23
1 చుట్టూరా ఉన్న శత్రువులవల్ల యుద్ధం లేకుండా ఇస్రాయేల్‌వారికి యెహోవా చాలా కాలం విశ్రాంతి ఇచ్చాడు. యెహోషువ ముసలివాడైపోయాడు. వయసు మళ్ళిన వృద్ధుడయ్యాడు. 2 ఇస్రాయేల్ ప్రజలందరినీ వారి పెద్దలనూ నాయకులనూ న్యాయాధిపతులనూ అధిపతులనూ యెహోషువ పిలిపించి వారితో ఇలా అన్నాడు:
“నేను ముసలివాణ్ణయ్యాను. వయసు మళ్ళిన వృద్ధుణ్ణి. 3 మీకోసం మీ దేవుడు యెహోవా ఈ జాతులన్నిటినీ ఏం చేశాడో అదంతా మీరు చూశారు గదా. మీ తరఫున యుద్ధం చేసినది మీ దేవుడు యెహోవాయే! 4 ఇదిగో వినండి. యొర్దానునుంచి పడమటగా ఉన్న మహా సముద్రంవరకు నేను నాశనం చేసిన అన్ని జాతుల ప్రదేశాలతోపాటు మిగిలిన ఈ జాతుల ప్రదేశాన్ని చీట్లు వేసి మీకు వారసత్వంగా పంచి పెట్టాను. 5 మీ దేవుడు యెహోవా మీ కళ్ళ దగ్గరనుంచి ఆ జనాలను వెళ్ళగొట్టివేస్తాడు. మీ దగ్గరనుంచి వాళ్ళను పారదోలి మీ దేవుడు యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీరు వాళ్ళ ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేలా చేస్తాడు. 6 కాబట్టి మీరు నిలకడగా ఉండండి, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాసినదంతా పాటించండి, దాని ప్రకారం ప్రవర్తించండి. దాని నుంచి కుడికి గానీ ఎడమకు గానీ తొలగిపోకండి. 7 మీ మధ్య మిగిలి ఉన్న జాతులతో కలిసిపోకండి వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఉచ్చరించకండి. ఆ దేవుళ్ళ పేర ప్రమాణం చేయకండి. ఆ దేవుళ్ళను సేవించకూడదు. వాళ్ళకు నమస్కరించకూడదు. 8 ఈనాటివరకు మీరు ఉన్నట్టు మీ దేవుడు యెహోవాను ఎంతమాత్రం విడవకుండా ఉండండి. 9 గొప్ప బలీయమైన జాతులను యెహోవా మీ ముందు పారదోలాడు. ఇక మీ సంగతా! ఒక్కడు కూడా ఈనాటికీ నిలబడలేక పోతున్నాడు. 10 తాను మాట ఇచ్చినట్టు మీ దేవుడు యెహోవా మీపక్షంగా యుద్ధం చేస్తాడు గనుక మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు. 11 కాబట్టి మీ దేవుడు యెహోవాను మీరు ప్రేమిస్తూ ఉండడానికి చాలా శ్రద్ధగా ఉండండి. 12  ఒకవేళ మీరు తొలగిపోయి మీ మధ్య మిగిలివున్న జాతులతో ఏకమైపోయి వాళ్ళతో వియ్యమందుకొని పరస్పర సంబంధాలు కలిగించుకొంటే, 13  మీ దేవుడు యెహోవా మీ దగ్గర నుంచి ఈ జాతులను వెళ్ళగొట్టడం మానుకొంటాడని మీరు తెలుసు కోవాలి సుమా! వాళ్ళు మీకు వలలాగా బోనులాగా ఉంటారు. మీ దేవుడు యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో లేకుండా పోయేవరకు వాళ్ళు మీ ప్రక్కలో కొరడాలాగా మీ కళ్ళలో ముళ్ళులాగా ఉంటారు.
14 “ఇదిగో వినండి, నేడు మనుషులందరిలాగా నేనూ పోతున్నాను. మీ విషయం మీ దేవుడు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా తప్పిపోలేదని మీ అందరి హృదయాలకూ మనసులకూ తెలుసు; మీ విషయం అన్నీ జరిగాయి. ఒక్కటి కూడా తప్పిపోలేదు. 15  అయితే మీ దేవుడు యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేర్చినట్టే మీ దేవుడు యెహోవా తాను మీకిచ్చిన ఈ మంచి దేశంలో మీరు లేకుండా చేసేవరకు తాను చెప్పిన అన్ని కీడులు కూడా మీమీదికి రప్పిస్తాడు. 16 మీ దేవుడు యెహోవా మీకు నియమించిన ఒడంబడికను మీరు మీరితే, ఇతర దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను సేవించి పూజిస్తే, అప్పుడు యెహోవా కోపాగ్ని మీమీద రగులుకొంటుంది. ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశంలో లేకుండా మీరు అతి త్వరలో నాశనమవుతారు.”