17
1 మనష్షే గోత్రంవారికి కూడా చీట్ల వల్ల ఒక భూభాగం వచ్చింది. మనష్షే యోసేపుకు పెద్ద కొడుకు. మాకీరు మనష్షేకు పెద్దకొడుకు, గిలాదుకు తండ్రి. మాకీరు యోధుడు గనుక అతని వంశానికి గిలాదు, బాషాను ఇవ్వబడ్డాయి. 2 మనష్షే గోత్రంలో తక్కినవారికి కూడా వారి కుటుంబాల ప్రకారం వాటా వచ్చింది. అబియెజెరు, హెలెకు, అశీయ్రేల్, షెకెం, హెఫెరు, షెమీద అనేవారు, వారి కుటుంబాల ప్రకారం యోసేపు కొడుకైన మనష్షే మగ సంతతివారు. వారందరికీ వాటా వచ్చింది. 3 ✽మనష్షే కొడుకు మాకీరు, మాకీరు కొడుకు గిలాదు, గిలాదు కొడుకు హెఫెరు, హెఫెరు కొడుకు సెలోపెహాదు. ఇతడికి కొడుకులు లేరు గానీ కూతుళ్ళు ఉన్నారు. అతడి కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 4 వారు ఎలియాజరుయాజి దగ్గరికీ నూను కొడుకు యెహోషువ దగ్గరికీ ప్రజానాయకుల దగ్గరికీ వచ్చి “మా బంధువులతోపాటు మాకూ వారసత్వం ఇవ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు” అన్నారు. కనుక యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం యెహోషువ వారి తండ్రి అన్నదమ్ముల మధ్య వారసత్వాన్ని వారికిచ్చాడు. 5 యొర్దాను అవతల ఉన్న గిలాదు బాషానులు గాక, మనష్షే గోత్రంవారికి పది వాటాలు వచ్చాయి. 6 ఎందుకంటే, మనష్షే ఆడు సంతతివారు అతని మగ సంతతివారితోపాటు వారసత్వం అందుకొన్నారు. మనష్షే వంశస్థులలో తక్కినవారికి గిలాదుప్రదేశం లభించింది.7 మనష్షే గోత్రికుల ప్రాంతం ఆషేరునుంచి షెకెంకు తూర్పుగా ఉన్న మెకమెతా వరకు ఉంది. అక్కడనుంచి ఆ సరిహద్దు దక్షిణంవైపుకు ఏన్‌తప్పూయ నివాసులవరకు వెళ్ళింది. 8 తప్పూయ భూభాగం మనష్షే గోత్రానికి వచ్చింది గాని మనష్షే సరిహద్దుమీద ఉన్న తప్పూయపురం ఎఫ్రాయిం గోత్రికులదయింది. 9 ఆ సరిహద్దు కానా ఏటి వరకు ఆ ఏటికి దక్షిణంగా ఉంది. అక్కడ పట్టణాలు మనష్షే పట్టణాలలో ఎఫ్రాయిం గోత్రికులవయ్యాయి. అక్కడనుంచి మనష్షే వారి సరిహద్దు ఆ ఏటికి ఉత్తరంగా వెళ్ళి మహాసముద్రం దగ్గర ముగిసింది. 10 దక్షిణంవైపు ఎఫ్రాయిం వారిది. ఉత్తరంవైపు మనష్షే వారిది. సముద్రం వారి సరిహద్దు. ఉత్తరంగా వారి ప్రదేశం ఆషేరు గోత్రంవారి సరిహద్దు వరకు, తూర్పుగా ఇశ్శాకారు గోత్రంవారి సరిహద్దు వరకు ఉంది. 11 ✽ ఇశ్శాకారు ప్రాంతంలో, ఆషేరు ప్రాంతంలో బేత్ షెయాను, దాని గ్రామాలు, ఇబ్‌లెయాం, దాని ఊళ్ళు, దోరు పురవాసులు, దాని ఊళ్ళు, ఏన్‌దోరు పురవాసులు, దాని ఊళ్ళు తానాకు పురవాసులు, దాని ఊళ్ళు, మెగిద్దో పురవాసులు, దాని ఊళ్ళు, మూడు కొండ ప్రదేశాలు మనష్షే వారికి ఇవ్వడం జరిగింది. 12 కానీ కనానుజాతివాళ్ళు ఆ ప్రాంతంలో కాపురం ఉండాలని గట్టి పట్టు పట్టారు. గనుక మనష్షే వంశీయులు ఆ పట్టణాలు స్వాధీనం చేసుకోలేకపోయారు. 13 తరువాత ఇస్రాయేల్‌ప్రజ బాగా బలం పుంజుకొన్నప్పుడు కనానువాళ్ళతో వెట్టిచాకిరి చేయించుకొన్నారు గానీ వాళ్ళను పూర్తిగా వెళ్ళగొట్టలేదు.
14 యోసేపు✽ వంశంవారు యెహోషువతో “ఇంతవరకు దేవుడు మాకు ఆశీస్సులు ప్రసాదించాడు. మేము మహా ప్రజ అయ్యాం గదా. మీరు మాకు ఒక్క వాటా మాత్రమే వారసత్వంగా ఇచ్చారేమిటి?” అన్నారు.
15 ✽యెహోషువ వారితో “మీదొక మహా జనమైతే అడవి ప్రాంతానికి వెళ్ళండి. ఎఫ్రాయిం కొండప్రదేశం మీకు ఇరుకు అయితే పెరిజ్జివాళ్ళూ రెఫాయింవాళ్ళూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి అడవి నరుక్కొని అక్కడ ఉండండి” అన్నాడు.
16 అందుకు యోసేపు వంశంవారు “ఈ కొండప్రదేశం మాకు చాలదు. బేత్‌షేయానులో, దాని గ్రామాలలో, యెజ్రేలు లోయలో ఉన్నవాళ్ళకూ ఈ లోయప్రాంతంలో ఉంటున్న కనానువాళ్ళందరికీ ఇనుప రథాలున్నాయి” అన్నారు.
17 అప్పుడు యోసేపు వంశస్థులైన ఎఫ్రాయింవారికీ మనష్షే వారికీ యెహోషువ ఇలా చెప్పాడు. “మీరు మహా జనం. మీది గొప్ప బలం, మీకు ఒక వాటా మాత్రమే ఉండకూడదు. 18 ఆ కొండప్రదేశం కూడా మీదే. అది అడవి గనుక దానిని నరికి బాగు చేసుకోవాలి. చివరిదాకా అది మీదే. కనానుజాతివాళ్ళకు ఇనుప రథాలున్నా, వాళ్ళు బలం గల జనంగా ఉన్నా మీరు వాళ్ళను వెళ్ళగొట్టి వాళ్ళ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోగలరు.”