7
1 అప్పుడు యెరుబ్బయల్ అనే మారు పేరు గల గిద్యోను, అతనితో ఉన్నవారంతా ప్రొద్దున్నే లేచి, హరోదు ఊట దగ్గర మకాం చేశారు. మిద్యాను సైన్యం వారికి ఉత్తరంగా మోరేకొండ దగ్గర, లోయలో ఉంది. 2 యెహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు:
“నీతో ఉన్నవారు ఎక్కువమంది. నేను మిద్యాను సైన్యాన్ని వారి వశం చేయను. ఒకవేళ అలా చేస్తే ‘మా చేతి బలమే మాకు విడుదల ఇచ్చింది’ అని ఇస్రాయేల్‌వారు విర్రవీగుతారు. 3 గనుక ఇప్పుడు నీవు ఈ ప్రజలందరికీ వినబడేటట్టు ఇలా ప్రకటన చెయ్యి: ‘ఎవరైతే భయంతో వణకుతున్నారో వారు ఈ గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళిపోవచ్చు.’”
అప్పుడు ఇరవై రెండు వేలమందితిరిగి వెళ్ళిపోయారు. మిగిలినవారు పది వేలమంది.
4 యెహోవా గిద్యోనుతో “ఈ మనుషులు కూడా ఎక్కువ మంది. వారిని నీళ్ళ దగ్గరికి తీసుకురా. నేనక్కడ వారిని నీకోసం పరీక్ష చేస్తాను. నేను ఎవణ్ణయితే ‘ఇతడు నీతో వెళ్ళాలి’ అంటానో అతడు నీతో వెళ్ళాలి. ఎవణ్ణయితే, ‘ఇతడు నీతో వెళ్ళకూడదు’ అంటానో అతడు నీతో వెళ్ళకూడదు” అని చెప్పాడు.
5 గనుక గిద్యోను ఆ మనుషులను నీళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనితో, “కుక్కలాగా నాలుకతో నీళ్ళు కతికేవారిని వేరుగా ఉంచు. త్రాగడానికి మోకరించేవారిని వేరుగా ఉంచు” అన్నాడు.
6 చేతులతో నీళ్ళు నోటికందించి కతికినవారు మూడు వందల మంది. మిగతావారంతా నీళ్ళు త్రాగడానికి మోకరించినవారే.
7 అప్పుడు యెహోవా గిద్యోనుతో “నీళ్ళు కతికిన ఈ మూడు వందల మందిచేత మిమ్ములను రక్షించి మిద్యాను వాళ్ళను నీ వశం చేస్తాను. తక్కినవారందరినీ వారి వారి ఇండ్లకు వెళ్ళనియ్యి” అని చెప్పాడు.
8 అందుకని అతడు ఆ మూడు వందల మందిని తన దగ్గర ఉంచి, తక్కిన ఇస్రాయేల్‌వారందరినీ ఎవడి ఇంటికి వాణ్ణి పంపివేశాడు. తక్కినవారి ఆహార పదార్థాలను, బూరలను ఆ మూడు వందలమంది తీసుకొన్నారు. మిద్యాను సైన్యం శిబిరం అతనికి దిగువగా లోయలో ఉంది.
9 ఆ రాత్రిలోనే యెహోవా గిద్యోనుతో ఇలా అన్నాడు: “ఆ శిబిరం మీదికి వెళ్ళు. నేను దానిని నీ వశం చేస్తాను. 10 దానిమీదికి వెళ్ళడానికి నీవు భయపడుతూ ఉంటే, శిబిరం దగ్గరికి నీ పనివాడైన పూరాను తీసుకువెళ్ళి, 11 వాళ్ళు ఏమంటున్నారో అది విను. ఆ తరువాత శిబిరం మీదికి వెళ్ళడానికి నీకు ధైర్యం చేకూరుతుంది.”
అందుచేత తన పనివాడైన పూరాతోకూడా గిద్యోను ఆ సైన్య శిబిరం బయట కాపలాదారులున్న చోటుకు వెళ్ళాడు. 12 మిద్యానువాళ్ళు, అమాలేకువాళ్ళు, ఇతర తూర్పు జనాలంతా మిడతలంతా విస్తారంగా లోయనిండా ఉన్నారు. వాళ్ళకు ఒంటెలు సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్లాగా లెక్కలేనన్ని ఉన్నాయి. 13 గిద్యోను వచ్చినప్పుడు ఒక మనిషి తన స్నేహితుడితో తనకు వచ్చిన కల చెప్తున్నాడు, “నాకో కల వచ్చింది. యవల రొట్టె ఒకటి మిద్యాను శిబిరంలోకి దొర్లి, డేరామీదికి వచ్చిపడింది. ఆ డేరా తిరగబడి పోయి నేలమట్టమయింది” అన్నాడు.
14 అందుకు అతడి స్నేహితుడు “ఇది ఇంకేమీ కాదు– ఆ ఇస్రాయేల్‌వాడైన యోవాషు కొడుకు గిద్యోనుయొక్క ఖడ్గం సుమా! మిద్యానువాళ్ళను, ఈ శిబిరమంతటినీ దేవుడు అతడి వశం చేశాడు” అని బదులు చెప్పాడు.
15 ఆ కలను, దాని అర్థాన్ని విన్పప్పుడు గిద్యోను తలవంచి యెహోవాను ఆరాధించాడు. తిరిగి ఇస్రాయేల్‌వారి మకాం వచ్చి, “లెండి! యెహోవా మిద్యానువాళ్ళ శిబిరాన్ని మీ వశం చేశాడు” అన్నాడు. 16 అప్పుడతడు ఆ మూడు వందలమందిని మూడు గుంపులుగా చేశాడు. ఒక్కొక్కరి చేతికి బూరను, ఖాళీ కుండను ఇచ్చాడు. ఆ కుండలలో దివిటీలు ఉన్నాయి.
17 అతడు “నన్ను గమనిస్తూ అనుసరించండి. నేను వాళ్ళ శిబిరం చిట్టచివరకు వచ్చాక నేను చేసినట్లే చెయ్యండి. 18 నేను, నాతో ఉన్న గుంపువారంతా బూరలు ఊదుతాం. అప్పుడు శిబిరం అన్ని వైపులనుంచి మీరు కూడా బూరలూది, ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం!’ అని కేకలు వేయండి” అన్నాడు.
19 మిద్యానువాళ్ళు కాపలాదారులను కొత్తగా మార్చిన నడి జామున గిద్యోను, అతనితో ఉన్న వందమంది శిబిరం పొలిమేరలకు వచ్చారు. బూరలూది తమ చేతుల్లో ఉన్న కుండలు పగలగొట్టారు. 20 ఆ మూడు గుంపులవారు బూరలూది కుండలు పగలగొట్టి దివిటీలు ఎడమ చేతుల్లో పట్టుకొన్నారు, కుడిచేతుల్లో ఊదే బూరలు పట్టుకొన్నారు. అప్పుడు వారు “యెహోవా ఖడ్గం! గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు.
21  వారంతా శిబిరం చుట్టూరా ఎవరున్న చోట వారు నిలుచున్నారు. మిద్యాను సైన్యమంతా పరుగెత్తనారంభించారు. కేకలు వేస్తూ పారిపోయారు. 22 ఆ మూడు వందల బూరలు ఊదినప్పుడు శిబిరంలో అంతటా మొత్తం సైన్యం ఒకరి కత్తిని ఒకరిమీదికి యెహోవా త్రిప్పాడు. సైన్యం సెరేరాతు వైపుగా ఉన్న బేత్‌షెత్తాకు, తబ్బాతు దగ్గర ఉన్న ఆబేల్‌మెహోలా సరిహద్దుదాకా పారిపోయింది. 23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు మనష్షే ప్రదేశాలనుంచి ఇస్రాయేల్‌వారిని పిలవడం జరిగింది. వారు వచ్చి మిద్యానువాళ్ళను తరిమారు.
24 ఎఫ్రాయిం కొండప్రాంతమంతటికి గిద్యోను మనుషులను పంపించి – “మిద్యానువాళ్ళమీదికి రండి! బేత్‌బారాదాకా వాళ్ళకంటే ముందుగా నీళ్ళున్న స్థలాలను, యొర్దాను నదిని ఆక్రమించుకోండి” అని కబురు చేశాడు. ఎఫ్రాయింవారంతా సమకూడి బయలుదేరి బేత్‌బారా వరకు నీళ్ళున్న స్థలాలను, యొర్దాను నదిని ఆక్రమించుకొన్నారు. 25 వారు ఓరేబ్, జేబ్ అనే ఇద్దరు మిద్యాను నాయకులను పట్టుకొన్నారు. ‘ఓరేబ్ బండ’ మీద ఓరేబ్‌ను, ‘జేబ్ ద్రాక్ష గానుగ దగ్గర జేబ్‌ను చంపారు. వారు మిద్యానువాళ్ళను తరిమి, ఓరేబ్, జేబ్‌ల తలలను యొర్దాను దగ్గరికి గిద్యోనుకు తెచ్చియిచ్చారు.’