21
1 ఇస్రాయేల్‌ప్రజ ఇలా మిస్పాలో శపథం చేశారు: “మనలో ఎవ్వరూ బెన్యామీనువారితో వియ్యమంద కూడదు.” 2  ఇప్పుడు వారు బేతేల్‌కు వెళ్ళి, అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఉండి గొంతెత్తి భోరున ఏడ్చారు.
3 “యెహోవా! ఇస్రాయేల్‌ప్రజల దేవా! ఇస్రాయేల్ ప్రజలకు ఇలా ఎందుకు జరిగింది? ఈరోజు ఇస్రాయేల్ గోత్రాలలో ఒక గోత్రం లేకుండా పోయిందెందుకు?” అన్నారు.
4 మరుసటి రోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపీఠం కట్టి దానిమీద హోమ బలులు, శాంతి బలులు అర్పించారు. 5 అప్పుడు ఇస్రాయేల్‌ప్రజలు “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకుండా ఉన్నారా?” అని విచారించారు. ఎందుకంటే, మిస్పాలో యెహోవా ఎదుట ఎవరైనా సమావేశం కాకపోతే వారిని చంపాలని వారు అక్కడ శపథం చేశారు. 6 ఇప్పుడు వారు తమ సోదరులైన బెన్యామీనువారి విషయం నొచ్చుకుంటూ, “ఇస్రాయేల్‌లో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయిందే. 7 వారికి మన పిల్లలను పెళ్ళిచేయకూడదని మనం యెహోవా పేర శపథం చేసుకొన్నాం గదా! మరి వారిలో మిగిలిన వారికి భార్యల మాట ఎలా? వీరి కోసం ఏం చేద్దామంటారు?” అని చెప్పుకొన్నారు.
8 అప్పుడు వారు ఇలా ప్రశ్నించుకొన్నారు: “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో నుంచి యెహోవా ఎదుట మిస్పాలో సమావేశం కాని గోత్రం ఏది?”
చివరకు యాబేష్ గిలాదునుంచి సమావేశానికి ఎవ్వరూ శిబిరంలోకి రాలేదని తెలుసుకొన్నారు. 9 ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు యాబేష్ గిలాదునుంచి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
10 అప్పుడు సమాజంవారు పన్నెండు వేలమంది యుద్ధవీరులను యాబేష్ గిలాదుకు పంపిస్తూ ఇలా ఆదేశించారు.: “మీరు అక్కడికి వెళ్ళి అక్కడి వాళ్ళను – స్త్రీలనూ చిన్నవాళ్ళను కూడా – ఖడ్గానికి గురి చేయాలి. 11 మీరు చేయవలసినదేమిటంటే, ప్రతి పురుషుణ్నీ, కన్య కాని ప్రతి స్త్రీని చంపండి.”
12 వారు వెళ్ళి, యాబేష్ గిలాదులో ఉన్న వారిలో పురుష సాంగత్యం ఎరుగని నాలుగువందల మంది యువతులను కనుగొన్నారు. వారిని కనానులో షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకువచ్చారు. 13 అప్పుడు సమాజమంతా రిమ్మోనుబండ దగ్గర ఉన్న బెన్యామీనువారికి శాంతి చేసుకుందామని కబురు పంపారు. 14 ఆ సమయంలో బెన్యామీనువారు తిరిగి వచ్చారు. యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికి ఇవ్వడం జరిగింది. అయితే వారందరికీ సరిపోయేంతమంది లేరు.
15 ఇస్రాయేల్ గోత్రాలలో లోపం కలిగేలా యెహోవా చేసినందుచేత ప్రజలు బెన్యామీను వారి విషయం నొచ్చుకొన్నారు. 16 అప్పుడు సమాజం పెద్దలు ఇలా అన్నారు:
“బెన్యామీను గోత్రంలో స్త్రీలు ఉండకుండా నాశనమయ్యారు గదా. మరి ఈ మిగతా పురుషులకు భార్యలు దొరికేట్టు మనం ఏం చెయ్యాలి? 17 ఇస్రాయేల్ గోత్రాలలో ఒక గోత్రం నిర్మూలం కాకుండేలా బెన్యామీనుగోత్రంలో మిగిలిపోయినవారికి వారసులు కావాలి. 18 కానీ, మన కూతుళ్లను వారికి భార్యలుగా ఇవ్వలేము. ఎందుకంటే, ‘బెన్యామీనువాడికి తన కూతురును ఇచ్చిన వాడెవడైనా శాపగ్రస్తుడు’ అని ఇస్రాయేల్‌వారైన మనం శపథం చేసుకొన్నాం గదా. 19 అయితే ఇదిగో, షిలోహులో యెహోవాకు ఏటేటా పండుగ జరుగుతుంది గదా”. (షిలోహు బేతేల్‌కు ఉత్తరంగా, బేతేల్‌కు షెకెంకు పోయే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉంది.)
20 అప్పుడు వారు బెన్యామీనువారిని ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్ళి ద్రాక్షతోటలలో దాక్కొని చూస్తూవుండండి. 21 షిలోహునుంచి అమ్మాయిలు నాట్యంలో కలవడానికి వస్తూవున్నప్పుడు మీరు ద్రాక్షతోటలనుంచి త్వరగా పరుగెత్తి వెళ్ళి ప్రతివాడూ షిలోహు అమ్మాయిలలో ఒకదానిని భార్యగా పట్టుకోవాలి. అప్పుడు బెన్యామీను ప్రదేశానికి వెళ్ళిపోండి.
22 వాళ్ళ తండ్రులు గానీ, సోదరులు గానీ మా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో ఇలా అంటాం: “ఆ యుద్ధం కారణంగా వారికి భార్యలు దొరకలేదు. మీరు మాపట్ల దయ చూపి వారికి సహాయం చెయ్యండి. ఈ విషయంలో మీరు నిరపరాధులు. ఎందుకంటే, మీ అంతట మీరు మీ కూతుళ్ళను వారికివ్వలేదు గదా.’”
23 బెన్యామీనువారు అలా చేశారు. ఆ అమ్మాయిలు నాట్యం చేస్తూ ఉంటే ఒక్కొక్కడు ఒక అమ్మాయిని పట్టుకొని తనకు భార్యగా తీసుకువెళ్ళాడు. అప్పుడు వారు వారసత్వ భూమికి తిరిగి వెళ్ళి, పట్టణాలు మళ్ళీ కట్టి, వాటిలో కాపురం చేశారు. 24 ఆ సమయంలో ఇస్రాయేల్‌ప్రజలు ఆ స్థలం విడిచి తమ తమ గోత్రాలకు, కుటుంబాలకు, వారసత్వ భూమికి వెళ్ళిపోయారు.
25 ఆ రోజుల్లో ఇస్రాయేల్‌ప్రజకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినట్టు వారు చేసేవారు.