11
1 గిలాదువాడైన యెఫ్తా పరాక్రమశాలి, బలాఢ్యుడు. అతని తండ్రి పేరు గిలాదు. యెఫ్తా తల్లి ఒక వేశ్య. 2 గిలాదు భార్య కూడా అతనికి కొడుకులను కన్నది. వాళ్ళు పెద్ద వాళ్ళయ్యాక యెఫ్తాతో “నువ్వు ఇతర స్త్రీ కొడుకువు, గనుక మన నాన్న ఇంట్లో నీకు వారసత్వం లేదు” అని చెప్పి అతణ్ణి వెళ్ళగొట్టారు. 3 యెఫ్తా అన్నదమ్ముల దగ్గరనుంచి పారిపోయి, టోబ్ దేశంలో ఉండిపోయాడు. అక్కడ పనికిమాలినవాళ్ళు కొంతమంది అతని చుట్టూ చేరి అతని అనుచరులయ్యారు.
4 కొంతకాలం అయ్యాక అమ్మోనువాళ్ళు ఇస్రాయేల్ ప్రజతో యుద్ధానికి వచ్చారు. 5 అలా అమ్మోనువాళ్ళు ఇస్రాయేల్‌వారిమీద యుద్ధం చేస్తూవుంటే, టోబ్ దేశంనుంచి యెఫ్తాను తీసుకువద్దామని గిలాదు పెద్దలు అక్కడికి వెళ్ళారు.
6 వారు “మీరు వచ్చి మాకు అధిపతిగా ఉండండి. అప్పుడు మనం అమ్మోనువాళ్ళతో యుద్ధం చేయగలం” అని యెఫ్తాతో అన్నారు.
7 అందుకు యెఫ్తా “మీరు నన్ను ద్వేషించి మా నాన్న ఇంటినుంచి వెళ్ళగొట్టారుగా! ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు. అయితే మీరెందుకు నా దగ్గరికి రావాలి?” అని గిలాదు పెద్దలతో అన్నాడు.
8 గిలాదు పెద్దలు యెఫ్తాతో “ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చిన కారణమిదే గదా – మీరు మాతో కూడా వచ్చి అమ్మోనువాళ్ళతో యుద్ధం చేయాలి. అప్పుడు మీరు గిలాదు నివాసులందరిమీదా నాయకుడు అవుతారు” అన్నారు.
9 యెఫ్తా “అమ్మోనువాళ్ళతో యుద్ధం చేయడానికి ఇప్పుడు మీరు నన్ను తీసుకువెళ్ళాక, యెహోవా గనుక వాళ్ళను నా వశం చేస్తాడనుకోండి. అప్పుడు నన్ను నిజంగా మీ నాయకుడుగా ఉండనిస్తారా?” అని గిలాదు పెద్దలనడిగాడు.
10 “మేం తప్పకుండా మీరన్నట్టే చేస్తాం. దీనికి యెహోవాయే సాక్షి” అని గిలాదు పెద్దలు యెఫ్తాతో అన్నారు.
11 అప్పుడు యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్ళాడు. ప్రజ అతణ్ణి తమమీద నాయకుడుగా, అధిపతిగా చేశారు. మిస్పాలో యెహోవా సన్నిధానంలో యెఫ్తా ఆ మాటలే మళ్ళీ చెప్పాడు.
12 అప్పుడు యెఫ్తా అమ్మోనువాళ్ళ రాజు దగ్గరికి ఇలా కబురంపాడు: “మా దేశం మీద ఇలా మీరు యుద్ధానికి రావడానికి మేము మిమ్ముల్నేం చేశాం?”
13 యెఫ్తా కబురంపిన మనుషులతో అమ్మోనువాళ్ళ రాజు ఇలా బదులు చెప్పాడు: “ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు ఇస్రాయేల్‌వారు అర్నోను నదినుంచి యబ్బోకు ఏటివరకూ యొర్దానుదాకా మా భూమిని ఆక్రమించుకొన్నారు. ఇప్పుడు శాంతియుతంగా దానిని మళ్ళీ మాకిచ్చేయాలి.”
14 యెఫ్తా మళ్ళీ అమ్మోనువాళ్ళ రాజు దగ్గరికి ఈ కబురు పంపాడు: 15 “యెఫ్తా చెప్పేదేమిటంటే, మోయాబుదేశం గానీ, అమ్మోనువాళ్ళ దేశం గాని ఇస్రాయేల్‌ప్రజలు ఆక్రమించు కోలేదు. 16 ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎడారిగుండా ఎర్ర సముద్రం వరకు వచ్చి, అక్కడనుంచి కాదేషుకు వచ్చారు. 17 అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు ఎదోంవాళ్ళ రాజుదగ్గరికి ‘దయ వుంచి మమ్మల్ని మీ దేశం గుండా వెళ్ళనివ్వండి’ అని అడగడానికి మనుషులను పంపారు. అయితే ఎదోంవాళ్ళ రాజు ఒప్పుకోలేదు. ఇస్రాయేల్‌వారు మోయాబుదేశం రాజు దగ్గరికి కూడా అలా చెప్పి పంపారు. అతడూ ఒప్పుకోలేదు. అందుచేత ఇస్రాయేల్‌ప్రజ కాదేషులో ఉండిపోయారు. 18 తరువాత వారు ఎడారిగుండా ప్రయాణం చేసి, ఎదోం దేశం, మోయాబు దేశం చుట్టూ తిరిగి, మోయాబు దేశానికి తూర్పువైపుకు చేరి అర్నోను అవతల మకాం చేశారు. వారు మోయాబుదేశంలోకి వెళ్ళలేదు. అర్నోను నది మోయాబు సరిహద్దు. 19 అక్కడ ఇస్రాయేల్‌వారు హెష్బోను నగరంలో పరిపాలన చేసే అమోరీవాళ్ళ రాజు దగ్గరికి మనుషులతో ఈ కబురు పంపారు. ‘దయచేసి మీ దేశం గుండా మా స్థలానికి మమ్మల్ని వెళ్ళనివ్వండి.’ 20 సీహోను ఇస్రాయేల్‌వారిని నమ్మలేదు. వారు తన సరిహద్దులను దాటివెళ్ళడానికి ఒప్పుకోలేదు. సీహోను తన జనాల్ని అందరినీ పోగుచేసి యాహసు దగ్గర మకాం చేసి ఇస్రాయేల్‌వారిమీద యుద్ధం చేశాడు. 21 అయితే ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా సీహోనునూ అతడి మనుషులందరినీ ఇస్రాయేల్‌వారి వశం చేశాడు. వారు వాళ్ళను ఓడించారు. అక్కడ ఉంటున్న అమోరీవాళ్ళ దేశాన్నంతా ఇస్రాయేల్‌వారు స్వాధీనం చేసుకొన్నారు. 22 అర్నోనునుంచి యబ్బోకుదాకా, ఎడారినుంచి యొర్దానువరకు అమోరీవాళ్ళ దేశమంతటినీ వారు స్వాధీనం చేసుకొన్నారు.
23 “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా తన ఇస్రాయేల్ ప్రజల ముందునుంచి అమోరీవాళ్ళను వెళ్ళగొట్టిన తరువాత, ఇప్పుడు మీరు దానిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా? 24 స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన కెమోషు మీకిచ్చిన భూభాగాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అలాగే మా ఎదుట నుంచి మా దేవుడు యెహోవా వెళ్ళగొట్టినవాళ్ళ భూభాగం మా స్వాధీనంలో ఉండాలి. 25 మోయాబుదేశం రాజూ సిప్పోరు కొడుకూ అయిన బాలాకుకంటే మీరు గొప్పవారా? అతడెప్పుడైనా ఇస్రాయేల్‌వారితో కయ్యం పెట్టుకొన్నాడా? యుద్ధం చేశాడా? 26 హెష్బోనులో, దాని గ్రామాలలో, ఆరోయేర్‌లో, దాని గ్రామాలలో అర్నోను ఒడ్డున ఉన్న ఊళ్ళన్నిటిలో ఇస్రాయేల్‌వారు మూడు వందల ఏళ్ళు ఉన్నారు గదా! అప్పుడెందుకు మీరు వాటిని పట్టుకోలేదు? 27 మీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పూ చేయలేదు. నామీద యుద్ధానికి వస్తూ, మీరే నాకు కీడు చేస్తున్నారు. ఇస్రాయేల్‌ప్రజకూ అమ్మోను జనానికీ న్యాయమూర్తి అయిన యెహోవా న్యాయం తీరుస్తాడు గాక!” 28 కానీ, యెఫ్తా తనకు పంపిన కబురును అమ్మోనువాళ్ళ రాజు లెక్కచేయలేదు.
29 అప్పుడు యెహోవా ఆత్మ యెఫ్తాను ఆవరించాడు. అతడు గిలాదు, మనష్షే ప్రదేశాలను దాటిపోయి గిలాదువారి మిస్పే ఊరికి వెళ్ళి, అక్కడనుంచి అమ్మోను వాళ్ళమీదికి వెళ్ళాడు. 30 ఆ సమయంలో యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేసుకొన్నాడు:
“నీవు అమ్మోనువాళ్ళను నా వశం చేస్తే 31 నేను అమ్మోనువాళ్ళ దగ్గరనుంచి విజయంతో వచ్చేటప్పుడు నా ఇంటిలోనుంచి నాకు ఏది ఎదురు వస్తే అది యెహోవాదవుతుంది. దానిని నేను హోమబలిగా అర్పిస్తాను.”
32 యెఫ్తా అమ్మోనువాళ్ళ మీద యుధ్ధం చేయడానికి వెళ్ళాడు. వాళ్ళను యెహోవా అతని వశం చేశాడు. 33 అరోయేర్‌నుంచి మిన్నీతు పొలిమేరలదాకా, ఆబేల్‌కెరామీం దాకా ఇరవై ఊళ్ళను అతడు ఘోరంగా నాశనం చేసి వాళ్ళను హతమార్చాడు. ఈ విధంగా అమ్మోనువాళ్ళు ఇస్రాయేల్ వారికి లొంగిపొయ్యారు.
34 యెఫ్తా తన ఇంటికి మిస్పాకు తిరిగి వస్తూ ఉంటే అతని కూతురు కంజరీలతో, నాట్యాలతో అతనికెదురు వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే సంతానం. ఆమె తప్ప కొడుకు గానీ ఇంకో కూతురు గానీ లేరు. 35 అతడు ఆమెను చూడడంతోనే తాను వేసుకొన్న బట్టలు చింపుకొని, “అయ్యో, కూతురా! నువ్వు నన్ను సంకటంలో పడేశావు, మనోవేదనకు గురి చేశావు. ఎందుకంటే, నేను యెహోవాకు మాట ఇచ్చాను. ఇప్పుడు అది తప్పలేను” అని అరిచాడు.
36 అందుకామె “నాన్నా, మీరు యెహోవాకు మాట ఇచ్చారు. మీ శత్రువులైన అమ్మోనువాళ్ళమీద యెహోవా ఇప్పుడు ప్రతీకారం చేశాడు గనుక మీరు మాట ఇచ్చినట్టే నాకు చేయండి” అంది.
37 మళ్ళీ ఆమె “నాకు ఒక్క విషయంలో మాత్రం సెలవియ్యండి. నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోలేను గనుక రెండు నెలలు నేను నా చెలికత్తెలతో కొండలమీద తిరుగుతూ దాని గురించి ఏడ్వడానికి నాకు సెలవియ్యండి” అని తన తండ్రితో చెప్పింది.
38 “అలాగే వెళ్ళమ్మా” అని అతడన్నాడు.
రెండు నెలలు అతడు ఆమెను పంపివేశాడు. తానెన్నటికీ పెళ్ళిచేసుకోనని ఆమె చెలికత్తెలతో వెళ్ళి కొండలమీద ఏడ్చింది.
39 రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చేసిన మ్రొక్కుబడి ప్రకారం ఆమెను చేశాడు. ఆమె కన్య. ఈ సంఘటన మూలాన ఇస్రాయేల్‌లో ఒక ఆచారం స్థిరమైంది. 40 ఏమిటంటే, ఏటేటా ఇస్రాయేల్‌లో పడుచులు నాలుగు రోజులు బయటికి వెళ్ళి, గిలాదువాడైన యెఫ్తా కూతురును జ్ఞాపకం చేసుకొని కొనియాడుతారు.