21
1 లేవీ గోత్రం కుటుంబాల పెద్దలు యాజి అయిన ఎలియాజరు దగ్గరికీ నూను కొడుకు యెహోషువ దగ్గరికీ ఇస్రాయేల్‌ప్రజల గోత్రాల కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు. 2 అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో ఉన్నారు. వారు వారితో “మేము కాపురముండడానికి పట్టణాలూ పశువులకు వాటి పచ్చిక మైదానాలూ మాకివ్వాలని యెహోవా మోషేద్వారా ఆజ్ఞ జారీ చేశాడు” అన్నారు.
3 కనుక యెహోవా ఆజ్ఞననుసరించి ఇస్రాయేల్ ప్రజలు వారి వారసత్వంలోనుంచి లేవీగోత్రికులకు వాటి పచ్చిక మైదానాలతోపాటు ఈ పట్టణాలు ఇచ్చారు: 4 కహాతువారి కుటుంబాల చీటి వచ్చింది. యాజి అహరోను వంశంలోని ఆ లేవీగోత్రికులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల వారసత్వాలలోనుంచి చీట్లవల్ల పదమూడు పట్టణాలు లభించాయి. 5 మిగతా కహాతువారికి ఎఫ్రాయిం, దాను గోత్రాల కుటుంబాలనుంచీ మనష్షే అర్ధ గోత్ర కుటుంబాల నుంచీ చీట్లవల్ల పది పట్టణాలు లభించాయి. 6 గెర్షోనువారికి ఇశ్శాకారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల కుటుంబాలనుంచీ బాషానులో ఉన్న మనష్షే అర్ధగోత్ర కుటుంబాలనుంచీ పదమూడు పట్టణాలు లభించాయి. 7 మెరారి కుటుంబాలకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాలనుంచి పన్నెండు పట్టణాలు లభించాయి. 8 యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇస్రాయేల్‌ప్రజలు చీట్లు వేసి లేవీగోత్రికులకు ఆ పట్టణాలూ వాటి పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
9 లేవీ గోత్రంలో అహరోను వంశంలో కహాతు కుటుంబాలదే మొదటి చీటి. 10 ఇస్రాయేల్‌వారు యూదా, షిమ్యోన్ గోత్రాల నుంచి ఈ క్రింద చెప్పిన పట్టణాలు వారికిచ్చారు. 11 యూదా కొండసీమలో ఉన్న హెబ్రోను అనే కిర్యత్‌అర్బా (అర్బా అనాకుకు తండ్రి) దాని చుట్టు ఉన్న పచ్చిక మైదానాలు. 12 కానీ యెఫున్నె కొడుకు కాలేబుకు ఆస్తిగా ఆ పట్టణం పొలాలు, దాని గ్రామాలు ఇచ్చారు. 13 హత్య చేసినవారికి శరణు పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజియైన అహరోను వంశీయులకిచ్చారు. అది గాక లిబ్నా, దాని పచ్చిక మైదానాలు, 14 యత్తీరు, దాని పచ్చిక మైదానాలు, ఎష్‌టెమోయ, దాని పచ్చిక మైదానాలు, 15 హోలోను, దాని పచ్చిక మైదానాలు, దెబీరు, దాని పచ్చిక మైదానాలు, 16 ఆయిను, దాని పచ్చిక మైదానాలు, యుట్టయు, దాని పచ్చిక మైదానాలు, బేత్‌షెమెషు, దాని పచ్చిక మైదానాలు కూడా ఇచ్చారు. ఆ రెండు గోత్రాలనుంచి ఆ తొమ్మిది పట్టణాలిచ్చారు. 17 బెన్యామీను గోత్రంనుంచి గిబియోను, దాని పచ్చిక మైదానాలు, గెబ దాని పచ్చిక మైదానాలు, 18 అనాతోతు, దాని పచ్చిక మైదానాలు, అల్మోను, దాని పచ్చిక మైదానాలు – ఆ నాలుగు పట్టణాలు ఇచ్చారు. 19 అహరోను వంశస్థులైన యాజులకు లభించినవి పదమూడు పట్టణాలు, వాటి పచ్చిక మైదానాలు.
20 కహాతు వంశాలలో మిగిలిన లేవీగోత్రికులకు చీట్లద్వారా ఎఫ్రాయిం గోత్రంనుంచి పట్టణాలు లభించాయి. 21 హత్య చేసినవారికి శరణు పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలు వారికిచ్చారు. షెకెం ఎఫ్రాయిం కొండ ప్రదేశంలో ఉంది. గెజెరు, దాని పచ్చిక మైదానాలు, 22 కిబ్‌సాయిం, దాని పచ్చిక మైదానాలు, బేత్‌హోరోను, దాని పచ్చిక మైదానాలు కూడా ఇచ్చారు. మొత్తం నాలుగు పట్టణాలు. 23 దాను గోత్రం నుంచి కూడా నాలుగు పట్టణాలు ఇచ్చారు – ఎల్‌తెకే, దాని పచ్చిక మైదానాలు, గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలు, 24 అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలు, గాత్‌రిమ్మోను, దాని పచ్చిక మైదానాలు. 25 మనష్షే అర్ధ గోత్రంనుంచి ఈ రెండు పట్టణాలు ఇచ్చారు – తానాకు, దాని పచ్చిక మైదానాలు, గాత్ రిమ్మోను, దాని పచ్చిక మైదానాలు. 26 మిగిలిన కహాతువారి కుటుంబాలకు వచ్చిన మొత్తం పట్టణాలు పది.
27 లేవీ గోత్రికులైన గెర్షోను వంశంవారికి మనష్షే అర్ధ గోత్రంనుంచి రెండు పట్టణాలు ఇచ్చారు– బాషానులో గోలాను, దాని పచ్చిక మైదానాలు, బేయెష్‌తారా, దాని పచ్చిక మైదానాలు. గోలాను హత్య చేసినవారికి శరణు పట్టణంగా ఉంది. 28 ఇశ్శాకారు గోత్రం నుంచి ఈ నాలుగు పట్టణా లిచ్చారు – కిష్యోన్, దాని పచ్చిక మైదానాలు, దాబరెత్, దాని పచ్చిక మైదానాలు, 29 యర్మూత్, దాని పచ్చిక మైదానాలు, ఏన్‌గన్నీం, దాని పచ్చిక మైదానాలు. 30 ఆషేరు గోత్రంనుంచి ఈ నాలుగు పట్టణాలిచ్చారు – మిషేల్, దాని పచ్చిక మైదానాలు, అబ్దోను, దాని పచ్చిక మైదానాలు, 31 హెల్కత్, దాని పచ్చిక మైదానాలు, రెహోబ్, దాని పచ్చిక మైదానాలు. 32 నఫ్తాలిగోత్రం నుంచి ఈ మూడు పట్టణాలిచ్చారు: గలలీలో కెదెష్, దాని పచ్చిక మైదానాలు (కెదెష్ హత్యచేసిన వారికి శరణు పట్టణం), హమ్మోత్‌దోరు, దాని పచ్చిక మైదానాలు, కర్తాను, దాని పచ్చిక మైదానాలు. 33 వారి కుటుంబాల ప్రకారం గెర్షోను వారికి లభించిన మొత్తం పట్టణాలూ వాటి పచ్చిక మైదానాలు పదమూడు.
34 తక్కిన లేవీగోత్రికులైన మెరారి వంశంవారికి జెబూలూను గోత్రం నుంచి ఈ నాలుగు పట్టణాలు ఇచ్చారు: యొక్‌నెయాం, దాని పచ్చిక మైదానాలు, కర్తా, దాని పచ్చిక మైదానాలు, 35 దిమ్నా, దాని పచ్చిక మైదానాలు, వహలాల్ దాని పచ్చిక మైదానాలు. 36 రూబేను గోత్రంనుంచి ఈ నాలుగు పట్టణాలు ఇచ్చారు: బేసెరు, దాని పచ్చిక మైదానాలు, యాహస్, దాని పచ్చిక మైదానాలు, 37 కెదెమోతు, దాని పచ్చిక మైదానాలు, మేఫాతు, దాని పచ్చిక మైదానాలు. 38 గాదుగోత్రంనుంచి ఈ నాలుగు పట్టణాలిచ్చారు: గిలాదులో ఉన్న రామోతు, దాని పచ్చిక మైదానాలు, (రామోతు హత్య చేసిన వారికి శరణు పట్టణం) మహనయీం, దాని పచ్చిక మైదానాలు, 39 హెష్బోను, దాని పచ్చిక మైదానాలు, యాజెరు, దాని పచ్చిక మైదానాలు. 40 లేవీగోత్రికులలో మిగిలిన ఈ మెరారివారికి వారి కుటుంబాల ప్రకారం ఆ పట్టణాలన్నీ లభించాయి. వారి వాటా పన్నెండు పట్టణాలు.
41 ఇస్రాయేల్ ప్రజల ప్రాంతాలలో ఉన్న లేవీవారి పట్టణాలు, వాటి పచ్చిక మైదానాలు నలభై ఎనిమిది. 42 ప్రతి పట్టణానికి చుట్టూ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.
43 యెహోవా ఇస్రాయేల్‌ప్రజల పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన భూమి అంతా ఆయన వారికి ఇచ్చాడు. వారు దానిని స్వాధీనం చేసుకొని అక్కడ కాపురమున్నారు. 44 వారి పూర్వీకులకు తాను ప్రమాణం చేసిన ప్రకారం దేశంలో అన్ని దిక్కులా యెహోవా వారికి విశ్రాంతి ప్రసాదించాడు. వారి శత్రువులలో ఒక్కడూ కూడా వారి ఎదుట నిలబడలేక పోయాడు. యెహోవా వారి శత్రువులను అందరినీ వారికి అప్పగించాడు. 45  ఇస్రాయేల్‌ప్రజకు యెహోవా చేసిన వాగ్దానాలలో ఏదీ తప్పలేదు. అన్నీ నెరవేరాయి.