6
1 ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా దృష్టిలో మళ్ళీ✽ చెడ్డగా ప్రవర్తించారు. అందుచేత వారిని యెహోవా ఏడేళ్ళు మిద్యానువాళ్ళ✽ చేతికి అప్పగించాడు. 2 ✽మిద్యానువాళ్ళు ఇస్రాయేల్‌ప్రజలమీద బలంగా పైచెయ్యి కావడంవల్ల ఇస్రాయేల్‌ప్రజ కొండల సందులలో గుహలలో తమకోసం భద్రమైన స్థావరాలను తయారు చేసుకొన్నారు. 3 ఇస్రాయేల్ వారు విత్తనాలు చల్లుకొన్నప్పుడెల్లా మిద్యానువాళ్ళు అమాలేకు వాళ్ళు, ఇతర తూర్పుజనాలు దేశంమీదికి దండెత్తి వచ్చేవాళ్ళు. 4 వారికి ఎదురుగా మకాం చేసి, వారి పొలాల పంటలను గాజావరకు పాడుచేసి, ఇస్రాయేల్‌ప్రజకు తినడానికి తిండి లేకుండా చేసేవాళ్ళు. దేశంలో ఒక్క గొర్రెను గానీ ఎద్దును గానీ గాడిదను గానీ వాళ్ళు ఉండనిచ్చేవాళ్ళు కాదు. 5 వాళ్ళు తమ పశువులతో డేరాలతో లెక్కకు మిడతల గుంపు✽లలాగా వచ్చిపడేవాళ్ళు. వాళ్ళు, వాళ్ళ ఒంటెలు ఇన్ని అని చెప్పడానికి వీలులేదు. దేశాన్ని పాడు చేయడానికే వాళ్ళు వచ్చేవాళ్ళు. 6 మిద్యానువాళ్ళ మూలాన ఇస్రాయేల్‌ప్రజ హీనస్థితికి దిగజారిపోయారు, గనుక వారు యెహోవాకు మొరపెట్టారు✽.7 మిద్యానువాళ్ళ కారణంగా ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు మొరపెట్టుకొన్నప్పుడు, 8 ✽ఆయన వారి దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను మిమ్ములను ఈజిప్ట్‌నుంచి – ఆ దాస్యగృహం నుంచి – తీసుకువచ్చాను. 9 ఈజిప్ట్‌వాళ్ళ చేతిలో నుంచి, మిమ్ములను బాధపెట్టేవాళ్ళందరి చేతిలోనుంచి, మిమ్ములను విడిపించాను. మీ ఎదుటనుంచి వాళ్ళను తరిమివేశాను. వాళ్ళ దేశం మీకు ఇచ్చాను. 10 ‘నేనే మీ దేవుణ్ణి, యెహోవాను, మీరు అమోరీవాళ్ళ దేశంలో కాపురముంటున్నారు. వాళ్ళ దేవుళ్ళపట్ల భయభక్తులు చూపకండి’ అని నేను మీతో చెప్పాను. కాని, మీరు నా మాట పెడచెవిని పెట్టారు”.
11 యెహోవా దూత✽ వచ్చి ఒఫ్రాలో ఉన్న సిందూర వృక్షం క్రింద కూచున్నాడు. ఆ చెట్టు అబీయెజ్రా వంశంవాడైన యోవాషుది. అతడి కొడుకు గిద్యోను. మిద్యానువాళ్ళకు కనబడకుండా గిద్యోను ద్రాక్షగానుగ చాటున గోధుమలు నూరుస్తూ ఉన్నాడు.
12 యెహోవా దూత గిద్యోనుకు కనిపించి, “బలపరా క్రమాలు గలవాడా! యెహోవా నీకు తోడుగా✽ ఉన్నాడు” అని చెప్పాడు.
13 అందుకు గిద్యోను ఇలా జవాబిచ్చాడు: “స్వామీ! యెహోవా మాకు తోడుగా ఉంటే ఇలా మాకు జరిగేదేనా?✽ యెహోవా మమ్ములను ఈజిప్ట్‌నుంచి తీసుకురాలేదా? అంటూ మా పూర్వీకులు చెప్పిన ఆయన అద్భుతాలు ఎక్కడ? యెహోవా ఇప్పుడు మమ్మల్ని వదిలేసి మిద్యానువాళ్ళ చేతికి అప్పగించాడు.”
14 అప్పుడు యెహోవా✽ అతనివైపు తిరిగి “నీకు ఉన్న బలంతో వెళ్ళి, ఇస్రాయేల్‌ప్రజను మిద్యానువాళ్ళ చేతులలో నుంచి విడిపించు. నేను నిన్ను పంపుతున్నాను గదా!” అని చెప్పాడు.
15 అప్పుడతడు ఆయనతో “స్వామీ! నేను ఇస్రాయేల్ ప్రజను ఎలా✽ విడిపించేది? మనష్షే గోత్రంలోని అన్ని కుటుంబాలలో మాది బలహీనమైనది✽. మా కుటుంబంలో నేను చిన్నవాణ్ణి” అని చెప్పాడు. 16 యెహోవా “నేను నీకు తోడుగా ఉంటాను. ఒంటరివాణ్ణి కొట్టినట్టు నీవు మిద్యానువాళ్ళను హతం చేస్తావు” అని అతనితో చెప్పాడు.
17 అప్పుడతడు “నా మీద నీకిప్పుడు దయ గనుక ఉంటే నాతో మాట్లాడుతున్నది నీవే అని నాకొక సూచన✽ చూపించు. 18 నేను ఇప్పుడే నా అర్పణ తెచ్చి నీ ముందు పెట్టేవరకు నీవు ఇక్కడనుంచి వెళ్ళిపోకు” అని ఆయనను ప్రాధేయపడ్డాడు. “నీవు వెళ్ళి వచ్చేవరకు నేనుంటాను✽” అని ఆయన చెప్పాడు.
19 గిద్యోను ఇంట్లోకి వెళ్ళి ఒక మేకపిల్లను వండాడు. పొంగజేసే పదార్థం వేయకుండా తూమెడు పిండితో రొట్టెలను సిద్ధం చేశాడు. వండిన మాంసాన్ని ఒక బుట్టలో పెట్టి, దాని పులుసు ఒక కుండలో పోసి, సిందూరవృక్షం క్రింద ఉన్న ఆయనకు తెచ్చి ఇచ్చాడు.
20 అప్పుడు దేవుని దూత “ఆ మాంసం, పొంగనిరొట్టెలు తీసుకువచ్చి, ఈ రాతిమీద పెట్టి, వాటిమీద పులుసు పోయి” అని అతనితో చెప్పాడు. అతడు అలాగే చేశాడు.
21 ✝అప్పుడు యెహోవా దూత మాంసాన్ని, పొంగని రొట్టెలను తన చేతికర్ర కొనతో ముట్టాడు. అప్పుడా రాయినుంచి మంట✽ పైకి లేచి, మాంసాన్ని పొంగని రొట్టెలను కాల్చివేసింది. వెంటనే యెహోవా దూత అంతర్ధానమయ్యాడు. 22 ఆయన యెహోవా దూత అని, “అయ్యో, యెహోవా ప్రభూ! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశానే✽!” అన్నాడు.
23 కానీ, యెహోవా “నీకు విశ్రాంతి కలుగుతుంది! భయపడవద్దు! నీవు చావవు” అని అతనితో చెప్పాడు.
24 అప్పుడక్కడ గిద్యోను యెహోవాకు బలిపీఠం✽ కట్టి, ‘యెహోవా షాలోం✽’ అని దానికి పేరు పెట్టాడు. ఈనాటికీ అది అబీయెజ్రా వంశంవారి ఒఫ్రా దగ్గర ఉంది.
25 ✽ఆ రాత్రిలోనే యెహోవా అతనితో ఇలా అన్నాడు: “మీ నాన్నకున్న ఎద్దులలో రెండో దానిని అంటే, ఆ ఏడేళ్ళదానిని తీసుకో. మీ నాన్న బయల్‌దేవుడికి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టు. దాని ప్రక్కన ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివెయ్యి. 26 అప్పుడు ఈ బండమీద క్రమబద్ధంగా✽ నీ దేవుడు యెహోవాకు బలిపీఠం కట్టు. ఆ రెండో ఎద్దును తీసుకువచ్చి, హోమబలిగా అర్పించు. నీవు నరికివేసిన అషేరాదేవి స్తంభం కలపను కట్టెలుగా వాడుకో.”
27 గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకువెళ్ళి, యెహోవా తనకు చెప్పినట్టే చేశాడు. అతడు తన కుటుంబం వారికీ ఆ ఊరివాళ్ళకూ భయపడి✽, రాత్రి వేళ అలా చేశాడు గాని పగలు కాదు. 28 ప్రొద్దున ఊరివాళ్ళు లేచేసరికి బయల్‌దేవుడి బలిపీఠం ముక్కలైవుంది! దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభం నరికివేసివుంది! క్రొత్తగా కట్టిన బలిపీఠం ఒకటి ఉంది! దానిమీద ఆ రెండో ఎద్దు బలైవుంది! 29 “ఈ పని చేసినవాడెవడా” అని ఒకరినొకరు అడిగారు. వాళ్ళు శ్రద్ధగా విచారణ చేస్తూ ఉంటే యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేశాడని ఎవరో చెప్పారు.
30 అప్పుడు ఆ ఊరివాళ్ళు యోవాషును పిలిచి, “నీ కొడుకును బయటికి తీసుకురా! వాడు బయల్‌దేవుడి బలిపీఠాన్ని పడగొట్టాడు, దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివేశాడు, గనుక అతడు చావాలి✽” అని చెప్పారు.
31 అప్పుడు యోవాషు తన మీదికి వచ్చినవాళ్ళతో ఇలా అన్నాడు: “మీరు బయల్‌దేవుడి పక్షంగా పోరాడుతారా? మీరతణ్ణి రక్షిస్తారా? అతడి పక్షంగా ఎవడైతే పోరాడుతాడో వాడే తెల్లవారేటప్పటికి చావాలి. ఎవరో అతడి బలిపీఠాన్ని✽ పడవేశారు గదా. అతడొక దేవుడు గనుక అయివుంటే తన పక్షంగా తానే పోరాడగలడు.”
32 అందుకని, ఆ రోజున గిద్యోనును ‘యెరుబ్బయల్✽’ అన్నారు. బయల్‌దేవుడి బలిపీఠం అతడు పడగొట్టాడు గనుక “బయల్‌దేవుణ్ణి అతడితో పోరాడనియ్యి” అని వాళ్ళు చెప్పారు.
33 ఆ తరువాత మిద్యానువాళ్ళు, అమాలేకువాళ్ళు, ఇతర తూర్పుజనాలు కలిసి, యొర్దాను దాటివచ్చి యెజ్రేల్✽లోయలో మకాం చేశారు. 34 అప్పుడు యెహోవా ఆత్మ✽ గిద్యోనును ఆవరించాడు. అతడు బూర✽ ఊది తనతో రమ్మని అబీయెజ్రా వారిని సమకూర్చాడు. 35 మనష్షే✽ ప్రదేశమంతటా వార్తాహరులను పంపాడు. అతణ్ణి అనుసరించడానికి వారు కూడా సమకూడారు. ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాల వారిదగ్గరికి కూడా అతడు వార్తాహరులను పంపాడు. వచ్చిన శత్రువులను ఎదిరించడానికి వారు కూడా వచ్చారు. 36 ✽అప్పుడు గిద్యోను దేవునితో ఇలా అన్నాడు:
“ఇస్రాయేల్‌వారిని నా చేతిమీదుగా నీవు విడిపిస్తానన్నావు గదా. అలాగైతే, 37 ఇదిగో! కళ్ళంమీద గొర్రెబొచ్చు పరుస్తాను. ఆ బొచ్చుమీదే మంచు పడి మిగతా నేలంతా పొడిగా వుంటే నీవు చెప్పినట్లుగా ఇస్రాయేల్‌వారిని నా చేతులమీదుగా నీవు విడిపిస్తావని నేను తెలుసుకొంటాను.”
38 అలాగే జరిగింది. అతడు మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి ఆ గొర్రెబొచ్చు పిండాడు. అలా మెలిపెడితే గిన్నెడు నీరు వచ్చింది.
39 అప్పుడు గిద్యోను “మరోసారి మాట్లాడుతాను. నామీద కోపగించవద్దు. ఇంకోసారి ఈ గొర్రె బొచ్చుతో పరీక్ష చేయనియ్యి. బొచ్చు పొడిగా ఉండి, నేలంతా మంచు ఉండేలా చెయ్యి” అని దేవునితో అన్నాడు.
40 ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉంది. నేలంతా మంచుపడి ఉంది.