19
1 ✝ఆ రోజుల్లో ఇస్రాయేల్‌ప్రజకు రాజు లేడు. లేవీ గోత్రికుడొకడు ఎఫ్రాయిం కొండసీమలో మారు మూల స్థలంలో కాపురముండేవాడు. అతడు యూదాలో బేత్‌లెహేంనుంచి ఒక ఉంపుడుకత్తెను తెచ్చి ఉంచుకొన్నాడు. 2 కానీ, ఆమె అతడికి వ్యతిరేకంగా వ్యభిచారం చేసింది. అతణ్ణి వదలి యూదాలో బేత్‌లెహేంకు తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ నాలుగు నెలలు ఉండిపోయింది. 3 బ్రతిమాలియైనా తీసుకువద్దామని ఆమె భర్త ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతడితో కూడా పరిచారకుడు, జత గాడిదలు ఉన్నాయి. ఆమె అతణ్ణి తన తండ్రి ఇంట్లోకి తీసుకుపోయింది. ఆమె తండ్రి అతణ్ణి చూడగానే సంతోషంతో ఆహ్వానించాడు. 4 అతడి మామ, అంటే ఆ అమ్మాయి తండ్రి అతణ్ణి ఉండమని బలవంతం చేశాడు, గనుక అతడు మూడు రోజులు అతడి దగ్గర తింటూ త్రాగుతూ రాత్రులు గడుపుతూ ఉన్నాడు. 5 నాలుగో రోజు వారు ప్రొద్దున్నే లేచి ప్రయాణం కట్టారు. అయితే ఆ అమ్మాయి తండ్రి అల్లుడితో “కొంత భోంచేసి సేద తీర్చుకో. ఆ తరువాత వెళ్ళవచ్చు” అన్నాడు.6 వాళ్ళిద్దరూ కూచుని కలిసి తిని త్రాగాక “ఈ రాత్రి కూడా ఉండి కులాసాగా గడపండి” అని ఆ అమ్మాయి తండ్రి అతడితో అన్నాడు. 7 వెళ్ళాలని అతడు నిలబడ్డప్పుడు అతడి మామ బలవంతం చేశాడు గనుక అతడు ఆ రాత్రి కూడా అక్కడ గడిపాడు. 8 అయిదో రోజు అతడు వెళ్ళాలని ప్రొద్దున్నే లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి “సేదతీర్చుకో. మధ్యాహ్నం దాకా ఉండు” అన్నాడు. అందుచేత వారిద్దరూ భోజనం చేస్తూ ఉండిపోయారు. 9 తరువాత అతడు తన ఉంపుడుకత్తెతో, పరిచారకుడితో బయలుదేరడానికి నిలబడ్డప్పుడు అతడి మామ, ఆ అమ్మాయి తండ్రి, “చూడండయ్యా! ప్రొద్దు క్రుంకనైవుంది. ఇక్కడే రాత్రి గడపండి. ఇదిగో, పొద్దు క్రుంకుతూ ఉంది! ఇక్కడే ఈ రాత్రి కులాసాగా గడపండి. ప్రొద్దున్నే లేచి మీ దారిన మీరు ఇంటికి వెళ్ళవచ్చు” అన్నాడు. 10 ✝కానీ, అతడు ఆ రాత్రి ఉండడానికి ఒప్పుకోలేదు. అతడు జీను వేసి రెండు గాడిదలతో, తన ఉంపుడుకత్తెతో బయలుదేరి, యెబూసు వైపుకు వెళ్ళాడు. (యెబూసు అంటే జెరుసలం.)
11 వారు యెబూసుకు దగ్గరగా వచ్చినప్పుడు సాయం కాలం అయింది. అప్పుడా పరిచారకుడు తన యజమానితో “ఈ యెబూసివాళ్ళ పట్టణంలోకి పోదాం రండి. రాత్రి ఇక్కడ గడపవచ్చు” అన్నాడు.
12 అందుకు అతడి యజమాని “ఇశ్రాయేల్ ప్రజ కాని పరాయివాళ్ళ పట్టణంలోకి వెళ్ళం. మనం గిబియా✽కు వెళ్తాం” అన్నాడు. 13 “పద, గిబియాకు గానీ రమాకు గానీ చేరి ఆ రెంటిలో ఒక చోట రాత్రి గడుపుదాం” అన్నాడు.
14 వారు ఆ స్థలం దాటి ముందుకు సాగారు. బెన్యామీను ప్రదేశంలోని గిబియా దగ్గరగా వచ్చినప్పుడు ప్రొద్దు క్రుంకి పోయింది. 15 వారు ఆ రాత్రి✽ అక్కడ గడపాలని ఆ పట్టణంలోకి వెళ్ళారు. ఆ రాత్రి ఎవరూ తమ ఇంటిలోకి వారిని ఆహ్వానించలేదు గనుక వారు పట్టణంమధ్య ఉన్న విశాల స్థలంలో కూచున్నారు.
16 ఆ సాయంకాల సమయంలో ఒక ముసలివాడు పొలాలలో పని ముగించి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమనుంచి వచ్చి గిబియాలో కాపురం ఉంటున్నాడు. గిబియావాళ్ళు బెన్యామీను గోత్రంవాళ్ళు. 17 ఆ ముసలివాడు తల ఎత్తి పట్టణం విశాలస్థలంలో ఉన్న ఆ ప్రయాణికుణ్ణి చూశాడు. “ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడనుంచి వచ్చారు?” అని అతడు అడిగాడు.
18 అందుకా లేవీగోత్రికుడు ఇలా జవాబిచ్చాడు: “మేము యూదా బేత్‌లెహేం నుంచి ఎఫ్రాయిం కొండప్రదేశంలో ఒక మారుమూల గ్రామానికి వెళ్తున్నాం. నేను అక్కడివాణ్ణి. యూదాలో బేత్‌లెహేంకు వెళ్ళాను. ఇప్పుడే నేను యెహోవా ఆరాధన స్థలానికి✽ వెళ్తున్నాను. ఎవరూ నన్ను ఇంట చేర్చు కోలేదు. 19 మా గాడిదలకు చిట్టు, ఎండుగడ్డి మా దగ్గర ఉన్నాయి, నాకు, మీ సేవిక అయిన ఈమెకు, మీ సేవకుడైన మాతో ఉన్న ఈ యువకుడికి రొట్టె, ద్రాక్షరసం ఉన్నాయి. మాకేమీ కొరత లేదు.”
20 ఆ ముసలివాడు “మీరు క్షేమంగా ఉండాలని నా కోరిక. మీకేమైనా కావలిస్తే నేను చూచుకొంటాను గాని, రాత్రి మాత్రం వీధిలో గడపకండి” అన్నాడు. 21 అలా చెప్పి అతణ్ణి తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. గాడిదలకు మేత వేశాడు. వారు కాళ్ళు కడుక్కొని, తింటూ త్రాగుతూ ఉన్నారు.
22 ✽ వారు సంతోషంగా అలా గడుపుతూ ఉంటే, ఆ పట్టణంలో ఉన్న నీచులు కొంతమంది ఆ ఇంటిని చుట్టు ముట్టారు. తలుపు బాదుతూ “నీ ఇంటికి వచ్చిన వాడెవడో మాకు తెలియాలి. వాణ్ణి బయటికి తీసుకురా! అని వాళ్ళు ఇంటి యజమానుడైన ఆ ముసలివాడితో చెప్పారు.” 23 ✝అప్పుడా ఇంటి ఆసామి వాళ్ళ దగ్గరికి బయటికి వచ్చి “సోదరులారా, అంత నీచమైనది చేయకండి. ఆ మనిషి నా ఇంటికి వచ్చాడు. అంత తెలివితక్కువ పని చెయ్యకండి. 24 ✽ ఇదిగో, నా కూతురు ఉంది. ఆమె కన్య. ఆ మనిషి ఉంపుడు కత్తె ఉంది. మీకు కావాలంటే నేను వాళ్ళను బయటికి తీసుకువస్తాను. మీరు వాళ్ళను లొంగదీసి ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. కానీ, ఈ మనిషిపట్ల ఇంత నీచ పని చేయకండి” అని వాళ్ళతో చెప్పాడు. 25 ✽అతని మాట వినడానికి వాళ్ళకు మనసు లేదు. కనుక ఆ లేవీగోత్రికుడు తన ఉంపుడుకత్తెను బయటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేట్టు చేశాడు. వాళ్ళు ఆమెను పట్టుకొని రాత్రంతా మానభంగం చేస్తూ బాధిస్తూ ఉన్నారు. తెల్లవారుతూ ఉంటే వాళ్ళు ఆమెను వెళ్ళనిచ్చారు. 26 ప్రొద్దున్నే ఆమె తన యజమాని ఉన్న ఆ ముసలివాడి ఇంటికి తిరిగివచ్చి, ప్రొద్దు పొడిచే వరకు తలుపు దగ్గర పడి ఉండి. 27 ఉదయం ఆమె యాజమాని లేచి, ఇంటి తలుపు తీసి తన దారిన వెళ్ళడానికి బయటికి వచ్చి చూస్తే, అతని ఉంపుడుకత్తె ఇంటి తలుపు దగ్గర పడి ఉంది. ఆమె చేతులు గడపమీదికి చాచి ఉన్నాయి. 28 “లే! మనం వెళ్దాం✽” అని అతడు ఆమెతో అన్నాడు. జవాబు లేదు. అప్పుడు అతడు ఆమెను తన గాడిద మీద ఉంచి, బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయాడు. 29 అతడు ఇంటికి చేరినప్పుడు కత్తి పట్టుకొని తన ఉంపుడుకత్తెను పన్నెండు ముక్కలుగా ఏ అవయవానికి ఆ అవయవం కోసి, ఇస్రాయేల్✽ వారి ప్రాంతాలన్నింటికీ పంపించాడు. 30 అది చూచిన వారంతా “ఇస్రాయేల్ ప్రజలు ఈజిప్ట్‌నుంచి వచ్చిన రోజులనుంచి ఇంతవరకూ ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఎక్కడా కనిపించలేదు. ఈ విషయం ఆలోచించండి! చర్చించండి! ఏం చెయ్యాలో చెప్పండి!” అంటూ చెప్పుకొన్నారు.