20
1 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: 2 “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో ఈ విధంగా చెప్పాలి – నేను మోషేద్వారా మీతో శరణు పట్టణాల విషయం చెప్పాను. ఇప్పుడు వాటిని ఎన్నుకోండి. 3 ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా గాక పొరపాటున చంపినవాడు ఆ శరణు పట్టణాలలో ఒక దానికి పారిపోవచ్చు. చంపబడినవాడి విషయం ప్రతీకారం తీర్చుకోదలచే అతడి సమీప బంధువుడి బారినుంచి అవి మీకు ఆశ్రయ స్థలాలుగా ఉంటాయి. 4 అలా చంపినవాడు వాటిలో ఒకదానికి పారిపోయి పట్టణ ద్వారం దగ్గర నిలబడి ఆ పట్టణం పెద్దలకు తన సంగతి చెప్పాలి. వారు అతణ్ణి పట్టణంలోకి చేర్చి అతడు వారితో ఉండేలా అతనికి స్థలమివ్వాలి. 5 చంప బడినవాడి విషయం ప్రతీకారం తీర్చుకోదలచే అతడి సమీప బంధువుడు అతణ్ణి తరుముతూ వస్తే వారు ఆ హంతకుణ్ణి అతని చేతికి అప్పగించకూడదు. ఎందుకంటే, అతడు అనుకో కుండా పొరుగువాణ్ణి చంపాడు. అంతకుముందు అతనిపై ఇతనికి ఎలాంటి పగా లేదు. 6 సమాజం ముందు విచారణకు నిలబడే వరకు, ఆ రోజుల్లో ఉన్న ప్రముఖ యాజి చనిపోయే వరకు, అతడా పట్టణంలోనే ఉండిపోవాలి. ఆ తరువాత ఆ హంతకుడు తాను ఏ పట్టణంనుంచి పారిపోయాడో ఆ తన సొంత పట్టణానికి, తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు.”
7 కనుక వారు ఈ పట్టణాలను ప్రత్యేకించారు. గలలీలోని నఫ్తాలి కొండ ప్రదేశంలో ఉన్న కెదెషు, ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని షెకెం, యూదా కొండప్రదేశంలో కిర్యత్ అర్బా అనే హెబ్రోను. 8 యెరికోకు తూర్పున యొర్దాను అవతల రూబేను గోత్రానికి చెందిన పట్టణాలలో, మైదానాల ప్రాంతం మీది అరణ్యంలో ఉన్న బేసెరును, గాదు గోత్రానికి చెందిన పట్టణాలలో, గిలాదులోని రామోతును, మనష్షే గోత్రానికి చెందిన పట్టణాలలో బాషానులోని గోలానును నిర్ణయించారు. 9 ఎవరినైనా పొరపాటున చంపినవాడెవడైనా హతమైనవాడి విషయం ప్రతీకారం తీర్చుకోదలచే అతడి సమీపబంధువుడి చేతిలో పడి చావకుండా తాను సమాజంముందు నిలబడేవరకు అక్కడికి పారిపోయేలా వారు కేటాయించిన పట్టణాలివి. ఇస్రాయేల్ ప్రజలందరికీ వారిమధ్య కాపురం ఉండే పరాయి దేశస్థులకూ వాటిని నియమించారు.