4
1 ✝ఏహుదు చనిపోయాక ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. 2 గనుక యెహోవా వాళ్ళను హాసోరు✽ నగరంలో పరిపాలిస్తున్న కనానుజాతివాళ్ళ రాజు యాబీను✽ వశం చేశాడు. హరోషత్‌హగోయింలో నివసించే సీసెరా అతడి సైన్యాధిపతి. 3 యాబీనుకు తొమ్మిది వందల ఇనుప రథాలుండేవి✽. అతడు ఇరవైయేళ్ళు ఇస్రాయేల్ వారిని తీవ్రంగా బాధించాడు గనుక సహాయం చెయ్యమని వారు యెహోవాకు మొరపెట్టారు.4 ✽ఆ రోజుల్లో లప్పీదోతు భార్య దెబోరా ఇస్రాయేల్ ప్రజలకు నాయకురాలుగా ఉండేది. ఆమె దేవుని మూలంగా పలికే స్త్రీ✽ కూడా. 5 ఎఫ్రాయిం✽ కొండ ప్రాంతంలో రమాకు బేతేల్✽కు మధ్య ‘దెబోరా ఖర్జూర చెట్టు’ క్రింద న్యాయం తీర్చడానికి ఆమె కూర్చుని ఉండేది. ఇస్రాయేల్‌ప్రజలు వ్యాజ్య పరిష్కారం కోసం ఆమె దగ్గరికి వచ్చేవారు. 6 ఒకరోజు ఆమె అబీనోయం కొడుకైన బారాకు✽ను నఫ్తాలి ప్రదేశంలో కెదెషునుంచి పిలిపించి అతనితో ఇలా చెప్పింది:
“ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు✽ ‘వెళ్ళు! నఫ్తాలి గోత్రంనుంచి, జెబూలూను గోత్రంనుంచి పదివేల మందిని వెంటబెట్టుకొని తాబోరు✽ కొండకు వెళ్ళు. 7 యాబీను యొక్క సైన్యాధిపతి సీసెరా తన రథాలతో, సైన్యంతో కీషోను✽ ఏటి దగ్గర నిన్ను ఎదుర్కోవడానికి వచ్చేలా నేను చేస్తాను✽. అతణ్ణి నీ వశం చేస్తాను.’”
8 ✽“నీవు నాతో వస్తే నేను వెళ్తాను. నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను” అని బారాకు ఆమెకు జవాబిచ్చాడు.
9 అందుకామె “నేను మీతో తప్పక వస్తాను. అయినా, మీరు చేసే ఈ దండయాత్రలో మీకు మాత్రం పేరుప్రతిష్ఠలు రావు. యెహోవా సీసెరాను ఓ స్త్రీ చేతికి అప్పగిస్తాడు” అని చెప్పింది.
అప్పుడు దెబోరా బారాకుతో కూడా బయలుదేరి కెదెషు✽ వెళ్ళింది. 10 బారాకు జెబూలూనువారిని నఫ్తాలివారిని కెదెషుకు పిలిపించాడు. అతని వెంట పది వేల మంది వెళ్ళారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది.
11 హెబెరు✽ కేయిను వంశంవాడు. అంతకు ముందు అతడు మోషే మామ హోబాబు✽ వంశంవారైన ఇతర కేయిను వారినుంచి విడిపోయి కెదెషుకు దగ్గరగా జయనన్నీంలో ఉన్న పెద్ద చెట్టు దగ్గర తన డేరా వేసుకొన్నాడు. 12 అబీనోయం కొడుకైన బారాకు తాబోరుకొండకు వెళ్ళాడని సీసెరాకు ఎవరో తెలియజేశారు. 13 ✽సీసెరా తన తొమ్మిది వందల ఇనుప రథాలను, అతనితో ఉండే వాళ్ళందరినీ హెరోషత్ హాగోయిం నుంచి కీషోను ఏటి దగ్గరికి రప్పించాడు. 14 అప్పుడు దెబోరా బారాకుతో, “బయలుదేరు! సీసెరాను యెహోవా మీ వశం చేసేది ఈ రోజే! మీకు ముందు యెహోవా వెళ్ళాడు✽ గదా!” అంది.
అప్పుడు బారాకు తన వెంట వచ్చిన ఆ పదివేలమందితో తాబోరుకొండ దిగాడు. 15 బారాకు ఎదుట యెహోవా సీసెరాను, అతడి ఇనుప రథాలన్నిటినీ, అతడి సైన్యమంతటినీ తల్లడిల్లిపోయేలా, కత్తి పాలయ్యేలా చేశాడు✽. సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయాడు. 16 హరోషత్‌హాగోయిం వరకు అతడి రథాలను, సైన్యాన్ని బారాకు తరిమాడు. సీసెరా సైన్యమంతా కత్తివాతకు గురి అయి కూలారు. ఒక్కడు కూడా మిగలలేదు.
17 ✽కాని, సీసెరా కాలినడకన కేయినువాడైన హెబెరు భార్య యాయేల్ డేరాకు పారిపోయాడు. ఎందుకంటే, హాసోరురాజైన యాబీనుకు, కేయినువాడైన హెబెరు కుటుంబానికి స్నేహం ఉండేది. 18 యాయేల్ సీసెరాను కలుసుకోవడానికి బయటికి వచ్చి “మా యజమానీ! లోపలికి దయచేయండి! భయపడకండి” అంది. అతడప్పుడు ఆమెతో డేరా✽ లోపలికి వెళ్ళాడు. ఆమె అతడికి ఒక దుప్పటి కప్పింది.
19 “నాకు దప్పికవుతుంది. దయచేసి తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తావా?” అని అతడు ఆమెను అడిగాడు. ఆమె పాల తిత్తి✽ని విప్పి త్రాగడానికి ఇచ్చి, మళ్ళీ దుప్పటి కప్పింది. 20 అప్పుడతడు ఆమెతో ఇలా అన్నాడు:
“డేరా ముందు తలుపు దగ్గర నిలబడివుండు. ఎవరైనా వచ్చి ‘ఇక్కడ ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు”.
21 ✽అతడు అలసిపోయి బాగా నిద్రపోయాడు. అప్పుడు హెబెరు భార్య యాయేల్ డేరా మేకు ఒక దానిని, సుత్తెను చేతపట్టుకొని, మెల్లగా అతడి దగ్గరికి వెళ్ళింది. ఆ మేకును అతడి కణతలలోనుంచి నేలలోకి దిగగొట్టింది. దానితో అతడు చచ్చాడు. 22 బారాకు సీసెరాను తరుముకొంటూ వచ్చాడు. యాయేల్ బారాకును కలుసుకోవడానికి బయటికి వచ్చి, “రండి! మీరు వెదకుతున్నవాణ్ణి మీకు చూపిస్తాను” అంది. అతడు ఆమెతో లోపలికి వెళ్ళాడు. అక్కడ సీసెరా చచ్చి పడి ఉండడం కనిపించింది. అతడి కణతల్లో డేరా మేకు ఉంది.
23 ఆ రోజున యెహోవా ఇస్రాయేల్‌ప్రజల ముందు కనానుజాతివాళ్ళ రాజు యాబీనును అణగద్రొక్కాడు. 24 కనానుజాతివాళ్ళ రాజైన యాబీనును నాశనం✽ చేసేవరకు ఇస్రాయేల్‌ప్రజల బలం అతడికి వ్యతిరేకంగా ఎక్కువవుతూ వచ్చింది.