2
1 యెహోవా దూత గిల్గాల్ నుంచి బోకీంకు వచ్చి ఇలా అన్నాడు: “నేను మిమ్ములను ఈజిప్ట్ నుంచి తీసుకు వచ్చాను. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఈ దేశానికి మిమ్ములను చేర్చాను. నేను మీతో చేసిన ఒడంబడిక ఎన్నడూ మీరనని, 2 మీరు ఈ దేశస్తులతో ఏ విధమైన ఒడంబడికా చేసుకోకూడదని, వారి బలిపీఠాలను పడగొట్టాలని మీతో చెప్పాను. అయినా మీరు నా మాట లెక్కచెయ్యలేదు. మీరు అలా ఎందుకు ప్రవర్తించారు? 3 కనుక నేను వాళ్ళను మీ ఎదుటనుంచి వెళ్లగొట్టనని, వాళ్ళు మీ ప్రక్కలో బల్లేలుగా ఉంటారని, వాళ్ళ దేవుళ్ళు మీకు ఉచ్చుగా ఉంటారని ఇప్పుడు చెపుతున్నాను”.
4 ఇస్రాయేల్ ప్రజలందరితో యెహోవా దూత ఈ మాటలు చెప్పినప్పుడు వారు బోరున ఏడ్చారు. 5 అందుకే ఆ స్థలాన్ని వారు ‘బోకీం’ అన్నారు. అక్కడ వారు యెహోవాకు బలులర్పించారు.
6 యెహోషువ ప్రజలను పంపివేసిన తరువాత, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారి వారి వారసత్వం భూములకు వారు వెళ్ళారు. 7 యెహోషువ బ్రతికినన్నాళ్ళూ ఇస్రాయేల్ ప్రజకోసం యెహోవా చేసిన గొప్ప పనులు చూచి, యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన పెద్దల జీవిత కాలంలోనూ ప్రజలు యెహోవాను సేవించారు. 8 నూను కొడుకూ యెహోవా సేవకుడూ అయిన యెహోషువ తన నూట పదో ఏట చనిపోయాడు. 9 వారు అతణ్ణి అతడి వారసత్వ భూమిలో తిమ్నత్‌సెరహులో సమాధి చేశారు. అది ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని గాయషు కొండకు ఉత్తరంగా ఉంది.
10 ఆ తరం వారంతా వారి పూర్వీకుల దగ్గరికి చేరారు. ఆ తరువాత తరంవారు యెహోవాను తెలుసుకొన్నవారు కాదు. ఆయన ఇస్రాయేల్‌ప్రజ కోసం చేసిన చర్యలు కూడా తెలిసినవారు కాదు. 11 అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి బయల్‌దేవుళ్ళను పూజించారు. 12 ఈజిప్ట్‌నుంచి తమ పూర్వీకులను తీసుకువచ్చిన తమ పూర్వీకుల దేవుడు యెహోవాను విడిచిపెట్టారు. వారి చుట్టూరా ఉన్న జనాలు వేరు వేరు దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, యెహోవాకు కోపం రేపారు. 13 వారు యెహోవాను విడిచిపెట్టి బయల్‌దేవుణ్ణి అష్తారోతుదేవిని కొలిచినందుచేత 14 ఇస్రాయేల్ ప్రజల మీద యెహోవా కోపంతో మండిపడ్డాడు, వారిని దోపిడీదారుల గుంపుల వశం చేశాడు. వాళ్లు ఇస్రాయేల్ ప్రజలను దోచుకొన్నారు. యెహోవా వారిని తమ చుట్టూ ఉన్న శత్రువుల వశం చేశాడు. వారి పగవారి ముందు వారు నిలవలేకపోయారు. 15 వారెక్కడికి వెళ్ళినా పూర్వం తాను వారికి శపథం చేసి చెప్పినట్టే యెహోవా హస్తం వారికి వ్యతిరేకం అయి వారికి అపజయం కలిగించింది. అందువల్ల వారు చాలా కష్టాలు అనుభవించారు. 16 అప్పుడు యెహోవా నాయకులను లేపాడు. వారు దోపిడీదారుల బారినుంచి వారిని రక్షించారు. 17 అయినా వారు తమ నాయకుల మాట వినలేదు. వారు ఇతర దేవుళ్ళకు నమస్కారం చేసి వేశ్యలలాగా ప్రవర్తించారు. వారు తమ పూర్వీకుల మాదిరిని అనుసరించ లేదు. వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు లోబడి బ్రతికిన మార్గం నుంచి వారు త్వరలోనే తొలగిపోయారు. 18 వారి కోసం యెహోవా నాయకుణ్ణి లేపినప్పుడెల్లా ఆ నాయకుడితో యెహోవా ఉండేవాడు. ఆ నాయకుడు బ్రతికినన్నాళ్ళు శత్రువుల చేతులనుంచి ఆయన వారిని రక్షించాడు. ఎందుకంటే వారిని అణగద్రొక్కి బాధిస్తూ ఉన్న వాళ్ళవల్ల వారు మూలుగుతూ ఉంటే ఆయన జాలిపడేవాడు. 19 కానీ, ఆ నాయకుడు చనిపోయాక వారు యెహోవా నుంచి తొలగి పోయి, తమ పూర్వీకులకంటే ఎక్కువ చెడ్డగా ప్రవర్తించేవారు. ఇతర దేవుళ్ళను అనుసరించి, సేవించి, పూజించేవారు. వారలా తమ దురాచారాలను గానీ, మూర్ఖత్వాన్ని గానీ విడిచిపెట్టలేదు. 20 అందుచేత ఇస్రాయేల్‌ప్రజ మీద యెహోవా తీవ్ర కోపంతో మండిపడి ఇలా అన్నాడు:
“ఈ ప్రజ వీరి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడిక మీరి, నా మాట వినలేదు. 21 గనుక యెహోషువ చనిపోయినప్పుడు ఈ దేశంలో మిగిలిన జనాలలో ఏ జనాన్నీ వారి ముందునుంచి నేనిక తోలివేయను. 22 ఇస్రాయేల్‌వారు వారి పూర్వీకులు నడిచినట్టు యెహోవా మార్గంలో నడుస్తారో లేదో ఆ జనాల ద్వారా పరీక్షించి చూస్తాను.”
23 అంతకు ముందు యెహోవా ఆ జనాలను యెహోషువ వశం చేయక వెంటనే వెళ్ళగొట్టక వాటిని ఉండనిచ్చాడు.