే అలా చేయి. చేయడానికి నీకు మనసు లేకపోతే అదీ నాతో చెప్పు. నేను తెలుసుకోవాలి. నీవు తప్ప మరొకరు దీనిని విడిపించలేరు. నీ తరువాత నేను ఉన్నాను.” అతడు “నేను దానిని విడిపిస్తాను” అన్నాడు.
5 అప్పుడు బోయజు “నీవు నయోమినుంచి ఆ భూమిని ఖరీదు చేసిన రోజున మోయాబు దేశస్థురాలు రూతును కూడా స్వీకరించాలి. చనిపోయినవాడి ఆస్తిపై అతడి పేరు నిలబెట్టేందుకు అతని భార్యను పెండ్లి చేసుకోవాలి గదా” అని చెప్పాడు.
6 అందుకా సమీపబంధువు “అలాగైతే నేను దానిని విడిపించలేను. నా ఆస్తిని✽ పోగొట్టుకోవలసి వస్తుందేమో, గనుక దానిని నేను విడిపించలేను. నాకు బదులు నీవే బంధుధర్మం నెరవేర్చు” అన్నాడు.
7 పూర్వకాలంలో ఇస్రాయేల్ ప్రజలలో బంధుధర్మాన్ని, కొనుగోలు, అమ్మకాలకు తదితర వ్యవహారాలను స్థిరం చేసేందుకు ఒక వ్యక్తి తన చెప్పును తీసి అవతలివాడికి ఇవ్వాలి. ఇది ఇస్రాయేల్‌వారు ప్రమాణంగా పరిగణించేవారు. 8 కనుక ఆ సమీప బంధువు “నీవే ఆ భూమిని కొనుక్కో” అని చెప్పి తన చెప్పును తీశాడు.
9 అప్పుడు బోయజు పెద్దలతో, ప్రజలందరితో ఇలా చెప్పాడు: “ఎలీమెలెకు, కిల్యోను, మహలోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గరనుంచి నేను సంపాదించుకొన్నాను. ఈరోజు దీనికి మీరు సాక్షులు. 10 అంతేగాక, చనిపోయిన మహలోను భార్య, మోయాబుదేశస్థురాలైన రూతును స్వీకరించి పెండ్లి చేసుకొంటాను. ఈ విధంగా చనిపోయినవాడి ఆస్తిపై అతని పేరు స్థిరంగా ఉంటుంది. అతని పేరు అతని సోదరులలోనుంచి, అతని స్థలం నుంచి రూపుమాసిపోదు. ఈవేళ దీనికి మీరు సాక్షులు”.
11 ఊరి ద్వారం చేరిన పెద్దలు, ప్రజలందరూ “మేము సాక్షులం. మీ ఇంట్లో కాలు మోపే ఆ స్త్రీని ఇస్రాయేల్ వంశానికి అభివృద్ధి కలిగించిన రాహేల్, లేయా✽లలాగా యెహోవా చేస్తాడు గాక! ఎఫ్రాతాలో మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది గాక! బేత్‌లెహేంలో మీరు ప్రఖ్యాతి పొందుతారు గాక! 12 యెహోవా ఈ యువతి మూలంగా మీకు ప్రసాదించబోయే మీ సంతానం యూదా✽కు తామారు కనిన పెరెసు కుటుంబంలాగా ఉంటుంది గాక!” అన్నారు.
13 బోయజు రూతును పెండ్లి చేసుకొన్నాడు, చేరదీశాడు. యెహోవా కృపచేత ఆమె గర్భవతి అయి✽, కొడుకును కన్నది. 14 అప్పుడు స్త్రీలు నయోమితో, “ఈ రోజుల్లో నిన్ను విడిపించే సమీప బంధువుడు వుండేలా చేసిన యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక! ఇస్రాయేల్‌లో అతడికి పేరుప్రతిష్ఠలు చేకూరుతాయి గాక! 15 ✽నీకు ఏడుగురు కొడుకులకంటే మంచిదై, నిన్ను ప్రేమతో చూచే నీ కోడలు కొడుకును కన్నది గనుక అతడు నిన్ను ఓదారుస్తాడు, ముసలితనంలో నిన్ను పోషిస్తాడు.”
16 నయోమి ఆ పిల్లవాణ్ణి తన కౌగిట్లోకి తీసుకొని అతడికి దాది అయింది. 17 పొరుగింటి స్త్రీలు “నయోమికి కొడుకు ఉన్నాడు” అన్నారు. అతడికి ఓబేదు✽ అని పేరు పెట్టారు. అతడు యెష్షయి తండ్రి. యెష్షయి దావీదు తండ్రి. 18 ✽ పెరెసు వంశక్రమం ఇలా ఉంది– పెరెసు కుమారుడు హెస్రోను. హెస్రోను కుమారుడు రము. 19 రము కుమారుడు అమ్మీనాదాబు. 20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. 21 శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. 22 ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.