12
1 అప్పుడు ఎఫ్రాయిం గోత్రంవారు సమకూడి, ఉత్తర దిక్కు వెళ్ళి, యెఫ్తాను చూచి, “అమ్మోనువాళ్ళతో యుద్ధం చేయడానికి మమ్మల్ని పిలవకుండా నువ్వెందుకు వెళ్ళావు? ఇప్పుడు నీతో పాటు నీ ఇంటిని కాల్చివేస్తాం” అన్నారు.
2 అందుకు యెఫ్తా “నేను, నా ప్రజలు అమ్మోనువాళ్ళతో పెద్ద తగాదా పడివున్నాం. నేను మిమ్మల్ని పిలిచానుగాని మీరు వాళ్ళ బారినుంచి నన్ను విడిపించడానికి రాలేదు. 3 మీరు సహకరించరని నేనే ప్రాణం అరచేతిలో పెట్టుకొని అమ్మోను వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. యెహోవా వాళ్ళను నా వశం చేశాడు. కాని, ఈ వేళ నామీదికి మీరు కయ్యానికి రావలసిన అవసరం ఏమిటి?” అని వారితో అన్నాడు.
4 వెంటనే యెఫ్తా గిలాదు మనుషులందరినీ పిలిపించి ఎఫ్రాయింవారితో యుద్ధం చేశాడు. గిలాదువారు ఎఫ్రాయిం వారిని ఓడించారు. ఎందుకంటే, ఎఫ్రాయింవారు “గిలాదు వాళ్ళలారా! ఎఫ్రాయిం, మనష్షే ప్రదేశాల మధ్య ఉన్నా, మీరు ఎఫ్రాయింవారి దగ్గరనుంచి పరారీ అయిన వాళ్ళే!” అన్నారు.
5 గిలాదువారు ఎఫ్రాయిం ప్రదేశానికి ఎదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించుకొన్నారు. ఎఫ్రాయింవారిలో పారిపోయిన వాడెవడైనా వచ్చి “నన్ను రేవు దాటనియ్యండి” అని అడిగితే గిలాదు మనుషులు “నువ్వు ఎఫ్రాయిం వాడివా?” అని అడిగేవారు. “కాదు” అని అతడంటే, 6 గిలాదు మనుషులు “సరి, షిబ్బోలెత్ అనే మాట పలుకు” అనేవారు. అతడు ఆ పదం సరిగా పలకలేక ‘సిబ్బోలెత్’ అని పలికితే వారతణ్ణి పట్టుకొని యొర్దాను రేవుల దగ్గరే చంపేవారు. ఆ కాలంలో ఆ విధంగా నలభై రెండు వేలమంది ఎఫ్రాయిం మనుషులు కూలారు.
7 యెఫ్తా ఆరేళ్ళు ఇస్రాయేల్‌వారికి నాయకుడుగా ఉన్నాడు. తర్వాత గిలాదువాడైన యెఫ్తా చనిపోయాడు. గిలాదులో ఒక పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు.
8 అతని తరువాత బేత్‌లెహేం గ్రామవాసి ఇబ్సాను ఇస్రాయేల్‌వారికి నాయకుడు అయ్యాడు. 9 అతనికి ముప్ఫయి మంది కొడుకులు ముప్ఫయిమంది కూతుళ్ళు ఉన్నారు. అతడు తన కూతుళ్ళకు పరాయి వంశంనుంచి పెండ్లి సంబంధాలు అందుకొన్నాడు. తన కొడుకులకు కూడా ముప్ఫయిమంది కోడళ్ళను పరాయి వంశంనుంచే తెచ్చుకొన్నాడు. ఇబ్సాను ఏడేళ్ళు ఇస్రాయేల్‌వారికి నాయకుడుగా ఉన్నాడు. 10 ఆ తరువాత ఇబ్సాను చనిపోయాడు. అతణ్ణి బేత్‌లెహేంలో పాతిపెట్టారు.
11 అతని తరువాత జెబూలూను గోత్రంవాడైన ఏలోను ఇస్రాయేల్ ప్రజకు పది సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు. 12 అప్పుడు జెబూలూనువాడైన ఏలోను చనిపోయాడు. అతణ్ణి జెబూలూను ప్రదేశంలో అయ్యాలోన్‌లో పాతిపెట్టారు.
13 అతని తరువాత పిరాతోను గ్రామవాసీ, హిల్లేల్ కొడుకూ అయిన అబ్దోను ఇస్రాయేల్‌వారికి నాయకుడు అయ్యాడు. 14 అతనికి నలభైమంది కొడుకులు, ముప్ఫయిమంది మనుమలు ఉన్నారు. వారు డెబ్భై గాడిదలమీద స్వారీ చేసేవారు. అతడు ఇస్రాయేల్‌ప్రజకు ఎనిమిది సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు. 15 అప్పుడు పిరాతోను గ్రామవాసీ హిల్లేల్ కొడుకూ అబ్దోను చనిపోయాడు. అతణ్ణి ఎఫ్రాయిం ప్రదేశంలో పిరాతోనులో పాతిపెట్టారు. అది అమాలేకువాళ్ళ కొండసీమలో ఉంది.