14
1 సమ్సోను తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఫిలిష్తీయజాతి అమ్మాయి ఒకతె అతనికి కనిపించింది. 2 అతడు తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చి వారితో “నేను తిమ్నాతులో ఫిలిష్తీయ జాతి అమ్మాయిని ఒకదానిని చూశాను. నాకామెను పెళ్ళి చేయండి✽” అన్నాడు.3 కానీ, అతని తల్లిదండ్రులు “నీ బంధువులలో గానీ, మన ప్రజలందరిలో గానీ నీకు తగిన అమ్మాయి లేదా? అమ్మాయికోసం సున్నతి సంస్కారం లేని✽ ఫిలిష్తీయవాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలా?” అని అతనితో చెప్పారు.
అయితే సమ్సోను తన తండ్రితో “నాకోసం ఆమెను తెప్పించు. ఆమె నాకు నచ్చింది” అన్నాడు. 4 ఇదంతా యెహోవా ద్వారా✽ జరిగిందనీ, ఫిలిష్తీయవాళ్ళకు కీడు చేయడానికి యెహోవా అవకాశంకోసం చూస్తున్నాడనీ సమ్సోను తల్లిదండ్రులకు తెలియదు. ఆ రోజులలో ఫిలిష్తీయ వాళ్ళు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నారు.
5 సమ్సోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు వెళ్ళాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటల దగ్గరికి చేరినప్పుడు, కొదమ సింహం ఒకటి గర్జిస్తూ అతనికి ఎదురుపడింది. 6 యెహోవా ఆత్మ✽ బలంగా అతణ్ణి ఆవరించాడు. అతడు మేకపిల్లను చీల్చివేసినట్టే ఆ సింహాన్ని చీల్చిపారవేశాడు. అతని చేతులలో ఏమీ లేదు కూడా. తాను చేసినది✽ తన తండ్రికి గానీ, తల్లికి గాని చెప్పలేదు. 7 అతడు తిమ్నాతు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఆమె సమ్సోనుకు నచ్చింది. 8 కొంతకాలం గడిచాక ఆమెను పెళ్ళాడడానికి అతడు తిరిగి వెళ్తున్నాడు. ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. దానిలో తేనెటీగల గుంపు, తేనె కనిపించాయి. 9 అతడా తేనె తన చేతుల్లోకి తీసుకొని తింటూ వెళ్ళాడు. అతడు తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చి, వారికి కూడా కొంత ఇచ్చాడు. వారూ తిన్నారు. అయితే తాను సింహంలో నుంచి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు.
10 అతని తండ్రి ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు. సమ్సోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు. అలా చేయడం అక్కడి పెళ్ళికొడుకులకు ఒక సంప్రదాయం. 11 అక్కడివాళ్ళు అతణ్ణి చూచి అతనితో కూడా ఉండడానికి ముప్ఫయిమంది యువకులను తీసుకువచ్చారు. 12 వాళ్ళతో సమ్సోను ఇలా చెప్పాడు:
“నన్ను ఒక పొడుపుకథ చెప్పనివ్వండి. ఈ విందు ఏడు రోజుల లోపల మీరు దానిని విప్పితే ముప్ఫయి సన్నని నారబట్టలు, ముప్ఫయి జతల దుస్తులు నేను మీకిస్తాను. 13 మీరు దానిని విప్పలేకపోతే మీరు ముప్ఫయి సన్నని నారబట్టలు, ముప్ఫయి జతల దుస్తులు నాకు ఇవ్వాలి.”
అందుకు వారు “సరే, మీ పొడుపుకథ ఏమిటో చెప్పండి. వింటాం” అని జవాబిచ్చారు.
14 “తినేదానిలో నుంచి తిండి వచ్చింది. బలమైన దానిలోనుంచి తియ్యనిది వచ్చింది” అని అతడు చెప్పాడు. మూడు రోజులలో ఆ పొడుపుకథ వాళ్ళు విప్పలేకపోయారు.
15 నాలుగో రోజున వాళ్ళు సమ్సోను భార్యతో “ఆ పొడుపుకథ అర్థమేమిటో మాకు తెలియజేయడానికి నీ భర్తను ఒప్పించు. లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివాళ్ళను నిప్పంటించి కాల్చివేస్తాం✽. ఇక్కడికి మమ్మల్ని పిలిచింది మా ఆస్తి కాజేసి మమ్మల్ని దరిద్రుల్ని చేయడానికేనా?” అన్నారు.
16 సమ్సోను భార్య అతని కాళ్ళమీదపడి ఏడుస్తూ “నేనంటే మీకు ప్రేమ లేదు✽. అసలు మీరు నన్ను ద్వేషిస్తున్నారు. మా వాళ్ళకి✽ ఒక పొడుపుకథ వేశారు గానీ దాని అర్థం నాకు చెప్పనేలేదు” అంది.
అతడు ఆమెతో “దాని అర్థం నా తండ్రికి గానీ, తల్లికి గానీ చెప్పలేదు. నేనెందుకు అది నీకు చెప్పాలి?” అని బదులు చెప్పాడు.
17 విందు జరిగిన ఏడు రోజులూ ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె అతణ్ణి ఇంకా నొక్కి నొక్కి అడిగినందుచేత ఏడో రోజున అతడు ఆమెకు దాని అర్థం చెప్పాడు. ఆమె తన వాళ్ళకు ఆ పొడుపుకథ అర్థం చెప్పింది. 18 ఏడో రోజున ప్రొద్దు క్రుంకేముందు ఆ ఊరివాళ్ళు సమ్సోనుతో ఇలా అన్నారు:
“తేనెకంటే తియ్యగా ఉండేదేమిటి? సింహం కంటే బలమైనదేది?”
సమ్సోను వాళ్ళతో “మీరు నా పెయ్య✽తో దున్నకపోతే నా పొడుపుకథ విప్పివుండేవాళ్ళు కాదు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా ఆత్మ✽ బలంతో అతణ్ణి ఆవరించాడు. అతడు అష్కెలోను వెళ్ళి అక్కడివాళ్ళను ముప్ఫయి మందిని చంపాడు. వాళ్ళ ఆస్తిని దోచుకొని వాళ్ళ బట్టలు పొడుపుకథ భావం చెప్పిన వాళ్ళకు ఇచ్చాడు. కోపంతో మండిపడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళి పోయాడు. 20 సమ్సోను భార్యను పెళ్ళికి హాజరైన సమ్సోను స్నేహితుడికి ఇవ్వడం జరిగింది.