న్యాయాధిపతులు
1
1 యెహోషువ✽ చనిపోయిన తరువాత ఇస్రాయేల్‌ప్రజలు “కనానువాళ్ళ✽తో యుద్ధం చేయడానికి మాలో ముందు ఎవరు వెళ్ళాలి?” అని యెహోవాను ప్రార్థించారు.2 “యూదా గోత్రంవారు ముందు వెళ్ళాలి. నేను ఈ దేశాన్ని వారి చేతికి అప్పగించాను” అని యెహోవా జవాబిచ్చాడు.
3 అప్పుడు యూదావారు తమ సోదరులైన షిమ్యోను గోత్రం✽వారితో “కనానువాళ్ళ మీద యుద్ధం చేయడానికి మా వాటా భూమిలోకి మాతోపాటు రండి. అలాగే మీతోపాటు మేము మీ వాటా భూమిలోకి వస్తాం” అని చెప్పారు. గనుక షిమ్యోనువాళ్ళు వారితో కూడా వెళ్ళారు. 4 యూదావారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కనానుజాతివాళ్ళను, పెరిజ్జిజాతి వాళ్ళను✽, యెహోవా వారి చేతికి అప్పగించాడు. వారు బెజెకు దగ్గర పదివేలమందిని హతం చేశారు. 5 బెజెకు దగ్గర అదోనిబెజెకును చూచి, అతడితో యుద్ధం చేసి, కనాను వాళ్ళను, పెరిజ్జివాళ్ళను ఓడించారు. 6 అదోనిబెజెకు✽ పారిపోయాడు గాని అతణ్ణి తరిమి, పట్టుకొని, అతడి చేతి బొటనవ్రేళ్ళు, కాలి బొటనవ్రేళ్ళు కోసి పారేశారు. 7 అదోనిబెజెకు అన్నాడు, “ఇలా కాళ్ళుచేతుల బొటన వ్రేళ్ళు కోయబడ్డ రాజులు డెబ్భైమంది నా బల్ల✽కింద పడ్డ ఎంగిలి ముక్కలు ఏరుకొన్నారు. నేను చేసినదానికి దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు.” వారు అతణ్ణి జెరుసలంకు తీసుకువచ్చారు. అతడక్కడ చనిపోయాడు.
8 యూదావారు జెరుసలం✽ మీద కూడా యుద్ధం చేసి, దానిని పట్టుకొని కత్తిపాలు చేసి తగులబెట్టారు. 9 ఆ తరువాత యూదా మనుషులు కొండప్రదేశం✽లో, దక్షిణం ఎడారి✽లో, పడమటి కొండ దిగువప్రాంతంలో కాపురమున్న కనానువాళ్ళపై యుద్ధానికి బయలుదేరారు. 10 వారు హెబ్రోనులో ఉండి కనానువాళ్ళ మీదికి వెళ్ళారు. (హెబ్రోను✽కు ముందు పేరు కిర్యత్‌అర్బా.) అక్కడ షేషయి, అహీమాను, తలమయి అనేవాళ్ళను హతమార్చారు. 11 అక్కడనుంచి వారు దెబీరు✽ కాపురస్తులమీద దండెత్తారు. (దెబీరుకు ముందు పేరు కిర్యత్ సేఫెరు.) 12 “కిర్యత్ సేఫెరును ఓడించి దానిని పట్టుకొన్న వాడికి నా కూతురు అక్సాను పెళ్ళి చేస్తాను” అని కాలేబు✽ చాటించాడు. 13 కాలేబు తోబుట్టువు కనజు కొడుకైన ఒతనీయేల్✽ ఆ ఊరు పట్టుకొన్నాడు గనుక అతనికి కాలేబు తన కూతురు అక్సాను భార్యగా ఇచ్చాడు. 14 ఆమె అతడి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడుగుదామని అతణ్ణి సమ్మతింపజేసింది. ఆమె వచ్చి గాడిద దిగగానే “నీకేం కావాలమ్మా” అని కాలేబు అడిగాడు.
15 “నా పై అనుగ్రహం చూపండి. మీరు నన్ను దక్షిణ ఎడారిప్రాంతంలో ఉంచారు. కనీసం కొన్ని ఊటలు నాకివ్వండి” అందామె. అందుచేత అతడు ఆమెకు ఎగువనున్న ఊటలూ, దిగువనున్న ఊటలూ ఇచ్చాడు.
16 మోషే మామ✽ కేయినుజాతివాడు✽. అతడి సంతానం యూదాప్రజలతోపాటు ‘ఖర్జూరచెట్ల పట్టణం’✽ నుంచి అరాదుకు దక్షిణంగా ఉన్న యూదా ఎడారికి వెళ్ళారు. అక్కడి జనంమధ్య కాపురం ఏర్పరచుకొన్నారు. 17 అప్పుడు యూదావారు తమ సోదరులైన షిమ్యోను గోత్రంవారితో కలిసి వెళ్ళి జెఫతులో ఉన్న కనాను జాతివాళ్ళను హతమార్చి, పట్టణాన్ని సర్వనాశనం చేశారు. అందుకే ఆ పట్టణానికి హోర్మా✽ అనే పేరు వచ్చింది. 18 ✽గాజానూ దాని ప్రాంతాన్నీ, అష్కేలోనునూ దాని ప్రాంతాన్నీ, ఎక్రోనునూ దాని ప్రాంతాన్నీ కూడా యూదావారు పట్టు కొన్నారు. 19 యూదావారికి యెహోవా తోడుగా ఉన్నాడు. వారు కొండ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, మైదానాల ప్రదేశంలో ఉన్న వాళ్ళకు ఇనుప రథాలు✽న్నందు చేత వాళ్ళను మాత్రం వెళ్ళగొట్టలేదు✽. 20 మోషే ఇచ్చిన మాటప్రకారం హెబ్రోనును కాలేబు✽కు ఇచ్చారు. అతడు అనాకు✽ యొక్క ముగ్గురు కొడుకులను దాని నుంచి వెళ్ళగొట్టాడు. 21 ✽కానీ, జెరుసలంలో కాపురమున్న యెబూసిజాతివాళ్ళను✽ బెన్యామీను గోత్రంవారు వెళ్ళగొట్టలేదు. ఈనాటికీ జెరుసలంలో యెబూసివాళ్ళు బెన్యామీనువారితో కాపురం ఉన్నారు.
22 యోసేపు వంశంవారు✽ బేతేల్ మీదికి యుద్ధానికి వెళ్ళారు. యెహోవా వారితో ఉన్నాడు. 23 బేతేల్‌ను వేగు చూడడానికి యోసేపు వంశంవారు కొంతమందిని పంపించారు. (బేతేల్‌కు ముందు పేరు లూజు.) 24 ఎవరో ఒకరు ఊరిలో నుంచి రావడం ఆ గూఢచారులు చూశారు. “ఊరిలోకి మాకు దారి చూపితే మీకు మేలు చేస్తాం” అని అతడితో చెప్పారు. 25 అతడు ఊరిలోకి దారి చూపాడు. వారు ఊరిని కత్తిపాలు చేశారు గాని, ఆ మనిషిని, అతడి కుటుంబం వారందరినీ మాత్రం వాళ్ళు వదలివేశారు. 26 అతడు హిత్తివాళ్ళ✽ దేశం పోయి అక్కడ ఒక ఊరిని నిర్మించి దానికి లూజు అని పేరు పెట్టాడు. ఈనాటికీ దానికి అదే పేరు.
27 మనష్షే గోత్రంవారు బేత్‌షెయాను, తయినాకు, దోరు, ఇబలెయీం, మెగిద్దో పట్టణాలనూ వాటి గ్రామాలనూ వశం చేసుకోలేదు✽. ఎందుకంటే కనానువాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి పోవాలని గట్టి పట్టుపట్టారు. 28 ఇస్రాయేల్‌ప్రజ బలపడ్డాక వారు ఆ కనాను వాళ్ళతో వెట్టిచాకిరి✽ చేయించు కొన్నారు గాని వారిని పూర్తిగా వెళ్ళగొట్టలేదు. 29 ఎఫ్రాయిం గోత్రంవారు గెజెరులో ఉన్న కనానువాళ్ళను వెళ్ళగొట్టలేదు. కనానువారు గెజెరులో వారిమధ్యనే కాపురముంటున్నారు. 30 జెబూలూను గోత్రంవారు కిత్రోను కాపురస్తులను గానీ నహలోల్ కాపురస్తులను గానీ వెళ్ళగొట్టలేదు. కనానువాళ్ళు వారిమధ్యనే కాపురం ఉంటూ వారికి వెట్టిచాకిరి చేసేవాళ్ళయ్యారు. 31 ఆషేరు గోత్రంవారు అక్కోలో గానీ, సీదోనులో గానీ, అహ్లాబ్‌లో గానీ, అక్‌జీబ్‌లో గానీ, హెలబాలో గానీ, అఫెకులో గానీ, రెహోబ్‌లో గానీ కాపురమున్న వాళ్ళను వెళ్ళగొట్టలేదు. 32 అందుచేత ఆషేరు ప్రజలు ఆ ప్రదేశంలో ఉన్న కనానువాళ్ళ మధ్య నివాసం చేశారు. 33 నఫ్తాలి గోత్రంవారు బేత్‌షెమెషు కాపురస్తులను గానీ బేతనాతు కాపురస్తులను గానీ వెళ్ళగొట్ట లేదు. నఫ్తాలివారు కూడా కనానువారిమధ్య కాపురం చేశారు. అయినా బేత్‌షెమెషువాళ్ళు, బేతనాతువాళ్ళు వారికి వెట్టిచాకిరి చేసేవాళ్ళయ్యారు. 34 దాను గోత్రంవారిని అమోరీజాతివాళ్ళు✽ కొండ ప్రాంతానికి నెట్టివేశారు. వారిని మైదానాల ప్రాంతానికి రానివ్వలేదు. 35 అమోరీవాళ్ళు హెరేసు కొండలో అయ్యాలోనులో, షయల్‌బీమ్లో కాపురముండాలని గట్టి పట్టు పట్టారు. కాని, యోసేపువంశంవారి బలం వృద్ధి అయ్యాక వాళ్ళచేత వెట్టిచాకిరి చేయించుకొన్నారు. 36 అక్రబ్బీం నుంచి సెలావరకు సెలా అవతలకు అమోరీవాళ్ళ సరిహద్దు వ్యాపించింది.