16
1 ఒకరోజు సమ్సోను గాజాకు వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూచి ఆమెతో పోయాడు. 2 సమ్సోను అక్కడే ఉన్నాడని గాజా పట్టణస్తులకు తెలిసింది. గనుక వాళ్ళు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, పట్టణం ద్వారం దగ్గర రాత్రంతా అతని కోసం కాపలా కాశారు. “తెల్లవారేటప్పుడు అతణ్ణి చంపుదాం” అనుకొని వాళ్ళు రాత్రివేళ కదలకుండా ఉన్నారు. 3 అయితే సమ్సోను మధ్యరాత్రి వరకే పడుకొన్నాడు. అప్పుడు లేచి, పట్టణం ద్వారం తలుపులను, వాటి రెండు స్తంభాలను పట్టుకొని, వాటిని అడ్డకర్రతోపాటు ఊడబీకి, భుజాలమీద వేసుకొని, హెబ్రోనుకు ఎదురుగా ఉండే కొండ కొనకు వాటిని మోసుకుపోయాడు.
4 ఆ తరువాత శోరేక్ లోయలో ఉన్న ఒకామెను అతడు ప్రేమించాడు. ఆమె పేరు దెలీలా. 5 ఫిలిష్తీయవాళ్ళ నాయకులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు:
“నువ్వు అతణ్ణి వలలో వేసుకో. అతడి గొప్ప బలం రహస్యమేమిటో, అతణ్ణి మేము గెలిచి కట్టివేసి లొంగదీసు కోవడానికి ఏం చెయ్యాలో తెలుసుకో. అప్పుడు నీకు మేం ఒక్కొక్కరం పన్నెండు వందల వెండి నాణేలు ఇస్తాం”.
6 అందుచేత దెలీలా “మీ గొప్ప బలానికి రహస్యం ఏమిటో నాకు చెప్పండి. మిమ్మల్ని కట్టివేసి లొంగదీయడం ఎలా?” అని సమ్సోనును అడిగింది.
7 దానికి సమ్సోను ఇలా బదులు చెప్పాడు: “ఎన్నడూ ఎండని ఏడు పచ్చి నారలతో నన్ను ఎవరైనా కట్టివేస్తే, నా బలం ఉడిగిపోయి మామూలు మనిషిలాగా అయిపోతాను.” 8 అప్పుడు ఫిలిష్తీయవాళ్ళ నాయకులు ఎన్నడూ ఎండని ఏడు పచ్చి నారలను తెచ్చారు. ఆమె అతణ్ణి వాటితో కట్టివేసింది. 9 లోపలి గదిలో మనుషులు దాగి ఉన్నారు. ఆమె “సమ్సోను! ఫిలిష్తీయవాళ్ళు మీమీదికి వచ్చేస్తున్నారు!” అని అరచింది.
అయితే మంట దగ్గరికి తెచ్చిన నూలుపోగు తెగిపోయినట్లు అతడు ఆ నారలను తెంపివేశాడు. అందుచేత అతని బలరహస్యం వెల్లడి కాలేదు.
10 అప్పుడు దెలీలా సమ్సోనుతో ఇలా అంది: “మీరు నన్ను మోసపుచ్చి నవ్వులపాలు చేశారు. ఇప్పుడు చెప్పండి – మిమ్మల్ని బంధించడం ఎలా?”
11 అందుకు సమ్సోను “ఎన్నడూ వాడని క్రొత్త తాళ్ళతో నన్ను కట్టివేస్తే, నా బలం ఉడిగిపోయి మామూలు మనిషిలాగా అయిపోతాను” అని బదులు చెప్పాడు.
12 దెలీలా కొత్త త్రాళ్ళు తెచ్చి వాటితో అతణ్ణి కట్టివేసింది. “సమ్సోను! ఫిలిష్తీయవాళ్ళు మీమీదికి వచ్చేస్తున్నారు!” అని అరచింది. వాళ్ళు లోపలి గదిలో దాగి ఉన్నారు. కానీ, అతడు చేతులకున్న ఆ త్రాళ్ళు దారాలలాగా తెంపివేశాడు.
13 అప్పుడు దెలీలా సమ్సోనుతో ఇలా అంది: “ఇప్పటిదాకా నన్ను మోసపుచ్చి నవ్వులపాలు చేశారు. మిమ్మల్ని బంధించడం ఎలా? చెప్పండి!”
అతడు “నా తలవెండ్రుకల ఏడు జడలను మగ్గంలో ఉన్న నేతలాగా అల్లితే, నన్ను బంధించవచ్చు” అని ఆమెతో చెప్పాడు.
14 అతడు నిద్రపోయినప్పుడు ఆమె అలా చేసి మేకుతో గట్టిగా బిగించింది.
“సమ్సోను! మీ మీదికి ఫిలిష్తీయవాళ్ళు వచ్చేస్తున్నారు!” అని మళ్ళీ అరచింది.
అతడు నిద్ర మేల్కొని మగ్గం మేకును నేతను ఊడలాగి వేశాడు.
15 అప్పుడు ఆమె “నన్ను ప్రేమిస్తున్నారంటున్నారు, ఏది? మీకు నామీద మక్కువ లేనేలేదు. మీ గొప్ప బలంయొక్క రహస్యం నాకు చెప్పక ఇప్పటికి మూడు సార్లు నన్ను నవ్వులపాలు చేశారు” అని అతనితో చెప్పింది.
16 రోజు వెంబడి రోజు ఆమె అతణ్ణి సూటిపోటి మాటలతో పీడిస్తూ వచ్చింది. దానితో విసుగు వచ్చి అతనికి చస్తే బావుండు అనిపించింది. 17 అందుచేత అతడు ఆమెతో అంతా చెప్పాడు.
“నేను పుట్టినప్పటి నుంచి దేవునికి నాజీర్‌గా ప్రత్యేకించబడ్డవాణ్ణి. నా తలమీద ఇంతవరకు ఎన్నడూ మంగలికత్తి పెట్టలేదు. నా తల గొరిగితే నా బలం ఉడిగి పోతుంది. నేను బలహీనమై మామూలు మనిషిలాగా అయిపోతాను” అన్నాడు.
18 అతడు తనతో అంతా చెప్పాడని దెలీలా గ్రహించింది. వెంటనే ఆమె ఫిలిష్తీయ నాయకులకు ఇలా కబురంపింది. “మళ్ళీ ఒకసారి రండి. అతడు నాకంతా చెప్పాడు”. ఫిలిష్తీయ నాయకులు చెప్పిన ఆ వెండి చేతపట్టుకొని ఆమె దగ్గరికి వచ్చారు. 19 ఆమె తన తొడ మీద అతణ్ణి నిద్రపోయేలా చేసి, ఒక మనిషిని పిలిపించి, సమ్సోను తలమీద ఉన్న ఏడు జడలు గొరిగించింది. అప్పుడామె అతణ్ణి బాధించడం మొదలు పెట్టింది. అతని బలం ఉడిగిపోయింది.
20 “సమ్సోను! ఫిలిష్తీయవాళ్ళు మీ మీదికి వచ్చేస్తున్నారు” అని ఆమె అరచింది. అతడు నిద్ర మేల్కొని “మునుపులాగే బయటికి వెళ్ళి దులుపుకొని విజృంభిస్తాను” అనుకొన్నాడు. యెహోవా తనను విడిచిపెట్టాడని అతనికి తెలియదు.
21  వెంటనే ఫిలిష్తీయవాళ్ళు అతణ్ణి పట్టుకొన్నారు. అతని కళ్ళు ఊడబీకారు. అతణ్ణి గాజాకు తీసుకుపొయ్యారు. అక్కడ అతణ్ణి కంచు గొలుసులతో కట్టివేసి, ఖైదులో తిరగలి విసిరేవాడుగా చేశారు.
22 అయితే గొరిగిన అతని తలవెండ్రుకలు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి.
23 ఫిలిష్తీయ నాయకులు “మన దేవుడు మన శత్రువు సమ్సోనును మన వశం చేశాడు” అని చెప్పి, తమ దేవుడు దాగోనుకు గొప్ప బలి చేయడానికీ, మహోత్సవం జరుపు కోవడానికీ సమకూడారు. 24 సమ్సోనును చూచి ప్రజలు తమ దేవుళ్ళను ఇలా స్తుతించారు:
“మన శత్రువు మన దేశాన్ని పాడు చేసి, మన వారిలో చాలామందిని చంపాడు. ఇప్పుడు మన శత్రువును మన దేవుడు మన వశం చేశాడు.”
25 వాళ్ళ హృదయాలు సంతోషంతో నిండిపోయి “మన వినోదానికి సమ్సోనును బయటికి తీసుకురండి” అని అరిచారు.
అలాగే సమ్సోనును ఖైదునుంచి రప్పించారు. అతడు వాళ్ళ పరిహాసానికి గురి అయ్యాడు. వాళ్ళు అతణ్ణి స్తంభాలమధ్య నిలబెట్టినప్పుడు. 26 తన చెయ్యి పట్టుకొన్న దాసుడితో సమ్సోను, “గుడికి ఆధారమైన స్తంభాలపై ఆనుకొంటాను. నన్ను వాటిని తాకనియ్యి” అన్నాడు.
27 గుడి స్త్రీ పురుషులతో నిండి ఉంది. ఫిలిష్తీయ నాయకులంతా అక్కడ ఉన్నారు. అలా సమ్సోను వాళ్ళ పరిహాసానికి గురి అవుతూ ఉంటే పైకప్పు మీద కూడా దాదాపు మూడు వేలమంది స్త్రీ పురుషులు చూస్తూ ఉన్నారు.
28 అప్పుడు సమ్సోను యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవాప్రభూ! నన్ను తలచుకో! దేవా! దయవుంచి ఈ ఒక్కసారి నన్ను బలపరచు. నా రెండు కండ్లకోసం ఫిలిష్తీయవాళ్ళమీద ఒక్క దెబ్బతో ప్రతీకారం తీర్చుకోనియ్యి.”
29 అప్పుడు సమ్సోను గుడికి ఆధారమైన రెండు మధ్య స్తంభాలను ఒక దానిని కుడిచేతితో, మరొక దానిని ఎడమ చేతితో పట్టుకొన్నాడు. 30 సమ్సోను “ఫిలిష్తీయ వాళ్ళతో కూడా నేనూ చస్తాను” అని చెప్పి బలమంతటితో వంగాడు. గుడి ఆ నాయకులమీద, దానిలో వున్న ప్రజలందరిమీదా కూలింది. ఆ విధంగా సమ్సోను బ్రతికి ఉన్నప్పుడు చంపినవాళ్ళకంటే, చనిపోయేటప్పుడు చంపినవాళ్ళు ఎక్కువమంది.
31 అప్పుడు అతని అన్నదమ్ములు, అతని తండ్రి కుటుంబం వారంతా వచ్చి అతని మృతదేహాన్ని తీసుకుపొయ్యారు. జోర్యాకు ఎష్‌తాయోల్‌కు మధ్య ఉన్న అతని తండ్రి సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. సమ్సోను ఇస్రాయేల్‌ప్రజకు ఇరవై సంవత్సరాలు నాయకుడుగా ఉన్నారు.