3
1 ఇస్రాయేల్‌ప్రజలకూ కనాను జనాలకూ జరిగిన యుద్ధాలలో దేనినీ అనుభవించని ఇస్రాయేల్‌వారందరినీ పరీక్ష✽ చేయాలని యెహోవా కొన్ని జనాలను ఉండనిచ్చాడు. 2 మునుపు ఆ యుద్ధాలను అనుభవించని ఇస్రాయేల్ తరాలకు యుద్ధం నేర్పడానికే✽ ఆయన అలా చేశాడు. 3 ఆయన ఉండనిచ్చిన జనాలేవంటే: ఫిలిష్తీయవాళ్ళ✽లో అయిదుగురు నాయకులు, బయల్‌హర్మోను పర్వతం నుంచి లెబోహెమతు✽ దాకా లెబానోను పర్వతప్రదేశంలో ఉన్న కనానుజాతివాళ్ళంతా, సీదోనువాళ్ళంతా, హివ్వి జాతివాళ్ళంతా. 4 ✝యెహోవా ఇస్రాయేల్‌వారి పూర్వీకులకు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను ఇస్రాయేల్‌ప్రజ పాటిస్తారో లేదో వారిని పరీక్షించి చూడడానికి యెహోవా ఆ జనాలను ఉండనిచ్చాడు. 5 ✝కనాను, హిత్తి, అమోరీ, పెరిజ్జి, హివ్వి, యెబూసి – ఈ జాతుల మధ్య ఇస్రాయేల్ ప్రజలు కాపురం ఉన్నారు. 6 వాళ్ళ కూతుళ్ళను పెళ్ళిచేసుకొన్నారు, తమ కూతుళ్ళను వాళ్ళ కొడుకులకు ఇచ్చారు. వాళ్ళ దేవుళ్ళను కొలిచారు.7 ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు✽. తమ దేవుడు యెహోవాను మరచిపోయి, బయల్ దేవుళ్ళ✽నూ అషేరాదేవి✽ స్తంభాలనూ పూజించారు. 8 అందుకని ఇస్రాయేల్ ప్రజమీద యెహోవాకు తీవ్ర కోపం✽ వచ్చింది. ఆయన వారిని అరాంనహరాయిం✽ రాజైన కూషన్‌రిషాతాయిం వశం చేశాడు. కూషన్‌రిషాతాయింకు ఇస్రాయేల్‌ప్రజ ఎనిమిదేళ్ళు సేవ చేయవలసి వచ్చింది. 9 ఇస్రాయేల్‌ప్రజ యెహోవాకు మొరపెట్టినప్పుడు✽ యెహోవా వారిని విడిపించడానికి ఒక మనిషిని బయలుదేరేలా చేశాడు. అతడు కాలేబు తమ్ముడైన కనజు కొడుకు ఒతనీయేల్. అతడు వారిని విడిపించాడు. 10 యెహోవా ఆత్మ✽ అతణ్ణి ఆవరించాడు గనుక, అతడు ఇస్రాయేల్‌ప్రజకు నాయకుడు అయి యుద్ధానికి వెళ్ళాడు. అరాందేశం రాజైన కూషన్‌రిషాతాయింను యెహోవా ఒతనీయేల్ వశం చేశాడు. అతడు కూషన్‌రిషాతాయిం మీద విజయం సాధించాడు. 11 ✝ఆ తరువాత కనజు కొడుకు ఒతనీయేల్ చనిపోయేవరకు నలభై ఏళ్ళు దేశం ప్రశాంతంగా ఉంది.
12 ఇస్రాయేల్‌ప్రజ యెహోవా దృష్టిలో మళ్ళీ✽ చెడ్డగా ప్రవర్తించారు. వారలా చెడ్డగా ప్రవర్తించినందుచేత యెహోవా మోయాబు✽దేశం రాజు ఎగ్లోను వారిని జయించేలా అతణ్ణి బలపరచాడు. 13 ✽అతడు అమ్మోనువాళ్ళను, అమాలేకు వాళ్ళను కూడగట్టుకొని వెళ్ళి, ఇస్రాయేల్‌ప్రజను ఓడించి ‘ఖర్జూర పట్టణం✽’ స్వాధీనం చేసుకొన్నాడు. 14 మోయాబుదేశం రాజు ఎగ్లోనుకు ఇస్రాయేల్‌ప్రజ పద్దెనిమిదేళ్ళు సేవ చేయవలసి వచ్చింది. 15 ✽ఇస్రాయేల్ ప్రజ యెహోవాకు మళ్ళీ మొరపెట్టారు. యెహోవా వారిని విడిపించడానికి మరొకరిని ఇచ్చాడు. అతడు బెన్యామీను గోత్రంవాడైన గెరా కొడుకు ఏహూదు. అతడు ఎడమచేతి వాటం✽ గలవాడు. ఇస్రాయేల్ ప్రజ అతణ్ణి కప్పం✽తో మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి పంపించారు. 16 ఏహూదు రెండంచుల కత్తిని ఒక దానిని చేయించుకొన్నాడు. దాని పొడుగు ఒక మూర. దానిని బట్టల చాటున కుడిప్రక్క కట్టుకొన్నాడు. 17 అతడు మోయాబు రాజు ఎగ్లోను దగ్గరికి ఆ కప్పం తెచ్చాడు. ఎగ్లోను చాలా లావైన మనిషి. 18 ఏహూదు కప్పం ఇచ్చిన తరువాత దానిని మోసుకువచ్చిన వాళ్ళను పంపివేశాడు.
19 గిల్గాల్‌లో ఉన్న విగ్రహాల దగ్గరనుంచి ఏహూదు ఎగ్లోను దగ్గరికి తిరిగి వెళ్ళి “రాజా! నేను నీతో ఓ మాట రహస్యంగా చెప్పాలి” అన్నాడు. రాజు “ఊరుకోండి” అనడంతో అతడి పరిచారకులంతా బయటికి వెళ్ళారు. 20 అతడు తన శీతల మేడగదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతణ్ణి సమీపించి “నేను దేవునినుంచి నీకో కబురు✽ తెచ్చాను” అన్నాడు. రాజు తన పీఠంమీదనుంచి లేచాడు. 21 ✽వెంటనే ఏహూదు తన ఎడమచేతిని తన మొల కుడిప్రక్కగా పోనిచ్చి, కత్తి లాగి, రాజు కడుపులో పొడిచాడు. 22 కత్తితో పాటు పిడి కూడా అతడి కడుపులోకి దూరిపోయింది. ఏహూదు దానిని బయటికి లాగలేదు. క్రొవ్వు దానిమీద కప్పుకొంది. 23 ఏహూదు వసారాలోకి వచ్చి, తన వెనుక ఆ మేడ గది తలుపులు మూసి తాళం వేశాడు.
24 అతడు వెళ్ళిపోయాక రాజ సేవకులు వచ్చి, మేడగది తలుపులు తాళం వేసి ఉండడం చూశారు. అతడు లోపలికి మరుగుదొడ్డికి పోయాడనుకొన్నారు. 25 వాళ్ళు తత్తరపాటు పడేవరకు చూస్తూ ఉన్నారు గాని, అతడు గది తలుపులు తెరవలేదు. చివరికి వాళ్ళు తాళం చెవి తెచ్చి తెరిచారు. తమ యజమాని చచ్చి నేలమీద పడి ఉండడం వాళ్ళకు కనిపించింది. 26 వాళ్ళు అలా చూస్తూ ఉండే సమయంలో ఏహూదు తప్పించుకొని ఆ విగ్రహాలను దాటి శెయీరుకు పారిపోయాడు. 27 అతడు అక్కడ చేరి ఎఫ్రాయిం కొండప్రాంతంలో బూర✽ ఊదాడు. ఆ కొండప్రాంతంనుంచి ఇస్రాయేల్‌ప్రజ అతనితో దిగివచ్చారు. అతడు వారిముందు నడిచాడు.
28 “మీ శత్రువులైన మోయాబువాళ్ళను యెహోవా మీ వశం చేశాడు గనుక, నా వెంటరండి” అని వారితో చెప్పాడు. వారు అతని వెంట వెళ్ళి, మోయాబుదేశానికెదురుగా ఉన్న యొర్దాను రేవులను✽ ఆక్రమించి ఎవరినీ నది దాటనియ్యలేదు. 29 ఆ సమయాన మోయాబువాళ్ళను పది వేలమంది మంచి బలంగల శూరులను వారు హతమార్చారు. ఒక్కడు కూడా తప్పించుకు పోలేకపోయాడు. 30 ఆ రోజున ఇస్రాయేల్ వారి చేతిక్రింద మోయాబు అణగారిపోయింది. ఇస్రాయేల్‌దేశం ఎనభైయేళ్ళు✽ ప్రశాంతంగా ఉంది.
31 ఏహూదు తరువాత అనాతు కొడుకు షమ్గరు✽ నాయకుడుగా ఉన్నాడు. అతడు ములుకోలతో ఆరు వందల✽ మంది ఫిలిష్తీయవాళ్ళను హతం చేశాడు. అతడు కూడా ఇస్రాయేల్‌ప్రజను విడిపించాడు.