19
1 రెండో చీటి షిమ్యోనుకు, అంటే వారి కుటుంబాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి వారసత్వం యూదా గోత్రికుల వారసత్వం సరిహద్దులోనే ఉంది. 2 వారి వారసత్వం ఏమిటంటే, బేర్‌షెబా, షెబి, మోలాదా, 3 హజర్‌షువల్, బాలా, ఎజెం, 4 ఎల్‌తోలదు, బేతూల్, హోర్మా, 5 సిక్లగు, బేత్‌మర్కాబోదు, హజర్‌సూసా, 6 బేత్‌లెబాయోతు, షారూహెను – ఈ పద్నాలుగు పట్టణాలూ వాటి గ్రామాలూ; 7 అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషాను – ఈ నాలుగు పట్టణాలూ వాటి గ్రామాలూ, 8 ఈ పట్టణాల చుట్టూరా, బాలత్‌బేరు (దక్షిణం ఎడారిలో ఉన్న రామతు) వరకు ఉన్న గ్రామాలన్నీ. ఇది షిమ్యోను గోత్రంవారి కుటుంబాల వారసత్వం. 9 షిమ్యోను వారి వారసత్వం యూదావారి ప్రదేశం లోనే ఉంది. ఎందుకంటే యూదావారి వాటా వారికి ఎక్కువైంది గనుక వారి వారసత్వంలలోనే షిమ్యోను గోత్రికులకు వారసత్వం వచ్చింది.
10 మూడో చీటి జెబూలూను గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం సరిహద్దు శారీదు వరకు పోయింది. 11 అక్కడనుంచి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకు, దబ్బాషతు వరకు సాగి యొక్‌నెయాంకు ఎదురుగా ఉన్న ఏటివరకు వెళ్ళింది. 12 శారీదు నుంచి తూర్పుగా ప్రొద్దు పొడిచేవైపు కిస్లోత్‌తాబోరు పొలిమేరవరకు వెళ్ళింది. అక్కడనుంచి దాబరెతుకు సాగి యాఫీయాకు ఎక్కింది. 13 అక్కడనుంచి తూర్పుగా ప్రొద్దు పొడిచేవైపు గిత్తహెపెరుకు, ఇత్తాకాత్సీనుకు సాగి రిమ్మోనుగుండా నేయా వరకు పోయింది. 14 ఉత్తరంగా సరిహద్దు హన్నాతోను వరకు చుట్టి వచ్చింది. అది యిప్తాయేల్ లోయలో అంతమైంది. 15 అంతే కాకుండా కట్టాతు, నహలాల్, షిమ్రోను, ఇదలా, బేత్‌లెహేం వారికి వచ్చాయి. మొత్తం పన్నెండు పట్టణాలూ వాటి గ్రామాలూ. 16 వారి కుటుంబాల ప్రకారం జెబూలూను వంశస్థుల వారసత్వం ఇది. ఈ పట్టణాలూ వాటి గ్రామాలూ వారికి వచ్చాయి.
17 నాలుగో చీటి ఇశ్శాకారుకు వారి కుటుంబాల ప్రకారం ఇశ్శాకారు గోత్రానికి వచ్చింది. 18 వారి ప్రాంతం యెజ్రేలు వరకు ఉంది. అందులో కెసుల్లోతు, షూనేం, 19 హపరాయిం, షీయోను, అనహరాతు, 20 రబ్బీతు, కిష్యోను, అబెసు, 21 రెమెతు, ఏన్‌గన్నీం, ఏన్‌హద్దా, బేత్‌పస్సెసు ఉన్నాయి. 22 ఆ సరిహద్దు తాబోరు, షహచీమా, బేత్‌షెమెషు చేరి యొర్దాను దగ్గర అంతమైంది. మొత్తం పదహారు పట్టణాలు వాటి గ్రామాలూ. 23 వారి కుటుంబాల ప్రకారం ఇశ్శాకారు గోత్రికులు పొందిన వారసత్వం ఇది, వాటి గ్రామాలతో ఉన్న పట్టణాలు ఇవి.
24 అయిదో చీటి ఆషేరు గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది. 25 వారి సరిహద్దులో హెల్కతు, హలి, బెతెను, అక్లాప్, 26 అలంమెలెకు, అమాదు, మిషేల్ ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెల్ షిహోర్‌లిబ్నాతు చేరింది. 27 అక్కడనుంచి తూర్పుగా చుట్టి వచ్చి బేత్‌దగోనుకు వెళ్ళింది; జెబూలూనువారి సరిహద్దు, బేత్‌ఏమెకుకు నేయేల్‌కు ఉత్తరంగా ఉన్న యిప్తాయేల్ లోయకు చేరింది. 28 అక్కడనుంచి ఉత్తరంగా కాబూల్‌కు, ఎబ్రోనుకు రెహోబ్‌కు, హమ్మోనుకు, కానాకు, పెద్ద సీదోనుకు వెళ్ళింది. 29 అక్కడనుంచి సరిహద్దు రామావైపు తిరిగి తూర్ అనే ప్రాకార నగరం దాకా సాగింది. అక్కడనుంచి సరిహద్దు హోసాకు మళ్ళి మహా సముద్రతీరాన ఉన్న అక్‌జీబ్ దగ్గర అంతమైంది. 30 ఉమ్మా, అఫెకు, రెహోబ్ కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఇరవై రెండు పట్టణాలూ వాటి గ్రామాలూ. 31 వారి కుటుంబాల ప్రకారం అషేరు గోత్రికులు పొందిన వారసత్వం ఇది; వాటి గ్రామాలతో ఉన్న పట్టణాలు ఇవి.
32 ఆరో చీటి నఫ్తాలి గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది. 33 వారి సరిహద్దు హెలెఫ్‌నుంచి జానన్నీం దగ్గర ఉన్న సిందూర వృక్షంనుంచి అదామెనెకెబ్‌కు, యబ్నేల్‌కు వెళ్ళి లక్కూం వరకు సాగింది. యొర్దానుదగ్గర అంతమైంది. 34 అక్కడనుంచి సరిహద్దు పడమరగా తిరిగి అది అజనోత్‌తాబోరుకు వెళ్ళి అక్కడనుంచి హుక్కోకు వరకు సాగింది. అది దక్షిణంవైపు జెబూలూను సరిహద్దును తాకింది. పడమట ఆషేరు సరిహద్దును తాకింది. తూర్పుగా యొర్దాను దగ్గర యూదా సరిహద్దును తాకింది. 35 ప్రాకారాలున్న వారి పట్టణాలు జిద్దీం, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, 36 అదామా, రమా, హాసోరు, 37 కెదెషు, ఎద్రెయీ, ఏనహాసోరు, 38 ఇరోను, మిగ్దలేల్, హోరేం, బేత్‌అనాతు, బేత్‌షెమెషు. మొత్తం గ్రామాలతోపాటు ఉన్న వారి పట్టణాలు పందొమ్మిది. 39 వారి కుటుంబాల ప్రకారం నఫ్తాలిగోత్రికులు పొందిన వారసత్వం ఇది; వాటి గ్రామాలతో ఉన్న పట్టణాలివి.
40 ఏడో చీటి దాను గోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం వచ్చింది. 41 వారి వారసత్వం సరిహద్దు జొర్యా, ఎష్‌తాయోల్, ఇర్‌షెమెషు, 42 షీలబీను, అయ్యాలోను, యెతా, 43 ఏలోను, తిమ్నా, ఎక్రోను, 44 ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, 45 యెహుదు, బెనేబరెకు, గాత్‌రిమ్మోను, 46 మేయర్కోను, రక్కోను, యాపో ముందున్న ప్రాంతం. 47 అయితే దాను గోత్రంవారి భూభాగం ఈ సరిహద్దులనుంచి అవతలకే విస్తరిల్లింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెంమీద యుద్ధం చేసి దానిని జయించి ఖడ్గంతో దాని నివాసులను చంపి దానిని స్వాధీనం చేసుకొని దానిలో కాపురం ఉన్నారు. ఆ లెషెంను వారి పూర్వీకుడు దాను పేరుతో ‘దాను’ అని పిలిచారు. 48 వారి కుటుంబాలప్రకారం దాను గోత్రికులు పొందిన వారసత్వం ఇది. ఈ పట్టణాలూ వాటి గ్రామాలూ వారికి వచ్చాయి. 49 ఇస్రాయేల్ ప్రజలు ఆ వారసత్వాల సరిహద్దులను నియమించి దేశాన్ని పంచుకోవడం ముగించాక వారు నూను కొడుకు యెహోషువకు ఒక వాటా వారసత్వంగా ఇచ్చారు. 50 వారు యెహోవా ఆజ్ఞ అనుసరించి యెహోషువ అడిగిన ఊరు అతడికిచ్చారు. అతడు అడిగినది ఎఫ్రాయిం కొండ ప్రదేశంలోని తిమ్నాత్‌సెరహు. అతడు ఆ ఊరిని మళ్ళీ నిర్మించి అక్కడ కాపురం ఉన్నాడు.
51 యాజియైన ఎలియాజరు నూను కొడుకు యెహోషువ, ఇస్రాయేల్‌ప్రజల గోత్రాల కుటుంబాల నాయకులు షిలోహులో యెహోవా సన్నిధానంలో సన్నిధిగుడారం ద్వారం దగ్గర చీట్లు వేసి పంచి ఇచ్చిన వారసత్వం భూములివి. ఈ విధంగా వారు దేశాన్ని పంచి పెట్టడం ముగించారు.