22
1 ✝అప్పుడు యెహోషువ రూబేనువారినీ గాదువారినీ మనష్షే అర్ధ గోత్రంవారినీ పిలిపించి వారితో ఇలా అన్నాడు: 2 “యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినట్టెల్లా మీరు చేశారు. నేను జారీ చేసిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు. 3 ఈ నాటికి ఇన్ని రోజులైనా మీరు మీ సాటి ఇస్రాయేల్‌వారిని విడిచిపెట్టలేదు. మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 4 మీ దేవుడు యెహోవా వారికి వాగ్దానం చేసినట్టే ఇప్పుడు మీ సాటి ఇస్రాయేల్‌వారికి విశ్రాంతి ప్రసాదించాడు. కనుక ఇప్పుడు మీరు మీ నివాసాలకు వెళ్ళండి – యొర్దాను అవతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఆస్తిగా ఇచ్చిన ప్రాంతానికి వెళ్ళండి. 5 ✝అయితే యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన ఆజ్ఞలనూ ఉపదేశాన్నీ అనుసరించేలా జాగ్రత్తగా ఉండండి – మీ దేవుడు యెహోవాను ప్రేమించండి. ఆయన నియమించిన విధానాలన్నిటి ప్రకారం ప్రవర్తించండి. ఆయన ఆజ్ఞలు శిరసావహించండి. ఆయనను ఎంతమాత్రం విడిచిపెట్టకుండా హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయనకు సేవ చేయండి.” 6 యెహోషువ వారిని ఆశీర్వాదంతో పంపివేశాడు. వారు వారి నివాసాలకు వెళ్ళి పోయారు.7 ✝మనష్షే అర్ధ గోత్రంవారికి మోషే బాషానులో ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు. మిగతా అర్ధ గోత్రంవారికి వారి సాటి ఇస్రాయేల్ వారితోపాటు యొర్దాను ఇవతల పడమటివైపున ఒక ప్రాంతాన్ని యెహోషువ ఇచ్చాడు. యెహోషువ వారిని వారి నివాసాలకు పంపివేసేటప్పుడు వారిని దీవించి ఇలా అన్నాడు:
8 “మీరు చాలా ధనం✽తో, పశువులతో, వెండి బంగారాలు కంచు ఇనుము విస్తార వస్త్రాలతో మీ నివాసాలకు తిరిగి వెళ్తున్నారు. మీ శత్రువుల దగ్గర దోచుకొన్న సొమ్మును మీ సాటి గోత్రాల వారి✽తోపాటు పంచుకోండి.”
9 రూబేను గోత్రికులూ గాదు గోత్రికులూ మనష్షే అర్ధ గోత్రంవారూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు. కనానుదేశంలో షిలోహులో ఉన్న ఇస్రాయేల్‌ప్రజల దగ్గరనుంచి బయలుదేరి మోషే ద్వారా వచ్చిన యెహోవా ఆజ్ఞప్రకారం, తమకు స్వాధీనమైన గిలాదు ప్రదేశానికి ప్రయాణమయ్యారు. 10 ✽కనానుదేశంలో ఉన్న యొర్దాను దగ్గరికి వారు వచ్చినప్పుడు రూబేనువారూ, గాదు వారూ మనష్షే అర్ధ గోత్రంవారూ యొర్దాను ఒడ్డున ఒక బలిపీఠం కట్టారు. అది చూపుకు గొప్పది.
11 ✽“అదిగో! రూబేనువాళ్ళూ గాదువాళ్ళూ మనష్షే అర్ధ గోత్రంవాళ్ళూ కనానుదేశానికి ఎదురుగా యొర్దాను ప్రదేశంలో ఇస్రాయేల్‌వారి సరిహద్దు దగ్గర బలిపీఠం కట్టారు” అనే కబురు ఇస్రాయేల్ ప్రజ విన్నారు. 12 ఈ విషయం వినగానే వాళ్ళపై యుద్ధం చేయడానికి ఇస్రాయేల్‌ప్రజల సర్వసమాజం షిలోహు దగ్గర పోగయ్యారు.
13 ✽రూబేను, గాదులవారి దగ్గరికీ మనష్షే అర్ధగోత్రంవారి దగ్గరికీ ఆ గిలాదు ప్రదేశానికి ఎలియాజరుయాజి కొడుకైన ఫీనేహాసును ఇస్రాయేల్‌ప్రజ పంపించారు. 14 అతనితోపాటు ఇస్రాయేల్‌ప్రజల గోత్రాలన్నిటిలో పూర్వీకుల కుటుంబాలలో ప్రతి దానికీ ఒకడి చొప్పున పదిమంది ప్రముఖులను పంపించారు. ఆ పదిమంది వేవేల ఇస్రాయేల్‌ప్రజలకు ప్రతినిధులు, తమ పూర్వీకుల కుటుంబాలకు నాయకులు. 15 ✽వారు గిలాదుకు చేరి రూబేను గాదు గోత్రాలవారితోను మనష్షే అర్ధగోత్రం వారితోను ఇలా అన్నారు:
16 “యెహోవా సర్వ సమాజంవారు ఈ విధంగా అంటున్నారు– ఇస్రాయేల్‌ప్రజల దేవునిమీద తిరగబడి మీరెందుకు ఈ ద్రోహం చేస్తున్నారు? ఈ వేళ యెహోవాను అనుసరించడం మాని మీకోసం బలిపీఠం కట్టారు. యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారెందుకు? 17 పెయోరు✽లో మనం చేసిన దోషం కారణంగా యెహోవా సమాజంమీదికి విపత్తు వచ్చింది. ఇంకా మనం ఆ దోషంనుంచి శుద్ధులం కాలేదు. మనకు ఆ దోషం చాలదా? 18 ఈ వేళ యెహోవాను అనుసరించడం మానివేయవలసివచ్చిందా? మీరు ఈరోజు యెహోవాపై తిరుగుబాటు చేసినందుచేత రేపు ఆయన ఇస్రాయేల్‌ప్రజా సమాజమంతటిమీదా కోపపడుతాడు. 19 మీ స్వాధీనమైన ప్రదేశం అశుద్ధంగా ఉందనుకొంటే యెహోవా నివాసం ఉండే యెహోవా స్వార్జిత భూమికి మీరు రండి. అక్కడ మా మధ్య మీ కోసం ఆస్తి తీసుకోండి. కానీ మన దేవుడు యెహోవా బలిపీఠం స్థానే మీకోసం మరో బలిపీఠం కట్టి యెహోవా మీదా మామీద తిరగబడకండి. 20 ✽జీరా వంశస్థుడైన ఆకాను శాపానికి గురి అయిన సొమ్ము విషయంలో ద్రోహం చేసినందుచేత యెహోవా కోపం ఇస్రాయేల్ సమాజమంతటిమీదికి రాలేదా? అతని పాపానికి అతడు ఒక్కడే నాశనం కాలేదు గదా?”
21 అప్పుడు రూబేను గాదు గోత్రాలవారూ మనష్షే అర్ధగోత్రంవారూ ఇస్రాయేల్ ప్రజల కుటుంబాల నాయకులకు ఇలా జవాబిచ్చారు: 22 ✽“దేవుళ్ళ కంటే అతీతుడు యెహోవా! దేవుళ్ళ కంటే అతీతుడు యెహోవా! ఈ సంగతి ఆయనకు తెలుసు – ఇస్రాయేల్ ప్రజకూడా తెలుసుకోవాలి – మేము యెహోవామీద తిరగబడేవాళ్ళమైతే, ద్రోహం చేసేవాళ్ళమైతే మమ్మల్ని బ్రతకనివ్వకండి. 23 ✽యెహోవాను అనుసరించ కుండా ఉండడానికి మేము ఆ బలిపీఠం కట్టి ఉంటే, దానిపై హోమబలులు గానీ నైవేద్యాలు గానీ శాంతి బలులు గానీ అర్పించడానికి దానిని మేము కట్టి ఉంటే, యెహోవా స్వయంగా మమ్మల్ని శిక్షిస్తాడు గాక! 24 అయితే వేరే ఉద్దేశంతో మేము ఈ పని చేశాం. రాబోయే కాలంలో మీ పిల్లలు మా పిల్లలను చూచి ‘ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం? 25 రూబేను గాదు గోత్రాల వారలారా, మీకు మాకు మధ్య యెహోవా యొర్దాను నదిని సరిహద్దు చేశాడు. మీకు యెహోవాతో పాలు పంపులు లేవు’ అంటారేమో అని భయపడ్డాం. ఆ విధంగా మా సంతానానికి యెహోవాను గురించిన భయభక్తులు లేకుండా మీ సంతానం చేయవచ్చు. 26 కనుక మేము బలిపీఠాన్ని కట్టుకుందా మనుకున్నాం. అది హోమాలకు బలులకు కాదు 27 గాని మాకూ మీకూ మధ్య, మన తరువాత వచ్చే తరాలకు అది స్మృతిచిహ్నంగా ఉంటుంది. యెహోవా పవిత్ర స్థానం ఎదుట మన హోమాలతో నైవేద్యాలతో శాంతి బలులతో ఆయనను ఆరాధించాలనీ రాబోయే కాలంలో మా పిల్లలతో మీ పిల్లలు ‘మీకు యెహోవాతో సంబంధం లేదని చెప్పకుండా ఉండాలనీ ఈ బలిపీఠం సాక్షిలాగా ఉంటుంది. 28 అందుచేత మేము ఇలా చెప్పుకొన్నాం, వారు మమ్మల్ని అలా అంటే లేక మా తరువాత తరాలవారినంటే మేము ఇలా జవాబివ్వవచ్చు – ‘ఇదిగో యెహోవా బలిపీఠంలాంటి ఈ బలిపీఠాన్ని చూడండి. మా పూర్వీకులు దానిని కట్టారు. అది హోమాలకు కాదు, యజ్ఞాలకు కాదు. కానీ మీకు మాకు మధ్య స్మృతిచిహ్నంగా ఉంది.’ 29 మన దేవుడు యెహోవా నివాసం ముందున్న ఆయన బలిపీఠాన్ని గాక హోమాలకు నైవేద్యాలకు బలులకు మరో బలిపీఠం కట్టుకోము. అలా చేసి ఈవేళ యెహోవామీద తిరగబడి ఆయనను అనుసరించడం మానుకోము, అలాంటిది మాకు దూరమవుతుంది గాక!”
30 రూబేను గాదు మనష్షే గోత్రాలవారు చెప్పినది ఫీనెహాసుయాజీ అతనితో ఉన్న సమాజనాయకులూ ఇస్రాయేల్ వారి కుటుంబాల పెద్దలూ విన్నప్పుడు అది వారికి నచ్చింది. 31 కనుక రూబేను గాదు మనష్షే గోత్రాలవారితో ఎలియాజరు యాజి కొడుకైన ఫీనెహాసు ఇలా చెప్పాడు:
“మీరు యెహోవా విషయం ద్రోహం చేయలేదు, గనుక యెహోవా మనమధ్య ఉన్నాడని ఈవేళ మేము తెలుసుకొన్నాం. యెహోవా చేతినుంచి ఇప్పుడు ఇస్రాయేల్‌ప్రజను మీరు విడిపించారు✽.”
32 అప్పుడు గిలాదులో రూబేను గాదుల గోత్రాల నుంచి ఎలియాజరుయాజి కొడుకైన ఫీనెహాసు, ఆ నాయకులు ఇస్రాయేల్‌ప్రజ దగ్గరికి కనానుదేశానికి వచ్చి ఆ వార్త తెలియ జేశారు. 33 ✽ఇస్రాయేల్ ప్రజకు ఆ విషయం నచ్చింది. ఇస్రాయేల్‌ప్రజ దేవుణ్ణి స్తుతించారు. రూబేను గాదులగోత్రాలు కాపురముండే భూమిని నాశనం చేద్దామని వాళ్ళతో యుద్ధానికి వెళదామనీ అప్పటినుంచి చెప్పుకోలేదు. 34 ✽రూబేను గాదుల గోత్రాలవారు “యెహోవా మాత్రమే దేవుడని ఆ బలిపీఠం మీకూ మాకూ మధ్య స్మృతిచిహ్నంగా ఉంటుంది” అన్నారు గనుక దానిని “సాక్షి” అని పిలిచారు.