8
1 “నీవు మా పట్ల ఇలా వ్యవహరించావేం? మిద్యాను వాళ్ళమీదికి యుద్ధానికి వెళ్తూ మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని ఎఫ్రాయింవారు గిద్యోన్ను అడిగి అతనితో తీవ్రంగా జగడమాడారు.
2 దానికి అతడు ఇలా బదులు చెప్పాడు: “మీరు చేసిన పనితో పోలిస్తే, నేను చేసిన పని ఏపాటిది? అబీయెజ్రావారి ద్రాక్షల కోతకంటే, ఎఫ్రాయింవారి పరిగె మంచిదేగా! 3 మిద్యాను నాయకులైన ఓరేబ్‌నూ జేబ్‌నూ దేవుడు మీ వశం చేశాడు. మీరు చేసినదానితో పోలిస్తే నేనేం చేయగలిగాను?” అన్నాడు. ఆ మాటలు విని అతనిమీద వారి కోపం తగ్గిపోయింది. 4 గిద్యోను, అతనితో ఉన్న మూడు వందల మంది బాగా అలసిపోయినా మిద్యానువారిని తరుముతూనే యొర్దానుకు వచ్చి దానిని దాటిపోయారు.
5 అప్పుడు అతడు “దయచేసి నాతో ఉన్నవారికి భోజనం పెట్టండి. వారు బాగా అలసిపోయారు. నేను మిద్యాను రాజులైన జెబహునూ సలమున్నానూ తరుముతూవున్నాను” అని సుక్కోతు ఊరివాళ్ళను అడిగాడు.
6 దానికి సుక్కోతు పెద్ద మనుషులు ఇలా అన్నారు: “ఎందుకు? జెబహు, సలమున్నా నీ చేతికి దొరికారనా? ఎందుకు నీ సైన్యానికి మేం ఆహారం పెట్టాలి?”
7 అప్పుడు గిద్యోను “సరే! యెహోవా జెబహునూ సలమున్నానూ నా చేతికి చిక్కించేటప్పుడు, అడవి ముళ్ళతో, కంపలతో మీ ఒళ్ళు చీరేస్తాను” అని బదులు చెప్పాడు.
8 అక్కడ నుంచి అతడు పెనూయేల్‌కు వెళ్ళి, వాళ్ళనూ అలాగే అడిగాడు. పెనూయేల్‌వారు కూడా సుక్కోతువాళ్ళు చెప్పినట్లే జవాబిచ్చారు.
9 కనుక అతడు పెనూయేల్‌వాళ్ళతో “నేను క్షేమంగా తిరిగి వచ్చాక ఈ గోపురాన్ని పడగొట్టివేస్తాను” అన్నాడు.
10 జెబహు, సలమున్నా, పదిహేనువేల మంది మనుషులున్న తమ సైన్యంతో కర్కోరులో ఉన్నారు. మొత్తం తూర్పు జనాల సైన్యంలో అంతమందే మిగిలారు. అంతకు ముందు, కత్తి యుద్ధం చేసేవాళ్ళు లక్ష ఇరవై వేలమంది కూలారు. 11 నోబహు యొగ్‌బెహకు తూర్పుగా, దేశదిమ్మరులు పోయేదారిన గిద్యోను వెళ్ళాడు. ఆ సైన్యం అజాగ్రత్తగా ఉన్నప్పుడు దానిమీద పడ్డాడు. 12 మిద్యాను ఇద్దరు రాజులు జెబహు, సలమున్నా పారిపోయారు. అతడు వాళ్ళను తరిమి పట్టుకొన్నాడు. వాళ్ళ సైన్యమంతా చెల్లాచెదురయ్యేలా చేశాడు.
13 అప్పుడు యోవాషు కొడుకు గిద్యోను యుద్ధం నుంచి హెరెసు కనుమగుండా తిరిగి వచ్చాడు. 14 సుక్కోతుకు చెందిన యువకుణ్ణి ఒకణ్ణి పట్టుకొని ప్రశ్నించాడు. ఆ యువకుడు సుక్కోతు అధికారుల, పెద్దల పేర్లన్నీ అతనికి వ్రాసి ఇచ్చాడు. వాళ్ళు డెబ్భై ఏడు మంది. 15 అప్పుడు గిద్యోను సుక్కోతు వాళ్ళదగ్గరికి వచ్చి, “ఇరుగో, జెబహు సలమున్నా నీ చేతికి దొరికారా? అలసి పోయిన నీ సైన్యానికి మేమెందుకు ఆహారం పెట్టాలి? అంటూ మీరు వీళ్ళ విషయమే గదా నన్ను తిరస్కారం చేశారు!” అన్నాడు.
16 అతడు సుక్కోతు పెద్దలను పట్టుకొని, అడవి ముళ్ళతో, కంపలతో గుణపాఠం నేర్పాడు. 17 అతడు పెనూయేల్ గోపురం పడగొట్టి ఆ ఊరి మనుషులను చంపాడు కూడా.
18 అప్పుడతడు “తాబోరుదగ్గర మీరు చంపినవారు ఎలాంటివారు?” అని జెబహును, సలమున్నాను అడిగాడు. వాళ్ళు “మీలాంటివాళ్ళే – అందరూ రాజు కొడుకుల్లాగా ఉండేవాళ్ళు” అని వాళ్ళు బదులు చెప్పారు.
19 అప్పుడతడు “అయితే వారు నా తోబుట్టువులు, నా తల్లి కొడుకులు. మీరు వారిని గనుక బ్రతకనిచ్చి ఉంటే నేను మిమ్మల్ని చంపక ఉండేవాణ్ణే అని యెహోవా జీవం మీద ఆనబెట్టి చెప్తున్నాను” అన్నాడు.
20 అప్పుడు తన పెద్దకొడుకు యెతరును చూచి, “లేచి, వాళ్ళను చంపు” అన్నాడు. కానీ, అతడు పిల్లవాడే గనుక భయపడి కత్తి తీయలేదు.
21 జెబహు, సలమున్నా “మీరే లేచి మమ్మల్ని చంపండి. మనిషికే మనిషి బలం ఉంటుంది గదా!” అన్నారు. అప్పుడు గిద్యోను తానే లేచి జెబహునూ సలమున్నాను చంపాడు. వాళ్ళ ఒంటెల మెడలమీద ఉన్న ఆభరణాలు తీసుకొన్నాడు.
22 ఆ తరువాత ఇస్రాయేల్‌వారు గిద్యోనుతో “మీరు మమ్మల్ని మిద్యానువాళ్ళ చేతులనుంచి విడిపించారు గనుక మీరు మమ్మల్ని పరిపాలించండి. మీ తరువాత మీ కొడుకు, మీ మనుమడు కూడా మమ్మల్ని పరిపాలించాలి” అని చెప్పారు.
23 అందుకు గిద్యోను “నేను మిమ్మల్ని పరిపాలించను. నా కొడుకూ మిమ్మల్ని పరిపాలించడు. యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు” అన్నాడు. 24 అప్పుడు గిద్యోను “నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. మీరంతా మీరు దోచుకొన్న దానిలోనుంచి ఒక్కొక్క చెవిపోగు నాకు ఇవ్వండి” అన్నాడు. (ఓడిపోయినవాళ్ళు ఇష్మాయేలువాళ్ళు. వాళ్ళ చెవులకు బంగారు పోగులు ఉండేవి.)
25 “అలాగే సంతోషంగా ఇస్తాం” అని వారు అన్నారు. వారు ఒక గుడ్డ పరచి, ప్రతివాడూ తాను దోచుకొన్నవాటి నుంచి చెవిపోగును దానిమీద వేశాడు. 26 మిద్యాను రాజులు వేసుకొనే ఆభరణాలు, కర్ణభూషణాలు, ఊదా రంగు బట్టలు, ఒంటెల మెడల నున్న గొలుసుల తూకం గాక, అతడు అడిగిన బంగారు చెవిపోగుల తూకం ఒక వెయ్యి ఏడు వందల తులాలు అయింది. 27 గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించాడు, ఒఫ్రా అనే తన ఊరిలో ఉంచాడు. అక్కడికి వచ్చి ఇస్రాయేల్ వారంతా దేవునిపట్ల ద్రోహులై దానితో వేశ్యల్లాగా ప్రవర్తించారు. అది గిద్యోనుకు, అతని కుటుంబానికి ఉచ్చులాగా అయింది.
28 ఇస్రాయేల్‌వారి ముందు మిద్యానువాళ్ళు అణగారి పోయారు. మళ్ళీ తల ఎత్తుకోలేకపోయారు. గిద్యోను రోజులలో ఇస్రాయేల్‌దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. 29 యోవాషు కొడుకు యెరుబ్బయల్ తన సొంత ఇంటికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. 30 గిద్యోనుకు చాలా మంది భార్యలు ఉండడంచేత డెబ్భైమంది కొడుకులు కలిగారు. 31 షెకెంలో ఉన్న ఉంపుడుకత్తె కూడా అతనికొక కొడుకును కన్నది. గిద్యోను అతడికి అబీమెలెకు అనే పేరు పెట్టాడు. 32 యోవాషు కొడుకు గిద్యోను మంచి ముసలితనంలో మృతి చెందాడు. అబీయెజ్రావారికి చెందిన ఒఫ్రాలో అతని తండ్రి యోవాషు సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. 33 అయితే గిద్యోను చనిపోవడంతోనే ఇస్రాయేల్‌ప్రజ మళ్ళీ బయల్ దేవుళ్ళతో వేశ్యల్లాగా ప్రవర్తించి, బయల్‌బెరీతును దేవుడుగా చేసుకొన్నారు. 34 ఇస్రాయేల్‌ప్రజ అన్ని వైపులున్న తమ శత్రువులందరి చేతులనుంచి తమను విడిపించిన తమ దేవుడు యెహోవాను జ్ఞాపకముంచుకోలేదు. 35 యెరుబ్బయల్ అనే గిద్యోను ఇస్రాయేల్‌వారికి అంత మంచి చేసినా, వారు అతని కుటుంబం మీద దయ చూపేవాళ్ళు కాదు.