18
1 ✽ఇస్రాయేల్‌ప్రజల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సన్నిధిగుడారం వేయించారు. వారి ముందున్న దేశం వారు జయించిన దేశం. 2 అయితే ఇస్రాయేల్ ప్రజల్లో వారసత్వం ఇంకా దొరకని ఏడు గోత్రాలు మిగిలాయి. 3 ✽కనుక యెహోషువ ఇస్రాయేల్ ప్రజలతో ఇలా అన్నాడు: “మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళకుండా ఎంత కాలం వ్యర్థంగా గడుపుతారు? 4 ఒక్కొక్క గోత్రానికి ముగ్గురేసి మనుషులను నియమించండి. నేను వారిని పంపిస్తాను. వారు బయలుదేరి దేశం తిరుగుతూ వారి వారసత్వాన్ని గురించిన వివరం వ్రాసి నాదగ్గరికి రావాలి. 5 వారు వారి వారసత్వాన్ని ఏడు భాగాలుగా చేయాలి. దక్షిణంగా యూదావారు వారి భూభాగంలో ఉండిపోవాలి. ఉత్తరంగా యోసేపు వంశస్థులు వారి భూభాగంలో ఉండిపోవాలి. 6 ✝తక్కిన భూమిని ఏడుభాగాలుగా విభజించి వివరంగా వ్రాసి దానిని నాదగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ మన దేవుడు యెహోవా సమక్షంలో మీకోసం నేను చీట్లు వేస్తాను. 7 ✽ లేవీగోత్రికులకు మాత్రం మీతోపాటు వాటా భూభాగం ఏమీ ఉండదు. ఎందుకంటే యెహోవాకు యాజి సేవే వారి వారసత్వం. యెహోవా సేవకుడు మోషే నియమించిన వారసత్వాన్ని గాదు గోత్రం, రూబేను గోత్రం, మనష్షే అర్ధ గోత్రం యొర్దాను అవతల, తూర్పుగా పొందాయి.”
8 ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. “మీరు వెళ్ళి దేశమంతా సంచారం చేసి దాని వివరం వ్రాసి నా దగ్గరికి తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను” అని దేశ వివరం వ్రాయడానికి వెళ్ళే వారికి యెహోషువ ఆదేశించాడు. 9 గనుక వారు వెళ్ళారు, దేశమంతా సంచరించి పుస్తకంలో పట్టణాల ప్రకారం ఏడు భాగాలుగా వివరం వ్రాసి షిలోహు శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు. 10 ✽యెహోవా సమక్షంలో షిలోహులో యెహోషువ వారికోసం చీట్లు వేశాడు. ఇస్రాయేల్ ప్రజలకు వారి వాటాల ప్రకారం అక్కడ ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
11 బెన్యామీను గోత్రంవారికి కుటుంబాల చీటి వచ్చింది. వారి వాటా యూదా గోత్రంవారికీ యోసేపు వంశస్థులకూ మధ్య వచ్చింది. 12 ఉత్తరంగా వారి సరిహద్దు యొర్దాను నదినుంచి ఆరంభమైంది. అది యెరికోకు ఉత్తరంగా పోయి, పడమటి వైపుకు కొండసీమ గుండా వెళ్ళి బేత్‌ఆవెను అరణ్యం దగ్గర అంతం అయింది. 13 అక్కడనుంచి దక్షిణంగా ఆ సరిహద్దు లూజు వైపుకు లూజు ప్రక్కగా వెళ్ళింది. లూజు అంటే బేతేల్. ఆ సరిహద్దు క్రింది బేత్‌హోరోనుకు దక్షిణంగా ఉన్న కొండదగ్గర ఉన్న అతారోత్‌అద్దారు వరకు పోయింది. 14 అక్కడనుంచి వెళ్ళి పడమటి దిక్కున దక్షిణం వైపు చుట్టి వచ్చి బేత్ హోరోనుకు ఎదురుగా ఉన్న కొండనుంచి దక్షిణంగా సాగి యూదావారి పట్టణమైన కిర్యత్‌యారీం అనే కిర్యత్‌బయల్ దగ్గర అంతమైంది. ఇది పడమటి సరిహద్దు. 15 దక్షిణ సరిహద్దు కిర్యత్‌యారీం పొలిమేరనుంచి ఉంది. అది పడమటి వైపున నెఫ్తోయ నీళ్ళ ఊటవరకు వెళ్ళింది. 16 అక్కడ నుంచి సరిహద్దు బెన్‌హిన్నోం కనుమ ముందున్న కొండదగ్గరికి వెళ్ళింది. (బెన్‌హిన్నోం కనుమ రెఫాయింవాళ్ళ లోయలో ఉత్తరాన ఉంది.) అక్కడ నుంచి సరిహద్దు దక్షిణంగా బెన్‌హిన్నోం కనుమ గుండా యెబూసివాళ్ళ ప్రదేశంవరకు వెళ్ళింది. ఆ సరిహద్దు ఏన్‌రోగేల్ వరకు ఉంది. 17 అక్కడ నుంచి ఉత్తరం వైపుకు తిరిగి ఏన్‌షెమెషుకు, అదుమ్మీంకు ఎక్కే చోటికి ఎదురుగా ఉన్న గెలీలోతుకు వెళ్ళింది. అక్కడనుంచి రూబేను వంశస్థుడైన బోహాను రాయి దగ్గరికి దిగింది. 18 అది అరాబా లోయకు ఉత్తరంగా ఎదురుగా ఉన్న వాలుప్రదేశం దాటి అరాబా లోయకు దిగింది. 19 బేల్ హోగ్లాకు ఉత్తరంగా వెళ్ళింది. అక్కడనుంచి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణదిక్కున ప్రవహించే ఉప్పు సరస్సులో ఉత్తర అఖాతం దగ్గర అంతమైంది. ఇది దక్షిణ సరిహద్దు. 20 తూర్పు వైపున వారి సరిహద్దు యొర్దాను నది. వారి వంశాల ప్రకారం చుట్టు ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీనువారికి వారసత్వంగా కేటాయించిన భూభాగం ఇదే.
21 వారి వంశాలప్రకారం బెన్యామీనుగోత్రం వారి పట్టణాలివి – యెరికో, బేత్‌హోగ్లా, ఎమెక్‌కెసీసు, 22 బేత్ అరాబా, సెమరాయిం, బేతేల్, 23 అవీం, పారా, ఒఫ్రా, 24 కెపర్‌అమ్మోని, ఒప్ని, గెబా, వాటి గ్రామాలతోపాటు పన్నెండు పట్టణాలు. 25 గిబియోను, రమా, బెయేరోతు, 26 మిస్సే, కెఫీరా, మోసా, 27 రేకెం, ఇర్ఫేల్, తరలా, 28 సేలా, ఎసేపు, యెబూసి (అదే జెరుసలం), గిబియా, కిర్యత్. వాటి గ్రామాలతోపాటు పద్నాలుగు పట్టణాలు. వారి వంశాలప్రకారం ఇది బెన్యామీను గోత్రంవారికి వచ్చిన వారసత్వం.