10
1 అబీమెలెకు తరువాత ఇస్రాయేల్‌వారిని విడిపించడానికి ఇశ్శాకారుగోత్రంవాడూ దోదో మనుమడూ పూవ కొడుకూ అయిన తోలా బయలుదేరాడు. అతడు ఎఫ్రాయిం కొండప్రాంతంలో షామీరులో ఉండేవాడు. 2 అతడు ఇస్రాయేల్ వారికి ఇరవైమూడు సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు. ఆ తరువాత అతడు చనిపోయాడు. వారతణ్ణి షామీరులో పాతిపెట్టారు.
3 అతని తరువాత గిలాదువాడైన యాయీరు బయలు దేరాడు. అతడు ఇస్రాయేల్‌వారికి ఇరవై రెండు సంవత్సరాలు నాయకుడుగా ఉన్నాడు. 4 అతనికి ముప్ఫయి మంది కొడుకులు ఉండేవారు. వారు ముప్ఫయి గాడిదలమీద స్వారీ చేసేవారు. గిలాదు ప్రదేశంలో వారికి ముప్ఫయి ఊళ్ళు ఉండేవి. ఈనాటికీ వాటిని ‘హవోత్ యాయీరు’ అని పిలుస్తారు. 5 యాయీరు చనిపోయాడు. వారతణ్ణి కామోనులో పాతిపెట్టారు.
6 ఇస్రాయేల్‌ప్రజ దేవుని దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. వారు బయల్‌దేవుణ్ణి, అష్తారోతు దేవిని, సిరియావాళ్ళ దేవుళ్ళను, సీదోనువాళ్ళ దేవుళ్ళను, మోయాబువాళ్ళ దేవుళ్ళను, అమ్మోనువాళ్ళ దేవుళ్ళను ఫిలిష్తీయవాళ్ళ దేవుళ్ళను సేవించారు. వారు యెహోవాను విసర్జించి, ఆయనను సేవించకుండా ఉన్నారు. 7 ఇస్రాయేల్ ప్రజమీద యెహోవా కోపంతో మండిపడ్డాడు. ఆయన వారిని ఫిలిష్తీయవాళ్ళ చేతికి, అమ్మోనువాళ్ళ చేతికి అప్పగించాడు. 8 ఆ సంవత్సరం ఆ జనాలు వారిని చితగొట్టి అణచివేశాయి. అమోరీవాళ్ళ దేశంలో, యొర్దానుకు అవతల ఉన్న గిలాదు ప్రదేశంలో ఉన్న ఇస్రాయేల్‌వారందరినీ వాళ్ళు అలా పద్ధెనిమిది ఏళ్ళు అణచివేశారు. 9 అంతేగాక, అమ్మోనువాళ్ళు యొర్దాను దాటి యూదావారి మీద, బెన్యామీనువారి మీద, ఎఫ్రాయిం వంశంవారి మీద యుద్ధం చేశారు. ఇస్రాయేల్ వారికి చాలా ఆపద కలిగింది.
10 అప్పుడు “మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం. మా దేవుణ్ణి వదిలివేసి బయల్ దేవుళ్ళను సేవించాం” అంటూ ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు మొరపెట్టుకున్నారు. 11 అప్పుడు యెహోవా ఇస్రాయేల్‌ప్రజతో ఇలా చెప్పాడు: “ఈజిప్ట్‌వాళ్ళ నుంచి అమోరీ, అమ్మోను, ఫిలిష్తీయ జాతుల వాళ్ళనుంచి నేను మిమ్ములను విడిపించాను గదా. 12 సీదోనువాళ్ళు అమాలేకువాళ్ళు, మాయోనువాళ్ళు మిమ్ములను బాధించి నప్పుడు మీరు నాకు మొరపెట్టుకొంటే వాళ్ళ చేతులనుంచి మిమ్ములను విడిపించాను గదా. 13 అయితే మీరు నన్ను వదిలిపెట్టి ఇతర దేవుళ్ళను సేవించారు, గనుక ఇప్పటినుంచి నేను మిమ్ములను విడిపించను. 14 మీరు ఎన్నుకొన్న దేవుళ్ళకు మొరపెట్టుకోండి. మీ ఆపదలోనుంచి వాళ్ళనే మిమ్ములను విడిపించమనండి.”
15 అప్పుడు ఇస్రాయేల్‌ప్రజ “మేము పాపం చేశాం. నీకు ఏది మంచిదని తోస్తే అలా మాకు చెయ్యి. గానీ, ఇప్పుడు మమ్ములను మాత్రం విడిపించు” అని యెహోవాతో చెప్పారు.
16 వారు వారి దగ్గర ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించడం మొదలు పెట్టారు. ఇస్రాయేల్‌వారి దురవస్థను చూచి ఆయన సహించలేకపొయ్యాడు.
17 అప్పుడు అమ్మోనువాళ్ళు సమకూడి గిలాదులో మకాం చేశారు. ఇస్రాయేల్‌వారు సమకూడి మిస్పాలో మకాం చేశారు. 18 గిలాదు ప్రజల నాయకులు “అమ్మోనువాళ్ళతో ముందుగా ఎవడు యుద్ధానికి వెళ్తాడో అతడే గిలాదు నివాసులందరికీ నాయకుడు అవుతాడు” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.