17
1 ఎఫ్రాయిం కొండసీమలో మీకా✽ అనే పేరుగలవాడు ఉండేవాడు. 2 అతడు తన తల్లితో “నీ పదకొండు వందల తులాల వెండి✽ దొంగిలించడం జరిగింది గదా. దాని విషయం నీవు శపించడం✽ నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది. నేనే దానిని తీసుకొన్నాను” అన్నాడు.అందుకు అతడి తల్లి “కుమారా! యెహోవా నిన్ను దీవిస్తాడు గాక!” అంది. 3 ✽అతడు ఆ పదకొండు వందల తులాల వెండి తిరిగి తన తల్లికి ఇచ్చాడు. అప్పుడు తల్లి ఇలా అంది:
“నా కొడుకు ఒక విగ్రహాన్ని చెక్కించేలా మరో విగ్రహాన్ని పోతపోయించేట్టు నేను ఈ వెండి అంతా యెహోవాకు ప్రతిష్ఠ చేస్తున్నాను. అది నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను.” 4 అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చివేసిన తరువాత ఆమె దానిలో రెండు వందల తులాల వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహాన్ని చెక్కాడు, మరో విగ్రహాన్ని పోతపోశాడు. వాటిని మీకా ఇంటిలో ఉంచారు. 5 ఈ మీకాకు దైవపీఠం ఒకటి ఉంది. అతడు ఏఫోదు✽, ఇంకా కొన్ని విగ్రహాలను చేయించి తన కొడుకులలో ఒకణ్ణి తన పూజారి✽గా ప్రతిష్ఠించారు. 6 ✝ఆ రోజుల్లో ఇస్రాయేల్‌ప్రజకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినట్టే వారు చేసేవారు.
7 యూదా ప్రదేశంలో బేత్‌లెహేంలో యూదా గోత్రం మధ్య చేరిన లేవీగోత్రికుడైన✽ యువకుడు ఒకడు ఉండేవాడు. 8 అతడు యూదా బేత్‌లెహేం ఊరు వదలి, ఉండడానికి మరో స్థలం వెదకుతూ తరలివెళ్ళాడు. ప్రయాణం చేస్తూ ఉంటే అతడు ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. 9 మీకా అతణ్ణి చూచి “మీరు ఎక్కడనుంచి వచ్చారు?” అని అడిగాడు.
అందుకతడు “నేను యూదాలో బేత్‌లెహేంనుంచి వచ్చాను. నేను లేవీగోత్రికుణ్ణి. ఉండడానికి ఏదైనా చోటుకోసం వెదకుతున్నాను” అని బదులు చెప్పాడు.
10 అప్పుడు మీకా “నాదగ్గర ఉండండి. నాకు తండ్రి✽గా, పూజారిగా ఉండండి. నేను మీకు ఏడాదికి పది తులాల వెండి, బట్టలు, భోజనం ఇస్తాను” అని అతడితో చెప్పాడు.
11 ✽ఆ లేవీగోత్రికుడు మీకాతో ఉండడానికి ఒప్పుకొన్నాడు. ఆ యువకుడు మీకాకు అతడి కొడుకులలో ఒకడుగా ఉన్నాడు.
12 మీకా ఆ లేవీగోత్రికుణ్ణి ప్రతిష్ఠ చేశాడు. ఆ యువకుడు అతడికి పూజారి అయి, అతడి ఇంటిలో ఉన్నాడు.
13 ✽“యెహోవా నాకు మేలు చేస్తాడని ఇప్పుడు నాకు తెలుసు. లేవీగోత్రికుడు నాకు పూజారిగా ఉన్నాడు గదా!” అని మీకా అనుకొన్నాడు.