13
1 ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు, గనుక యెహోవా వారిని నలభై సంవత్సరాలు ఫిలిష్తీయవాళ్ళ చేతికప్పగించాడు.
2 దాను వంశంవాడొకడు జోర్యాలో ఉండేవాడు. అతని పేరు మానోహ. అతని భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. 3 యెహోవా దూత ఆమెకు సాక్షాత్కరించి ఆమెతో ఇలా అన్నాడు:
“నీవు గొడ్రాలివి. నీకు పిల్లలు లేరు. అయినా నీవు గర్భవతివవుతావు. కొడుకును కంటావు. 4 అందుచేత నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షమద్యం గానీ, మరే మద్యం గానీ త్రాగకు, అశుద్ధమైనది ఏదీ తినకు. 5 ఎందుకంటే, నీవు గర్భవతివయి కొడుకును కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పటినుంచీ నాజీర్‌గా ఉంటాడు, గనుక అతని నెత్తిమీద మంగలి కత్తి పెట్టకూడదు. ఫిలిష్తీయవాళ్ళ చేతులలోనుంచి అతడు ఇస్రాయేల్‌వారిని విడిపించడం ఆరంభిస్తాడు.”
6 అప్పుడామె తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన దేవదూతలాగా బీకరంగా కనిపించాడు. ఆయన ఎక్కడనుంచి వచ్చాడో నేను అడగలేదు. ఆయన తన పేరు నాకు చెప్పలేదు. 7 అయితే ఆయన నాతో ఇలా చెప్పాడు: ‘విను, నీవు గర్భవతివవుతావు. కొడుకును కంటావు. నీవు ద్రాక్ష మద్యం గానీ మరే మద్యం గానీ త్రాగకు, అశుద్ధమైనది ఏదీ తినకు. ఎందుకంటే ఆ పిల్లవాడు పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నాజీర్‌గా ఉంటాడు.’”
8 అప్పుడు మానోహ యెహోవాకు ప్రార్థన చేసి “నీవు పంపిన ఆ దేవుని మనిషిని మళ్ళీ మా దగ్గరికి పంపించు. పుట్టే పిల్లవాణ్ణి మేము ఎలా పెంచాలో మాకు చెప్పమను” అన్నాడు.
9 దేవుడు మానోహ ప్రార్థన విన్నాడు. ఆ స్త్రీ పొలంలో కూచుని ఉన్నప్పుడు ఆ దేవదూత మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె భర్త మానోహ ఆమె దగ్గర లేడు. 10 ఆమె తన భర్త దగ్గరికి త్వరగా పరుగెత్తి “ఆ రోజు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి నాకు కనిపించాడు” అని చెప్పింది. 11 మానోహ లేచి తన భార్యవెంట వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి చేరి, “నా భార్యతో మాట్లాడినది మీరేనా?” అని అడిగాడు. అతడు “నేనే” అన్నాడు.
12 అప్పుడు మానోహ “మీరు చెప్పినది జరిగాక, ఆ పిల్లవాడు బ్రతుకు తీరు, పని ఎలా ఉండాలి?” అనడిగాడు.
13 అందుకు యెహోవా దూత ఇలా జవాబిచ్చాడు: “నేను నీ భార్యకు చెప్పినట్టెల్లా ఆమె చేయాలి. 14 ద్రాక్షనుంచి వచ్చేది ఏదీ ఆమె తినకూడదు. ద్రాక్షమద్యం గానీ, మరే మధ్యం గానీ ఆమె త్రాగకూడదు. అశుద్ధమైనది ఏదీ తినకూడదు. నేను ఆజ్ఞాపించినదంతా ఆమె పాటించాలి.”
15 యెహోవా దూతతో మానోహ “మీ కోసం మేము ఒక మేకపిల్లను వంట చేసేదాకా మీరు ఆగాలని మనవి చేస్తున్నాం” అన్నాడు.
16 యెహోవా దూత “నీవు నన్ను నిలిపినా నీ భోజనం నేను తినను. అయితే నీవు హోమబలి అర్పించాలనుకొంటే యెహోవాకు అర్పించు” అని మానోహతో బదులు చెప్పాడు. ఆయన యెహోవా దూత అని మానోహకు తెలియదు.
17 మానోహ “మీరు చెప్పినది జరిగాక మేము మిమ్మల్ని గౌరవించేట్టు మీ పేరేమిటో చెప్తారా?” అని యెహోవా దేవదూతను అడిగాడు.
18 అందుకు “నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం” అని యెహోవా దూత జవాబిచ్చాడు.
19 మానోహ నైవేద్యంతోపాటు ఒక మేకపిల్లను తెచ్చి బండమీద యెహోవాకు అర్పించాడు. అప్పుడు మానోహ, అతని భార్య చూస్తూ ఉండగానే యెహోవా దూత అద్భుతం జరిగేలా చేశాడు. 20 ఆ బలిపీఠంనుంచి మంటలు ఆకాశంవైపు లేస్తూ ఉంటే యెహోవా దూత ఆ మంటల్లో పైకి వెళ్ళిపోయాడు. మానోహ, అతని భార్య అది చూచి నేల మీద సాష్టాంగపడ్డారు. 21 ఆ తరువాత యెహోవా దూత మానోహకు, అతని భార్యకు మళ్ళీ కనిపించలేదు. ఆయన యెహోవా దూత అని మానోహకు అప్పుడు తెలిసింది.
22 “మనం దేవుణ్ణి చూశాం. మనకిక చావు తప్పదు” అని మానోహ తన భార్యతో అన్నాడు.
23 అయితే అతని భార్య “యెహోవా మనల్ని చంపాలని కోరితే మన చేతులతో అర్పించిన హోమబలినీ, నైవేద్యాన్నీ ఆయన అంగీకరించి ఉండేవాడు కాదు. మనకు ఈ విషయాలన్నీ చూపించేవాడు కాదు. ఇప్పుడు ఇలాంటి సంగతులు మనకు చెప్పేవాడు కాదు” అని అతనికి జవాబిచ్చింది.
24 తరువాత ఆమె పిల్లవాణ్ణి కన్నది. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. యెహోవా అతడికి ఆశీస్సులు ప్రసాదించాడు. 25 అతడు జోర్యాకు ఎష్‌తాయోల్‌కు మధ్య మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.