18
1 ఆ రోజుల్లో ఇస్రాయేల్‌ప్రజకు రాజు లేడు. ఆ కాలంలో దాను గోత్రంవారు ఉండడానికి సొంత స్థలంకోసం వెదకుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇస్రాయేల్ గోత్రాలతోపాటు దాను గోత్రంవారు వారసత్వంగా సొంత స్థలం పొందలేదు. 2 అందుచేత దేశాన్ని చూచి గాలించడానికి జోర్యానుంచి, ఎష్‌తాయోల్‌నుంచి అయిదుగురు శూరులను దానువారు పంపారు. ఆ అయిదుగురు దానువారి వంశాలన్నిటికీ ప్రతినిధులుగా ఉన్నారు. దానువారు “మీరు వెళ్ళి దేశాన్ని బాగా గాలించండి” అని వారితో చెప్పారు. వారు ఎఫ్రాయిం కొండసీమకు చేరి, మీకా ఇంటికి వచ్చి, అక్కడ రాత్రి గడిపారు. 3 మీకా ఇంటి దరిదాపులలో ఉన్నప్పుడు వారు లేవీగోత్రికుడైన ఆ యువకుడి స్వరం గుర్తుపట్టారు. కనుక ఆ ప్రక్కకు తిరిగి, “ఇక్కడికి మిమ్మల్ని ఎవరు తీసుకువచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరెందుకు ఉన్నట్టు?” అని వారు అతణ్ణి ప్రశ్నించారు. 4 తన కోసం మీకా చేసినది ఇతడు వారికి తెలియజేసి, “మీకా నన్ను జీతానికి కుదుర్చుకొన్నాడు. నేను అతడి యాజిని” అన్నాడు.
5 అప్పుడు వారు “మా ప్రయాణం సఫలం అవుతుందో లేదో మేము తెలుసుకొనేలా దయచేసి దేవుని దగ్గర విచారించండి” అని అతణ్ణి అడిగారు.
6 అందుకు ఆ యాజి “క్షేమంగా వెళ్ళండి. మీ ప్రయాణాన్ని యెహోవా ఆమోదించాడు” అని బదులు చెప్పాడు.
7 అప్పుడు ఆ అయిదుగురు మనుషులు అక్కడనుంచి బయలుదేరి లాయిషుకు వచ్చారు. అక్కడివాళ్ళు సీదోను నగరవాసులలాగా నెమ్మదిగా, నిర్భయంగా ఉండడం వారు చూశారు. ఆ ప్రాంతంలో వాళ్ళను దౌర్జన్యం చేసే అధికారులెవరూ లేరు. వాళ్ళు సీదోనువాళ్ళకు దూరంగా ఉన్నారు. ఇంకా ఏ జనంతోనూ పొత్తు లేకుండా ఉన్నారు. 8 ఆ అయిదుగురు మనుషులు జోర్యాకు ఎష్‌తాయోల్‌కు తమ సోదరుల దగ్గరికి తిరిగి వచ్చారు.
వారి సోదరులు “మీరు ఏం చూశారు?” అని అడిగారు.
9 వారు ఇలా జవాబిచ్చారు: “లెండి! వాళ్ళమీద దాడి చేద్దాం. ఆ ప్రాంతాన్ని చూశాం. అది చాలా మంచిది. మీరింకా చూస్తారేం? ఆలస్యం చేయక అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోండి. 10 మీరు అక్కడికి చేరిన తరువాత, నిర్భయంగా ఉన్న జనాన్ని, విశాల ప్రదేశాన్ని చూస్తారు. భూమి మీద వస్తువుల్లో అక్కడ కొరత ఏదీ లేదు. ఆ ప్రాంతాన్ని దేవుడు మీ చేతులకు అప్పగించాడు.”
11 అప్పుడు దాను గోత్రంలో ఆరు వందలమంది యుద్ధాయుధాలను కట్టుకొని జోర్యా, ఎష్‌తాయోల్‌నుంచి బయలుదేరారు. 12 వారు ప్రయాణమైపోయి యూదా ప్రదేశంలో ఉన్న కిర్యత్‌యారీం దగ్గర మకాం చేశారు. అందుచేత ఈ నాటికీ కిర్యత్ యారీంకు పడమరగా ఉన్న స్థలాన్ని ‘మహనే దాను’ అంటారు. 13 వారు అక్కడనుంచి ఎఫ్రాయిం కొండసీమకు వెళ్ళి మీకా ఇంటికి చేరారు. 14 లాయిషు ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళిన ఆ అయిదుగురు వారి సోదరులతో, “ఈ ఇండ్లలో ఒక దానిలో ఏఫోదు, గృహదేవతలు, చెక్కిన విగ్రహం, పోతపోసిన విగ్రహం ఉన్నాయని తెలుసా? ఇప్పుడు ఏం చెయ్యాలో మీకు తెలుసు గదా” అన్నారు.
15 వారు ఆ ప్రక్కకు తిరిగి, మీకా ఇంటికి లేవీగోత్రికుడైన ఆ యువకుడి దగ్గరికి వెళ్ళి అతణ్ణి కుశల ప్రశ్నలడిగారు.
16 యుద్ధాయుధాలు ధరించిన ఆ ఆరు వందలమంది దాను గోత్రంవారు ద్వార ప్రవేశంలో నిలబడ్డారు. 17 దేశం సంచరించి చూడడానికి వెళ్ళిన ఆ అయిదుగురు లోపలికి వెళ్ళి, ఆ చెక్కిన విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను, పోతపోసిన విగ్రహాన్ని పట్టుకున్నారు. అంతలో ఆ పూజారి, యుద్ధాయుధాలు ధరించిన ఆ ఆరు వందల మంది ద్వార ప్రవేశంలో నిలబడి ఉన్నారు. 18 మీకా ఇంట్లోకి వెళ్ళినవారు ఆ విధంగా చెక్కిన విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను, పోతపోసిన విగ్రహాన్ని పట్టుకొన్నప్పుడు “మీరు ఏం చేస్తున్నారు?” అని పూజారి అడిగాడు.
19 అందుకు వారు “ఊరుకో! ఏమనకుండా మాతో రా! నీవు మాకు తండ్రిగా, యాజిగా ఉండు. ఇస్రాయేల్‌లో ఒక గోత్రానికి, ఒక వంశానికి యాజిగా ఉండడం మంచిదా? ఒకడి ఇంటివాళ్ళకే యాజిగా ఉండడం మంచిదా?” అని బదులు చెప్పారు.
20 అప్పుడు యాజికి సంతోషం వేసింది. అతడు ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కిన విగ్రహాన్ని తీసుకొని వారితో వెళ్ళాడు. 21 చిన్న పిల్లలను, పశువులను, ఆస్తిపాస్తులను ముందుగా ఉంచి వారు అక్కడనుంచి బయలుదేరారు.
22 వారు అలా మీకా ఇంటినుంచి కొంత దూరం వెళ్ళాక, మీకా ఇంటికి దగ్గర ఉన్న ఇండ్లవారు పోగై, దాను గోత్రంవారి వెంటబడి వారి దరిదాపులకు చేరారు. 23 వారు కేకలు వేసి దానువారిని పిలుస్తూ ఉంటే, దానువారు వెనక్కు తిరిగి, “మీకేం పట్టింది? ఇలా గుంపుగా రావడం దేనికి?” అని మీకాను అడిగారు.
24 “నేను చేసుకొన్న దేవతలను, నా యాజిని మీరు తీసుకుపోలేదూ! ఇక నాకు ఏమి మిగిలింది? పైగా ‘మీకు ఏం పట్టింది?’ అని మీరడుగుతున్నారేం?” అని మీకా జవాబిచ్చాడు.
25 దానువారు అతడితో ఇలా అన్నారు: “మాతో మాట్లాడకు! రెచ్చిపోయినవాళ్ళెవరో నీమీద పడతారు. నీకూ, నీ కుటుంబానికి చావే గతి అవుతుంది, తెలుసా!”
26 అప్పుడు దానువారు తమ దారిన వెళ్ళిపోయారు. వారు తనకంటే బలంగా ఉండడం చూచి మీకా వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
27 మీకా చేసిన వాటిని, అతడి యాజిని తీసుకొని దానువారు లాయిషులో నెమ్మదిగా నిర్భయంగా ఉన్న జనంపైకి వెళ్ళారు. ఖడ్గంతో ఆ జనాన్ని హతమార్చి ఆ పట్టణాన్ని తగలబెట్టారు. 28 ఆ జనం సీదోనుకు దూరంగా ఉండడంచేత, ఇంకా ఏ జనంతో పొత్తు లేకపోవడంచేత వాళ్ళను విడిపించేవారెవరూ లేకపోయారు. ఆ పట్టణం బేత్‌రెహోబు దగ్గర ఉన్న లోయలో ఉంది. దానువారు ఆ పట్టణాన్ని మళ్ళీ నిర్మించి అందులో కాపురమేర్పరచుకొన్నారు. 29 దానికి మొదట లాయిషు అనే పేరు ఉంది గాని, వారు తమ పూర్వీకుడూ, ఇస్రాయేల్ కొడుకూ అయిన దాను పేర దానికి దాను అనే పేరు పెట్టారు. 30 ఆ చెక్కుడు విగ్రహాన్ని దానువారు తమకోసం నిలుపుకొన్నారు. దేశ ప్రజలు బందీలుగా పోయేకాలం వరకు మోషే కొడుకు గెర్షోం సంతతివాడైన యోనాతాను, అతడి సంతానం దానుగోత్రం వారికి యాజులుగా ఉన్నారు. 31 షిలోహులో దేవుని ఆరాధన స్థలం ఉన్నంతకాలం, మీకా చేసిన ఆ విగ్రహాన్ని నిలుపుకొని ఉన్నారు.