5
1 ఆ రోజున దెబోరా, అబీనోయం కొడుకు బారాకు ఈ పాట✽ పాడారు:2 “ఇస్రాయేల్‌లో నాయకులు యుద్ధానికి
సంసిద్ధులయ్యారు.
ప్రజలు స్వేచ్ఛగా ముందుకు వచ్చారు✽.
యెహోవాను స్తుతించండి!
3 రాజులారా, వినండి!
పరిపాలకులారా, ఆలకించండి!
నేను యెహోవాకు పాడుతాను.
ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాను
సంకీర్తనం చేస్తాను.
4 ✽యెహోవా! నీవు శేయీరు పర్వతంనుంచి
బయలుదేరితే,
ఎదోం ప్రాంతం నుంచి నీవు తరలివచ్చినప్పుడు,
భూమి కంపించింది.
ఆకాశాలు నీళ్ళను కుమ్మరించాయి, మేఘాలు
వర్షించాయి.
5 యెహోవా ఎదుట పర్వతాలు నీరుగారిపోయాయి.
ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా ఎదుట
ఈ సీనాయి నీరుగారిపోయింది.
6 అనాతు కొడుకు షమ్గరు✽ రోజుల్లో,
యాయేల్ రోజుల్లో రహదారులు నిర్మానుష్యం✽
అయ్యాయి.
బాటసారులు ప్రక్కదారులు పట్టి
చుట్టు తిరిగి పోయారు.
7 ఇస్రాయేల్‌లో అధిపతులు లేకపోయారు.
దెబోరా అనే నేను✽ బయలుదేరేదాకా,
ఇస్రాయేల్‌లో నేను మాతృమూర్తిగా వచ్చేదాకా,
అంతా అలాగే ఉండిపోయింది.
8 ఇస్రాయేల్✽ప్రజలు కొత్త దేవుళ్ళ✽ను
కోరుకొన్నప్పుడు,
యుద్ధం నగర ద్వారాలకు వచ్చింది.
ఇస్రాయేల్‌లో నలభై వేలమంది దగ్గర ఒక్క డాలు
గానీ ఈటె గానీ కనిపించలేదు.
9 ఇస్రాయేల్‌ప్రజల నాయకులంటే,
స్వేచ్ఛగా ముందుకు వచ్చిన ప్రజలంటే,
నాకు ఎంతో అభిమానం✽.
యెహోవాను స్తుతించండి!
10 తెల్ల గాడిదలమీద✽ స్వారీ చేసేవారలారా!
జీనుమీద కూచునివున్నవారలారా!
దారిన పయనించే వారలారా! మీరంతా పాడండి!
11 నీళ్ళు చేదుకొనే స్థలాలలో విలుకాండ్రు
చేసే గానం వినండి.
యెహోవా ధర్మకార్యాలను✽
ఇస్రాయేల్ పల్లెటూళ్ళవారికోసం యెహోవా
జరిగించే ధర్మకార్యాలను వారు ప్రకటిస్తున్నారు.
యెహోవా ప్రజ అప్పుడు నగర ద్వారాలకు వెళ్ళారు.
12 మేల్కో✽! మేల్కో! దెబోరా!
మేల్కో! మేల్కో! ఓ పాట పాడు!
బారాకు! లే! అబీనోయం కుమారా!
నీ బందీలను✽ వశం చేసుకో!
13 మిగిలిన ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చారు.
యుద్ధశూరులలాగా యెహోవా ప్రజ
నా దగ్గరికి✽ వచ్చారు.
14 అమాలేకు✽వాళ్ళమధ్య ఉంటున్న ఎఫ్రాయింవారు
వచ్చారు.
నిన్ను అనుసరించిన ప్రజలలో
బెన్యామీనువారు ఉన్నారు.
మాకీరు✽నుంచి సైన్యాధిపతులు,
జెబూలూనునుంచి నాయకత్వం వహించేవారు
వచ్చారు.
15 ఇశ్శాకారువారి నాయకులు దెబోరాకు తోడుగా
ఉన్నారు.
ఇశ్శాకారువారు బారాకుతో అతని వెనకాలే
లోయలోకి పరుగెత్తిపోయారు.
రూబేను ప్రదేశం కాలువల దగ్గర హృదయాలలో
గొప్ప పరీక్షలు కలిగాయి.
16 మందల చప్పుడు వినడానికి మీరు గొర్రెల
దొడ్లలో ఎందుకు ఉండిపోయారు?
రూబేను ప్రదేశం కాలువల దగ్గర
గొప్ప హృదయ పరిశీలన✽ జరిగింది.
17 గిలాదు✽వారు యొర్దాను ఆవల ఉండిపోయారు.
దానువారు ఎందుకు ఓడల్లో ఆగిపోయినట్టు?
ఆషేరువారు సముద్రం ఒడ్డున,
తమ రేవుల దగ్గర ఉండిపోయారు.
18 ✽అయితే జెబూలూనువారు ప్రాణాలకు
తెగించారు.
మెట్ట భూములమీద నఫ్తాలివారు కూడా
అలాగే చేశారు.
19 వచ్చారు రాజులు. యుద్ధం జరిగించారు.
కనాను రాజులు తానాకులో మెగిద్దో✽ నీళ్ళ దగ్గర
యుద్ధం చేశారు.
కానీ, వాళ్ళు వెండిని దోచుకోలేకపోయారు.
20 ✽ఆకాశాలనుంచి పోరాడాయి నక్షత్రాలు.
వాటి త్రోవలలో అవి పోతూనే
పోరాడాయి సీసెరాతో.
21 ✽కీషోను ఏరు, ఆ పురాతన ఏరు కీషోను
వాళ్ళను కొట్టుకుపోయింది.
నా ప్రాణమా! బలం పుంజుకొని
ముందుకు సాగు.
22 అప్పుడు గుర్రాలు కదం త్రొక్కాయి.
అతడి బలమైన గుర్రాలు వేగంగా
ఎగసిపోయాయి.
23 యెహోవా దూత✽ ‘మేరోజు✽ను
శపించు’ అన్నాడు,
‘దాని కాపురస్తులను బాగా శపించు.
ఎందుకని? యెహోవాకు సహాయం రాలేదు వాళ్ళు,
బలాఢ్యులను ఎదిరించడానికి యెహోవాకు
సహాయం రాలేదు.’
24 స్త్రీలందరిలో యాయేల్✽ ధన్యజీవి.
కేయీనువాడైన హెబెరు భార్య ఆమె.
డేరాలలో కాపురం ఉంటున్న స్త్రీలందరిలో
ఆమె ధన్యజీవి.
25 అతడు నీళ్ళు అడిగాడు.
ఆమె పాలు తెచ్చి ఇచ్చింది.
నాయకులకు తగిన పాత్రలో
మీగడ తెచ్చి ఇచ్చిందామె.
26 డేరా మేకును చేతపట్టుకొంది.
పనివాడి సుత్తెను కుడిచేత్తో పట్టుకొంది.
సీసెరాను కొట్టిందామె.
వాడి తలను చితగ్గొట్టింది.
వాడి కణత చీల్చి చెండాడింది.
27 ఆమె కాళ్ళదగ్గర వాడు వంగాడు, కూలాడు.
అక్కడ పడివున్నాడు.
ఆమె కాళ్ళదగ్గర వాడు వంగి కూలిపోయాడు.
వంగి కూలిన దగ్గరే ప్రాణం విడిచాడు.
28 సీసెరా తల్లి✽ కిటికీలో నుంచి చూచింది.
అల్లికలో నుంచి చూస్తూ ఇలా కేక వేసింది:
‘ఇంత సేపున్నదేం ఇతడి రథం?
ఇతడి రథాల చప్పుడు
ఇంత సేపు వినబడలేదేం?’
29 ఆమె దగ్గర తెలివైన రాకుమార్తెలు
ఆమెకు బదులు చెప్పారు–
తన మాటలు తనే నెమరు వేసుకొంది–
30 ‘వాళ్ళకు దోపిడీ దొరికింది గదా!
పంచుకొంటున్నారు గదా!
ఒక్కో సైనికుడికి ఒకరిద్దరు
పడుచులు దొరికివుండాలి.
రంగురంగుల బట్టలు
సీసెరాకోసం దోచుకొంటూ ఉండాలి.
బుట్టాలు వేసిన రంగురంగుల బట్టలు అతడికోసం!
దోచుకొన్న వాళ్ళ మెడలకోసం,
విచిత్రంగా బుట్టాలు వేసిన రంగురంగుల
బట్టలు దొరికివుంటాయి!’
31 యెహోవా, ఆ విధంగానే నీ శత్రువులంతా
అంతం అవుతారు✽ గాక!
కానీ, నిన్ను ప్రేమించేవారు బలంతో ఎగసివచ్చే
ప్రొద్దులాగా ఉంటారు గాక!”
ఆ తరువాత నలభైయేళ్ళు దేశం ప్రశాంతంగా ఉంది.