15
1 కొన్ని రోజులైన తరువాత, గోధుమ కోతకాలంలో సమ్సోను ఒక మేకపిల్లను తీసుకొని భార్యను చూద్దామని వెళ్ళాడు. అక్కడ “నా భార్య దగ్గరికి లోపలికి వెళ్తాను” అన్నాడు. కాని, ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.
2 “మీరు నిజంగా ఆమెను పూర్తిగా అసహ్యించుకొన్నారు అనుకొని నేను ఆమెను మీ స్నేహితుడికి ఇచ్చేశాను. ఆమె చెల్లెలు ఆమెకంటే అందమైనది గదా! ఆమెకు బదులు ఈమెను తీసుకోండి” అని ఆమె తండ్రి చెప్పాడు.
3 అప్పుడు వాళ్ళతో సమ్సోను “నేనీసారి ఫిలిష్తీయవాళ్ళకు ఏం కీడు చేసినా తప్పు ఉండదు” అన్నాడు.
4 సమ్సోను బయటికి వెళ్ళి మూడు వందల నక్కలను పట్టుకొన్నాడు. వాటిని జతజతలుగా చేసి వాటి తోకకు తోకను ముడివేసి కాగడాలు తెచ్చి, ఆ రెండు తోకల మధ్యన ఒక్కో కాగడా కట్టాడు. 5 అప్పుడు కాగడాలు వెలిగించి ఫిలిష్తీయ వాళ్ళ గోధుమ పంటచేలలోకి ఆ నక్కలను వదిలాడు. ఆ విధంగా పనలను, పైరును, ద్రాక్షతోటలను ఆలీవ్‌చెట్ల తోటలను తగలబెట్టాడు.
6 ఫిలిష్తీయవాళ్ళు “ఎవడురా ఇలా చేసినది? అని అడిగితే, ఎవరో ‘తిమ్నాతువాడి అల్లుడు సమ్సోను’. ఎందుకంటే, అతడి భార్యను అతడి స్నేహితుడికి ఇచ్చారు” అని తెలియజేశారు. అందుచేత ఫిలిష్తీయవాళ్ళు వెళ్ళి ఆమెను, ఆమె తండ్రిని నిప్పంటించి తగలబెట్టారు.
7 “మీరిలా చేశారు గనుక మీమీద పగతీర్చుకొనేదాకా నేను ఆగను” అని సమ్సోను వాళ్ళతో అన్నాడు.
8 వెంటనే అతడు వాళ్ళపై విరుచుకుపడి భయంకరంగా వాళ్ళను చాలమందిని హతమార్చాడు. తరువాత అతడు వెళ్ళిపోయి ‘ఏతాం’ బండ గుహలో ఉండిపోయాడు.
9 అప్పుడు ఫిలిష్తీయవాళ్ళు బయలుదేరి యూదా ప్రదేశంలో లేహీ దగ్గర వ్యాపించి మకాం చేశారు.
10 “మీరు మా మీదికి దండెత్తి వచ్చారెందుకు?” అని యూదావారు అడిగారు.
“మేం సమ్సోనును బంధించి, అతడు మాకు ఎలా చేశాడో మేమూ అతడికి అలాగే చేద్దామని వచ్చాం” అని ఫిలిష్తీయ వాళ్ళు జవాబిచ్చారు.
11 అప్పుడు మూడు వేలమంది యూదావారు ఏతాం బండ గుహకు వెళ్ళి, సమ్సోనుతో ఇలా అన్నారు:
“ఫిలిష్తీయవాళ్ళు మనమీద అధికారులని మీకు తెలీదా? మరి మీరు మా మీదికి ఏం తెచ్చి పెట్టారు?”
అందుకతడు “వాళ్ళు నాకెలా చేశారో నేనూ వాళ్ళకలా చేశాను అంతే” అన్నాడు.
12 “మిమ్మల్ని కట్టి ఫిలిష్తీయవాళ్ళకు అప్పగించడానికి మేం వచ్చాం” అని వారు అతనితో చెప్పారు.
సమ్సోను “మీరు మాత్రం నన్ను చంపమని నాకు శపథం చేయండి” అన్నాడు.
13 వారు “సరే, నిన్ను గట్టిగా బంధించి వాళ్ళకు అప్పగిస్తాం గాని, చంపము” అని జవాబిచ్చారు.
అప్పుడు వారు అతణ్ణి రెండు క్రొత్త త్రాళ్ళతో బంధించి బండ దగ్గరనుంచి తీసుకువచ్చారు. 14 అతడు లేహీ సమీపంగా వచ్చేటప్పటికీ ఫిలిష్తీయవాళ్ళు కేకలు వేస్తూ అతడి దగ్గరికి వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతణ్ణి ఆవరించాడు. అతని చేతులకు ఉన్న త్రాళ్ళు కాలిపోయిన నారలాగా అయి పొయ్యాయి. అతని చేతుల మీదనుంచి కట్లు ఊడిపొయ్యాయి. 15 అక్కడ అతనికి గాడిద దవడ ఎముక పచ్చిది ఒకటి దొరికింది. అతడు దానిని చేతపట్టుకొని దానితో వెయ్యిమందిని హతమార్చాడు.
16 అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “గాడిద దవడ ఎముకతో వాళ్ళను కుప్పలుగా కూల్చాను. గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపాను.”
17 అతడు అలా చెప్పి చేతిలో ఉన్న దవడ ఎముకను అవతల పారవేశాడు. ఆ స్థలానికి ‘రామాత్‌లేహి’ అని పేరు పెట్టాడు.
18 అప్పుడు అతనికి బాగా దప్పికయింది. “నీ సేవకుడైన నా చేతితో ఈ గొప్ప విడుదల ప్రసాదించావు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతి పొందనివాళ్ళ చేతులకు చిక్కుపడాలా?” అని యెహోవాకు ప్రార్థన చేశాడు.
19 అప్పుడు దేవుడు లేహిలో పల్లంగా ఉన్న స్థలాన్ని చీల్చాడు. దానిలోనుంచి నీళ్ళు వచ్చాయి. సమ్సోను త్రాగి నప్పుడు అతనికి ప్రాణం తెప్పరిల్లింది, బలం వచ్చింది. అందుచేత దానికి ‘ఏన్‌హక్కోరె’ అని పేరు వచ్చింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.
20 ఫిలిష్తీయవాళ్ళ రోజులలో సమ్సోను ఇరవై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు.