16
1 యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం యెరికోదగ్గర యొర్దానునుంచి తూర్పున యెరికో జలాలవరకు, యెరికోనుంచి ఎడారి మీదుగా కొండసీమ గుండా, బేతేల్‌వరకు ఉంది. 2 బేతేల్ నుంచి లూజ్‌కు, అక్కడనుంచి అర్కివాళ్ళ ప్రాంతంలో ఉన్న అతారోతుకు పోయింది. 3 పడమటిగా యపలేతివాళ్ళ ప్రాంతంవరకు దిగిపోయి క్రింది బేత్ హోరోనుకూ గెజేరుకూ వెళ్ళి మహా సముద్రందగ్గర అంతం అయింది. 4 అక్కడ యోసేపు కొడుకులు మనష్షే, ఎఫ్రాయిం సంతతివారు వారి వారసత్వాన్ని పొందారు.
5 ఎఫ్రాయిం వంశస్థుల ప్రాంతం, వారి కుటుంబాల ప్రకారం ఇలా ఉంది: తూర్పుగా వారి వారసత్వం సరిహద్దు అతారోతు అద్దారు నుంచి మీది బేత్‌హోరోనువరకు ఉంది. 6 ఆ సరిహద్దు సముద్రం వైపు వెళ్ళింది. దానికి ఉత్తరంగా మిమెతాత్ ఉంది. ఆ సరిహద్దు తూర్పు వైపుకు తానాత్‌షీలో వరకు చుట్టి వెళ్ళి దానికి తూర్పుగా దాటి యానోహా వరకు సాగింది. 7 యానోహానుంచి అది అతారోతుకూ నారాకూ దిగిపోయింది. 8 తప్పూయనుంచి ఆ సరిహద్దు కానా ఏటివరకు పడమటివైపుకు వెళ్ళింది, సముద్రం దగ్గర అంతమైంది. ఇది ఎఫ్రాయిం గోత్రికులకు వారి కుటుంబాల ప్రకారం లభించిన వారసత్వం. 9 ఎఫ్రాయిం వంశస్థులకు ప్రత్యేకించబడ్డ కొన్ని పట్టణాలు మనష్షే వంశస్థుల వారసత్వంలో ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ వాటితో పాటు వాటి గ్రామాలు కూడా వారికి లభించాయి. 10 అయితే గెజెరులో కాపురం ఉండే కనాను జాతివాళ్ళను వారు వెళ్ళగొట్టలేదు గనుక కనానువాళ్ళు ఈ నాటికీ ఎఫ్రాయిం గోత్రికులమధ్య కాపురం ఉంటూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.