20
1 అప్పుడు ఇస్రాయేల్‌వారు దానునుంచి బేర్‌షెబా వరకు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు కూడా, బయలుదేరి అంతా✽ ఏకమై మిస్పా✽ ఊరిదగ్గర యెహోవా సన్నిధానంలో సమావేశం అయ్యారు. 2 ఇస్రాయేల్ గోత్రాలన్నిటి ప్రజల నాయకులు కూడా దేవుని ప్రజల సమాజంలో హాజరయ్యారు. కత్తియుద్ధం చేయగల నాలుగు లక్షలమంది పదాతులు అక్కడ ఉన్నారు. 3 (ఇస్రాయేల్‌వారు మిస్పాకు వెళ్ళిపోయారని బెన్యామీను గోత్రంవారికి వినవచ్చింది). ఇస్రాయేల్‌వారు “ఈ నీచ కార్యం అసలు ఎలా జరిగిందో మాకు చెప్పండి” అని అడిగినప్పుడు, 4 వధయైన అమ్మాయి భర్త, ఆ లేవీ గోత్రికుడు ఇలా చెప్పాడు:“నేను, నా ఉంపుడుకత్తె రాత్రి గడుపుదామని బెన్యామీను ప్రదేశంలో గిబియాకు వెళ్ళాం. 5 రాత్రిపూట గిబియావాళ్ళు నా మీదికి వచ్చి, నేనున్న ఇంటిని చుట్టుముట్టారు. వాళ్ళు అసలు నన్ను చంపాలనుకొన్నారు. వాళ్ళు నా ఉంపుడుకత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. 6 నేను నా ఉంపుడుకత్తెను ముక్కలుగా కోసి, ఇస్రాయేల్‌వారికి వారసత్వంగా ఉన్న అన్ని ప్రదేశాలకు ఆ ముక్కలను పంపించాను. ఎందుకని? వాళ్ళు ఇస్రాయేల్‌లో పోకిరీపని, తెలివితక్కువ పని చేశారు. 7 ఇదిగో వినండి, ఇస్రాయేల్ వారలారా, మీరంతా ఈ విషయం ఆలోచించి ఏ తీర్పు చెప్తారో ఇక్కడే చెప్పండి.”
8 అప్పుడు ప్రజంతా ఒకే మాటమీద ఉండి, “మనలో ఎవ్వరూ తమ డేరాలకు వెళ్ళరు, ఎవ్వరూ ఇంటికి వెళ్ళరు. 9 గిబియాను ఒక పని చేస్తాం. మనం చీటీలు✽ వేసుకొని వాటి ప్రకారం దాని మీదికి వెళ్తాం. 10 ఇస్రాయేల్ అన్ని గోత్రాల నుంచి నూటికి పదిమందిని తీసుకొంటాం. బెన్యామీను ప్రదేశంలో గిబియా మీదికి వెళ్ళేవారికి భోజనాలు తేవడానికి వెయ్యిమందిలో వందమందిని, పదివేలమందిలో వెయ్యిమందిని అలాగే ఎన్నుకొంటాం. అప్పుడు గిబియా మీదికి వెళ్ళేవారు గిబియావాళ్ళు ఇస్రాయేల్‌లో జరిగించిన తెలివితక్కువ పనికి తగినట్టుగా✽ వాళ్ళను దండించగలరు” అని చెప్పారు. 11 ఈ విధంగా ఇస్రాయేల్ మనుషులంతా కలిసి ఈ ఊరికి వ్యతిరేకంగా ఒక్కుమ్మడిగా ఉన్నారు.
12 ఇస్రాయేల్‌గోత్రాలవారు బెన్యామీను గోత్రమంతటికీ ఈ కబురుతో మనుషులను పంపారు: “మీ మధ్య జరిగిన ఈ దుర్మార్గం సంగతి ఏమిటి? 13 గిబియాలో వున్న ఆ దుర్మార్గులను అప్పగించండి. మేము వాళ్ళను చంపి ఇస్రాయేల్‌లో ఈ దుర్మార్గం లేకుండా చేస్తాం✽.”
కానీ, బెన్యామీనువారు వారి సోదరులైన ఇస్రాయేల్‌వారి మాట వినిపించుకోలేదు. 14 ✽ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేయడానికి బెన్యామీనువారు తమ పట్టణాలనుంచి గిబియా దగ్గరికి వచ్చారు. 15 ఆ రోజు వారి వారి పట్టణాలనుంచి బయలుదేరి సైన్యంగా సమకూడిన బెన్యామీనువారు ఇరవై ఆరు వేలమంది. అందరూ కత్తియుద్ధం చేయగలవారు. వారు గాక గిబియా కాపురస్థులలో ఏరి తెచ్చినవాళ్ళు ఏడువందల మంది. 16 వీళ్ళందరిలోనూ ఎడమచేతి వాటం గల ఏడు వందల మంది ప్రత్యేకమైన వారున్నారు. ఒక్కొక్కరు ఒడిసెల✽లో రాయిపెట్టి, తలవెండ్రుకనైనా గురి తప్పకుండా కొట్టగలిగే వారు. 17 బెన్యామీనువారిని అలా ఉంచి, కత్తియుద్ధం చేసే ఇస్రాయేల్‌వారు నాలుగు లక్షల మంది లెక్కకు వచ్చారు. వారంతా యుద్ద అనుభవం గలవారు.
18 ఇస్రాయేల్‌వారు బయలుదేరి బేతేల్✽కు వచ్చి “బెన్యామీనువారి మీదికి యుద్ధానికి మాలో ఎవరు ముందు వెళ్ళాలి?” అని దేవుని దగ్గర విచారణ✽ చేశారు. “యూదావారు ముందు వెళ్ళాలి” అని యెహోవా జవాబిచ్చాడు.
19 ప్రొద్దున్నే ఇస్రాయేల్‌వారు లేచి గిబియా దగ్గర మకాం చేశారు. 20 గిబియా దగ్గర యుద్ధం చేయడానికి ఇస్రాయేల్ వారు బయలుదేరి బెన్యామీను వారికి ఎదురుగా బారులు తీరారు. 21 బెన్యామీనువారు గిబియాలో నుంచి బయటికి వచ్చి, ఆ రోజున ఇస్రాయేల్‌వారిలో ఇరవై రెండు వేలమందిని నేల కూల్చారు. 22 అయినా ఇస్రాయేల్‌వారు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొని, మొదటిరోజున ఉన్నచోటనే మళ్ళీ యుద్ధానికి బారులు తీరారు. 23 ✽ఎందుకంటే ఇస్రాయేల్ వారు వెళ్ళి యెహోవా సన్నిధానంలో సాయంత్రం వరకు ఏడ్చి “మా సోదరులైన బెన్యామీనువారి మీదికి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలా?” అని యెహోవా దగ్గర విచారణ చేస్తే, “వారి మీదికి వెళ్ళండి” అని యెహోవా జవాబిచ్చాడు.
24 అప్పుడు రెండోరోజు ఇస్రాయేల్‌వారు బెన్యామీను వారిని సమీపించారు. 25 రెండో రోజు కూడా బెన్యామీనువారు గిబియాలోనుంచి వచ్చి వారిని ఎదిరించారు. ఈ సారి వారు ఇస్రాయేల్‌వారిని పద్ధెనిమిది వేలమందిని చంపారు. వారంతా ఖడ్గం ధరించినవారు. 26 ✽అప్పుడు ఇస్రాయేల్‌వారంతా బయలుదేరి బేతేల్‌కు వచ్చి, అక్కడ యెహోవా సన్నిధానంలో కూర్చుని ఏడ్చారు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, హోమబలులు, శాంతిబలులు✽ యెహోవాకు అర్పించారు. 27 ఆ రోజులలో దేవుని ఒడంబడిక పెట్టె అక్కడే ఉంది. 28 అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు✽ దాని ముందు నిలబడి సేవ చేసేవాడు. ఇస్రాయేల్‌వారు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేస్తూ, “మా సోదరులైన బెన్యామీనువారిమీదికి యుద్ధానికి వెళ్ళాలా? వద్దా?” అని అడిగారు. అందుకు యెహోవా “వెళ్ళండి, రేపు వారిని మీ చేతికి✽ అప్పగిస్తాను” అని జవాబిచ్చాడు.
29 ఆ తరువాత ఇస్రాయేల్‌వారు గిబియా చుట్టూరా మాటు ఉంచారు. 30 మూడో రోజు ఇస్రాయేల్ వారు బెన్యామీనువారి మీదికి వెళ్ళి, మునుపటిలాగా గిబియాకు ఎదురుగా యుద్ధానికి బారులు తీరారు. 31 వారిని ఎదిరించడానికి బెన్యామీనువారు బయటికి వచ్చి పట్టణం నుంచి దూరం తీసుకొనిపోబడ్డారు. మునుపటిలాగా వారు ఇస్రాయేల్ వారిలో కొంతమందిని గాయపరచడం, హతం చేయడం మొదలుపెట్టారు. బేతేల్‌కు వెళ్ళే రాజమార్గంలో, గిబియాకు వెళ్ళే రాజమార్గంలో మైదానంలో సుమారు ముప్ఫయిమంది ఇస్రాయేల్‌వారు కూలారు. 32 “మునుపటి లాగే వారు మన ఎదుట హతం అవుతున్నారు” అని బెన్యామీనువారు చెప్పుకొన్నారు. ఇస్రాయేల్‌వారైతే “వాళ్ళు పట్టణం నుంచి రాజమార్గాలకు వచ్చేలా పారిపోదాం” అని చెప్పుకొన్నారు.
33 ఇస్రాయేల్‌వారు తామున్న చోటునుంచి బయలుదేరి బేత్‌తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటు దాగిన ఇస్రాయేల్‌వారు తమ స్థలంనుంచి గిబియాకు పడమటి వైపునుంచి ఒక్కసారి పరుగెత్తుకు వచ్చారు. 34 వెంటనే ఇస్రాయేల్‌వారందరిలో పదివేలమంది ఎంపిక చేయబడ్డ యోధులు గిబియాకు ఎదురుగా వచ్చారు. యుద్ధం హోరా హోరీగా జరుగుతూ ఉంది. విపత్తు తమను సమీపించిందని బెన్యామీనువారికి తెలియలేదు. 35 ✽బెన్యామీను వారు ఇస్రాయేల్‌వారి ముందు ఓడిపోయేలా యెహోవా చేశాడు. ఆ రోజున ఇస్రాయేల్‌వారు ఇరవై అయిదు వేల ఒక్క వందమంది బెన్యామీనువారిని చంపారు. వారంతా ఖడ్గం ధరించినవారు. 36 ఇక తమ ఓటమి బెన్యామీను వారికి అర్థం అయింది. ఇస్రాయేల్‌వారు గిబియా దగ్గర తాము మాటు ఉంచిన వారిమీద ఆధారపడి బెన్యామీనువారి ముందునుంచి వెనుకపడ్డారు.
37 వెంటనే మాటులో ఉన్నవారు గిబియాలో చొరబడ్డారు. వారు పట్టణమంతటినీ కత్తిపాలు చేశారు. 38 మాటు దాగినవారు పట్టణంలో నుంచి పొగ పెద్ద మేఘం లాగా లేవజేయాలని అంతకుముందే వారితో ఇస్రాయేల్‌వారు ఏర్పాట్లు చేసుకొన్నారు. 39 ఇస్రాయేల్‌వారు యుద్ధం నుంచి వెనుక తీశారు. బెన్యామీనువారు వారిని హతం చేయడం మొదలుపెట్టి సుమారు ముప్ఫయిమందిని చంపారు. “మొదటి యుద్ధంలోలాగే వాళ్ళు మనముందు ఓడిపోతున్నారు” అని బెన్యామీనువారు చెప్పుకొన్నారు. 40 అయితే అప్పుడు పట్టణంలో నుంచి స్తంభంలాగా పొగ పైకి లేవడం ఆరంభమైనది. బెన్యామీనువారు వెనక్కు తిరిగి చూశారు. పట్టణమంతా పోగై ఆకాశం వైపు లేస్తూ ఉంది! 41 అప్పుడు ఇస్రాయేల్‌వారు వారివైపుకు తిరిగారు. విపత్తు తమను సమీపించిందని తెలుసుకొని బెన్యామీనువారు హడలిపోయారు. 42 అందుచేత వారు ఇస్రాయేల్‌వారికి వీపు చూపి వారి బారినుంచి ఎడారివైపు పారిపోయారు. కానీ వారు ఆ యుద్ధంనుంచి తప్పించుకోలేకపోయారు. పట్టణాలలోనుంచి ఇస్రాయేల్‌వారు వచ్చి తమ మధ్య వారిని నాశనం చేశారు. 43 వారు బెన్యామీనువారిని చుట్టు ముట్టి, ఆగకుండా వారిని తరిమి, గిబియాకు తూర్పు దిక్కున వారిని విరగద్రొక్కివేశారు. 44 పద్ధెనిమిది వేలమంది బెన్యామీనువారు కూలారు, వారంతా యుద్ధవీరులు. 45 మిగతావారు ఎడారి వైపు, రిమ్మోను బండవైపు పారిపోతూ ఉన్నప్పుడు ఇస్రాయేల్‌వారు రహదారుల వెంట అయిదు వేల మందిని హతమార్చారు. వారింకా బెన్యామీను వారిని గిదోందాకా తరుముతూ ఇంకా రెండు వేల మందిని కూల్చారు. 46 ఆ రోజున కత్తి యుద్ధం చేసే బెన్యామీనువారు ఇరవై అయిదు వేలమంది కూలారు. వారంతా యుద్ధవీరులు. 47 కానీ, ఆరు వందలమంది మాత్రం తప్పించుకువెళ్ళి ఎడారిలో ఉన్న రిమ్మోను బండ దగ్గరికి చేరారు. అక్కడ నాలుగు నెలలు ఉండిపోయారు. 48 ✽ఇస్రాయేల్‌వారు బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్ళి పట్టణాల మీదపడి, పశువులను, కనిపించినదాన్నంతా కత్తిపాలు చేశారు. వారికి కనబడ్డ ప్రతి ఊరినీ తగలబెట్టారు.