9
1 ✽ యెరుబ్బయల్ కొడుకు అబీమెలెకు తన మేనమామల దగ్గరికి షెకెం వెళ్ళి, వాళ్ళతో తన తాతగారి కుటుంబం వాళ్ళందరితో ఇలా అన్నాడు: 2 ✝“షెకెం పౌరులందరితో ఇలా చెప్పండి: యెరుబ్బయల్ కొడుకులు డెబ్భైమంది మిమ్మల్ని పరిపాలించడం మంచిదా? లేక, ఒక్కడే పరిపాలించడం మంచిదా? మీరేం అంటారు? నేను మీ రక్తసంబంధినన్న విషయం గుర్తించుకోండి!”3 ✽అతడి మేనమామలు ఆ మాటలన్నీ అతడి తరఫున షెకెం పౌరులందరితో చెప్పారు. “అతడు మా బంధువు” అని చెప్పి అబీమెలెకు వైపు మొగ్గారు. 4 ✽బయల్‌బెరీతు దేవాలయం నుంచి వాళ్ళు అతడికి డెబ్భై తులాల వెండి ఇచ్చారు. దానితో ఎందుకూ పనికిరాని మూర్ఖులను అబీమెలెకు కూలికి తీసుకొన్నాడు. వాళ్ళు అతడి అనుచరులయ్యారు. 5 అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్ళి, యెరుబ్బయల్ కొడుకులైన తన డెబ్భై మంది అన్నదమ్ములను ఒకే బండమీద చంపాడు. కానీ, యెరుబ్బయల్ చిన్న కొడుకు యోతాం మాత్రం దాక్కొని, తప్పించుకొన్నాడు. 6 అప్పుడు షెకెం పౌరులంతా, బేత్‌మిల్లోవాళ్ళంతా షెకెంలో ఉన్న సిందూర వృక్షం దగ్గర ఉన్న స్తంభం ముందు సమకూడి అబీమెలెకును రాజు✽గా చేశారు.
7 ఈ సంగతి యోతాంకు తెలియవచ్చింది. అతడు గెరిజీం కొండెక్కి, దానిమీద నిలబడి, ఇలా గట్టిగా అరిచాడు: “షెకెం పౌరులారా! దేవుడు మీ ప్రార్థనలు వినేట్టు మీరు నా మాటలు వినండి. 8 ✽ఒకసారి చెట్లు కలిసి తమకొక రాజును అభిషేకం చేసుకొందామని బయలుదేరాయట. ఆలీవ్ చెట్టును చూచి ‘నీవు మమ్మల్ని పరిపాలించు’ అని అడిగాయి. 9 అందుకు ఆలీవ్ చెట్టు ‘దేవుణ్ణి, మనిషిని గౌరవించే నా నూనెను ఇవ్వడం మానేసి చెట్ల మీద రాజునై అటూ ఇటూ ఊగడానికి నేను రావాలా?’ అంది. 10 తరువాత ఆ చెట్లు ఒక అంజూరు చెట్టును ‘నీవు వచ్చి మమ్మల్ని పరిపాలించు’ అని అడిగాయి. 11 అయితే ఆ అంజూరు చెట్టు ‘నేను నా తియ్యదనాన్ని, నా కమ్మని పళ్ళను వదిలేసి చెట్ల మీద రాజునై అటూ ఇటూ ఊగడానికి రావాలా?’ అని బదులు చెప్పింది. 12 అప్పుడా చెట్లు ఒక ద్రాక్షచెట్టును ‘నీవు వచ్చి మమ్మల్ని పరిపాలించు’ అని కోరాయి. 13 కానీ, ఆ ద్రాక్ష చెట్టు ‘దేవుణ్ణి, మనుషులను ఉత్సాహపరచే నా రసం వదిలేసి, చెట్ల మీద రాజునై అటూ ఇటూ ఊగడానికి రావాలా?’ అంది.
14 “చివరకు చెట్లన్నీ ముళ్ళపొదతో ‘నీవు వచ్చి మా మీద పరిపాలించు’ అని అడిగాయి. 15 ఆ ముళ్ళపొద ఆ చెట్లతో ఇలా చెప్పింది: ‘మీరు నిజంగా మీమీద రాజుగా నాకు అభిషేకం చేయదలిస్తే వచ్చి నా నీడను ఆశ్రయించండి. రాకపొయ్యారా, ఈ ముళ్ళపొదనుంచి మంటలు వచ్చి లెబనోనులోని దేవదారు చెట్లను దగ్ధం చేస్తుంది గాక!’”
16 “మీరు అబీమెలెకును రాజుగా చేయడంలో యథార్థంగా, నిజాయితీగా వ్యవహరించారా? యెరుబ్బయల్‌కు, అతని కుటుంబానికి తగినట్టు న్యాయంగా ప్రవర్తించారా? 17 మా నాన్న మీకోసం యుద్ధం చేసి తన ప్రాణానికి తెగించి మిద్యానువాళ్ళ చేతులనుంచి మిమ్మల్ని విడిపించాడు. 18 అయితే మీరు ఈ రోజు మా నాన్న కుటుంబంమీద తిరగబడి, ఆయన కొడుకుల్ని డెబ్భైమందిని ఒక్క బండమీద చంపారు. ఆయన దాసి కొడుకైన అబీమెలెకును, అతడు మీ చుట్టం గనుక, మీరు షెకెంవాళ్ళమీద రాజుగా చేశారు. 19 కనుక ఈ వేళ మీరు యెరుబ్బయల్ పట్ల, ఆయన కుటుంబం పట్ల యథార్థంగా, నిజాయితీగా వ్యవహరించి ఉంటే, ఆ అబీమెలెకు మూలాన మీకు సంతోషం చేకూరుతుంది గాక! మీ మూలాన మీకు సంతోషం చేకూరుతుంది గాక! 20 ✽మీరు నిజాయితీగా వ్యవహరించకపొయ్యారా, అబీమెలెకులో నుంచి మంటలు వచ్చి, షెకెం, బేత్‌మిల్లోవాళ్ళైన మిమ్మల్ని దహించివేస్తాయి గాక! షెకెం, బేత్‌మిల్లోవాళ్ళైన మీలో నుంచి మంటలు వచ్చి అబీమెలెకును దహించివేస్తాయి గాక!”
21 అప్పుడు యోతాం పారిపోయి బేర్ ఊరికి వెళ్ళాడు. తన అన్న అబీమెలెకుకు భయపడి అక్కడ నివాసం చేశాడు. 22 ✽అబీమెలెకు మూడు సంవత్సరాలు ఇస్రాయేల్‌వారిమీద పరిపాలించాడు. 23 అప్పుడు దేవుడు అబీమెలెకునూ, షెకెం పౌరులనూ వేరుపరచే దురాత్మ✽ను పంపాడు. వాళ్ళు అతడిపట్ల కపటంగా ప్రవర్తించారు. 24 వారి సోదరుడైన అబీమెలెకు యెరుబ్బయల్ యొక్క డెబ్భైమంది కొడుకులను దౌర్జన్యం చేసి చంపినందుచేత, అతడు తన అన్నదమ్ములను చంపేట్టు షెకెం పౌరులు అతణ్ణి ప్రోత్సహించినందుచేత అతడికీ వాళ్ళకూ ప్రతీకారం✽ జరగాలని దేవుని ఉద్దేశం. 25 అబీమెలెకుకు వ్యతిరేకంగా, షెకెం పౌరులు బాటసారులందరినీ దోచు కోవడానికి కొండలమీద మాటుల్లో మనుషులను ఉంచారు. ఈ సంగతి అబీమెలెకుకు తెలియవచ్చింది.
26 ✽ఆ సమయంలో ఎబెదు కొడుకు గాల్, అతడి బంధువులు షెకెంకు వచ్చారు. షెకెం పౌరులకు అతడి మీద నమ్మకం కుదిరింది. 27 ఒకరోజు పొలాలకు వెళ్ళి ద్రాక్షపండ్లను ఏరుకొని, వాటిని త్రొక్కిన తరువాత వాళ్ళు ఉత్సవం జరుపుకొన్నారు. తమ దేవుడి గుడిలోకి వెళ్ళి భోజనం చేస్తూ త్రాగుతూ అబీమెలెకును శపించారు. 28 అప్పుడు ఎబెదు కొడుకు గాల్ ఇలా అన్నాడు:
“షెకెంవాళ్ళు ఏపాటివారు? అబీమెలెకు ఏపాటివాడు? మనం అతడికెందుకు సేవ చేయాలి? అతడు యెరుబ్బయల్ కొడుకు గదా. జెబుల్ అతడి సైన్యాధిపతి గదా. అతడికి మనమెందుకు సేవ చేయాలి? షెకెం తండ్రి హమోరు✽ వంశం వాళ్ళకు సేవ చేద్దాం. 29 ఈ జనం నా అధికారం కింద ఉంటే, ఎంత బాగుంటుంది! అలాంటప్పుడు నేను అబీమెలెకును తొలగించివేస్తాను!”
అతడు అబీమెలెకు విషయం “అతడు తన సైన్యం మొత్తాన్ని తీసుకురావాలి!” అని చెప్పాడు.
30 ఎబెదు కొడుకైన గాల్ చెప్పినది ఆ పట్టణం అధిపతి జెబుల్ విని కోపంతో మండిపడ్డాడు. 31 అతడు అబీమెలెకు దగ్గరికి రహస్యంగా ఈ కబురుతో మనుషులను పంపాడు: “ఎబెదు కొడుకు గాల్, అతడి బంధువులు షెకెంకు వచ్చారు. మీ మీదికి ఈ పట్టణాన్ని రేపుతున్నారు. 32 అందుచేత ఈ రాత్రి మీరు, మీ మనుషులంతా వచ్చి, పొలంలో మాటుగా ఉండాలి. 33 రేపు పొద్దు పొడవగానే లేచి, త్వరగా పట్టణం మీదికి రావాలి. గాల్, అతడి మనుషులు మిమ్మల్ని ఎదిరించడానికి బయలుదేరేటప్పుడు వారిని చేయగలిగేదంతా చేయవచ్చు.”
34 అలాగే అబీమెలెకు, అతడి మనుషులంతా రాత్రివేళ తరలివచ్చి, నాలుగు గుంపులుగా ఏర్పడి, షెకెంమీద పడడానికి పొంచి ఉన్నారు. 35 అబీమెలెకు, అతడి మనుషులు మాటుల్లోనుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడే ఎబెదు కొడుకు గాల్ పట్టణం ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలుచున్నాడు.
36 గాల్ వాళ్ళను చూచి జెబుల్‌తో “ఇదిగో! కొండలపై నుంచి ప్రజలు దిగి వస్తూ వున్నారు!” అన్నాడు. అందుకు జెబుల్ “అవి కొండమీది నీడలు. మీకు మనుషుల్లాగా కనిపిస్తున్నాయి” అని జవాబిచ్చాడు.
37 మరోసారి గాల్ మాట్లాడి “చూడండి! ఆ ప్రాంతం ఎత్తయిన స్థలాలనుంచి ప్రజలు దిగివస్తూ ఉన్నారు! ఒక గుంపు ‘శకునగాండ్ర సిందూర వృక్షం’ వైపు నుంచి వస్తూవుంది!” అన్నాడు.
38 అప్పుడు జెబుల్ అతడితో ఇలా అన్నాడు: “నువ్వు అన్నావు గదా ‘అబీమెలెకు ఏపాటివాడు? మనం అతడి కెందుకు సేవ చేయాలి?’ నువ్వు చెప్పిన గొప్పలు ఏమయ్యాయి? నువ్వు తృణీకరించినది ఈ మనుషుల్నేగా! బయటికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చెయ్యి!”
39 అందుచేత గాల్ షెకెం పౌరులముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధం చేశాడు. 40 అబీమెలెకు అతణ్ణి తరిమితే అతడు పారిపొయ్యాడు. చాలమంది గాయాలు తగిలి పట్టణం ద్వారం ప్రవేశం వరకు త్రోవలో కూలుతూ ఉన్నారు. 41 అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగాడు. జెబుల్ గాల్‌నూ, అతడి బంధువులనూ షెకెంనుంచి వెళ్ళగొట్టాడు.
42 మరుసటి రోజు షెకెం ప్రజలు పొలాలకు వెళ్ళారు. ఆ సంగతి అబీమెలెకుకు తెలియవచ్చింది. 43 అప్పుడతడు తన మనుషులను మూడు గుంపులుగా చేసి, పొలాలలో మాటుగా ఉంచాడు. పట్టణం నుంచి బయలుదేరి వస్తూ ఉన్న ప్రజలమీద పడి వాళ్ళను హతం చేశాడు. 44 అబీమెలెకు, అతడి దగ్గర ఉన్న గుంపులతో కూడా పట్టణద్వారం ప్రవేశం వరకు సాగి అక్కడ నిలబడ్డారు. రెండు గుంపులు పరుగెత్తి పొలాలలో ఉన్నవాళ్ళందరి మీద పడి హతం చేశాయి. 45 ఆ రోజంతా అబీమెలెకు ఆ పట్టణం మీద యుద్ధం జరిగించి, చివరకు దానిని పట్టుకొని, దాని ప్రజలను చంపాడు. అప్పుడు దానిని నాశనం చేసి ఆ స్థలంమీద ఉప్పు చల్లాడు.
46 షెకెంలో గోపురమొకటి ఉంది. దాని యజమానులు జరిగిన విషయం తెలుసుకొని, ఏల్ బెరీతు✽దేవుడి గుడి కోటలోకి వెళ్ళారు.
47 షెకెం గోపురం యజమానులు అక్కడ సమకూడారని అబీమెలెకు ఎవరో చెప్పారు. 48 అతడు, అతడి మనుషులంతా సలమోను కొండెక్కారు. అబీమెలెకు గొడ్డలితో చెట్టు కొమ్మను ఒక దానిని నరికి, ఎత్తి, తన భుజాలమీద పెట్టుకొన్నాడు. అప్పుడతడు “నేను ఇలా చేయడం మీరు చూశారు గదా! మీరు ఇలా త్వరగా చేయండి!” అని అతడితో ఉన్న మనుషులతో చెప్పాడు. 49 ✽వాళ్ళంతా కొమ్మలను నరికి, అబీమెలెకును అనుసరించారు. వాళ్ళు ఆ కోట దగ్గర ఆ కొమ్మలను ఉంచి, వాటిని తగలబెట్టి, కోటను కాలిపోయేలా చేశారు. షెకెం గోపురంవాళ్ళు సుమారు వెయ్యిమంది స్త్రీ పురుషులు. వాళ్ళంతా మరణించారు.
50 తరువాత అబీమెలెకు తేబేసుకు వెళ్ళి దానిని ముట్టడించి పట్టుకొన్నాడు. 51 ఆ ఊరి మధ్యలో బలమైన గోపురం ఒకటి ఉంది. ఆ ఊరి నాయకులు, స్త్రీ పురుషులంతా దానిలోకి పారిపొయ్యారు. తలుపులు మూసివేసి గోపురం పైకప్పు మీదికెక్కారు. 52 అబీమెలెకు గోపురం దగ్గరికి వచ్చి దానిమీద యుద్ధం జరిగించాడు. నిప్పంటించి దానిని కాల్చివేద్దామని గోపురం ద్వారం దగ్గరికి వచ్చాడు. 53 అప్పుడొక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగటిరాయి పడవేసింది. అతడి పుర్రె పగిలింది. 54 ✽వెంటనే అతడు అతడి ఆయుధాలు మోసేవాణ్ణి పిలిచి ఇలా అన్నాడు: “ఒక స్త్రీ అబీమెలెకును చంపిందని ఎవ్వరూ చెప్పకూడదు. గనుక నీ కత్తి దూసి నన్ను చంపు.” అలాగే అతడి బంటు అతణ్ణి పొడిచాడు. అతడు మరణించాడు. 55 అబీమెలెకు చనిపోయాడని తెలుసుకొని ఇస్రాయేల్‌వారు ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. 56 ✽అబీమెలెకు అతని డెబ్భైమంది అన్నదమ్ములను చంపి అతని తండ్రికి చేసిన చెడుగుకు ఈ విధంగా దేవుడు ప్రతీకారం చేశాడు. 57 షెకెం వాళ్ళు చేసిన చెడుగు అంతటికీ కూడా దేవుడు వాళ్ళ తలలమీదికి కీడు వచ్చేట్టు చేశాడు. యెరుబ్బయల్ కొడుకు యోతాం పలికిన శాపం వాళ్ళ మీదికి వచ్చింది.