15
1 యూదాగోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం చీట్లవల్ల వచ్చిన భూభాగం ఈ విధంగా ఉంది. అది ఏదోం దేశం సరిహద్దు వరకు, దక్షిణంగా సీన్ ఎడారికి చిట్టచివరి దక్షిణ భాగం వరకు ఉంది. 2 వారి దక్షిణ సరిహద్దు ఉప్పు సరస్సు ఒడ్డునుంచి– దక్షిణంగా ఉన్న అఖాతం నుంచి– ఉంది. 3 అది దక్షిణంగా అక్రబ్బీంకు ఎక్కుడు వెళ్ళి సీన్ వరకు పోయింది. అక్కడ అది కాదేష్‌బర్నెయాకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు వరకు వెళ్ళి అక్కడ కర్కాయువైపు తిరిగింది; 4 అస్మోనుగుండా ఈజిప్ట్‌వాగు ప్రక్కగా వెళ్ళింది. ఇది మహా సముద్రం ఒడ్డువరకు ఉంది. ఇది మీ దక్షిణ సరిహద్దు. 5 తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకు ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరంగా సరిహద్దు సముద్ర అఖాతంనుంచి – యొర్దాను చివరనుంచి – బయలు దేరింది. 6 ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకు వెళ్ళి బేత్‌అరాబాకు ఉత్తరంగా పోయింది. ఆ సరిహద్దు రూబేను కొడుకైన బోహాను రాయి వరకు వెళ్ళింది. 7 ఆ సరిహద్దు ఆకోరు లోయనుంచి దెబీరు వరకు, అక్కడ నుంచి ఉత్తరంగా గిల్గాల్ వైపుకు వెళ్ళింది. అది అక్కడ లోయకు దక్షిణంగా ఉన్న అదుమ్మీంకు ఎక్కే చోటికి ఎదురుగా ఉంది. ఆ సరిహద్దు ఏన్ షేమెషు నీళ్ళ వరకు తరువాత ఏన్ రోగేల్‌కు వెళ్ళింది. 8 అక్కడనుంచి ఆ సరిహద్దు బెన్‌హిన్నోం లోయ గుండా యెబూసివాళ్ళ ప్రాంతానికి దక్షిణం వాలువరకు – జెరుసలంవరకు – పోయింది. రెఫాయీంలోయకు చివర ఉత్తరంగా ఉన్న హిన్నోం లోయ పడమటి భాగంలో ఉన్న కొండ శిఖరం వరకు ఉంది. 9 ఆ సరిహద్దు ఆ కొండ శిఖరంనుంచి నెఫ్తోయ నీటి ఊట వరకు వెళ్ళింది. అక్కడ నుంచి అది బయలా వైపు తిరిగింది. బయలా అంటే కిర్యాత్ యారీం. 10 ఆ సరిహద్దు బయలానుంచి పడమటగా శేయీరు కొండవరకు చుట్టి ఉంది. కెసాలోను అనే యారీం కొండ ఉత్తర దిక్కుకు వెళ్ళి బేత్‌షెమెష్‌కు దిగి తిమ్నా మీదుగా పోయింది. 11 ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడనుంచి షిక్రోనుకు చుట్టి వెళ్ళి బయలా కొండను దాటి యబనెయేల్‌కు వెళ్ళింది. మహా సముద్రం దగ్గర దాని పొలిమేర అవుతుంది. 12 పశ్చిమ సరిహద్దు మహాసముద్రం, దాని తీరం. వారి కుటుంబాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
13 యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రకారం యెఫున్నె కొడుకు కాలేబుకు అతడు యూదా గోత్రం సరిహద్దు లోపల ఒక భాగాన్ని ఇచ్చాడు. అది కిర్యత్ అర్బా, అంటే హెబ్రోన్. (అర్బా అనాకు జాతివాళ్ళకు మూల పురుషుడు.) 14 షేషయి, అహీం, తల్మయి అనే అనాకుయొక్క ముగ్గురు సంతతివాళ్ళను కాలేబు అక్కడనుంచి పారదోలాడు. 15 కాలేబు అక్కడనుంచి దెబీరు పురవాసుల పైబడడానికి వెళ్ళాడు. దెబీరు పేరు అంతకుముందు కిర్యత్ సేఫరు. 16 “కిర్యత్ సేఫెరును ఓడించి దాన్ని పట్టు కొన్నవాడికి నా కూతురు అక్సాను పెళ్ళి చేస్తాను” అని కాలేబు చాటించాడు. 17 కాలేబు తోబుట్టువు కనజు కొడుకైన ఒతనీయేల్ ఆ ఊరును పట్టుకొన్నాడు గనుక కాలేబు అతడికి అక్సాను భార్యగా ఇచ్చాడు. 18 ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడుగు దామని అతణ్ణి సమ్మతింపజేసింది. ఆమె వచ్చి గాడిదను దిగగానే “నీకేం కావాలమ్మా?” అని కాలేబు అడిగాడు. 19 “నాకు అనుగ్రహం చూపండి. మీరు నన్ను దక్షిణ ఎడారి ప్రాంతంలో ఉంచారు. కనీసం కొన్ని ఊటలు కూడా నాకివ్వండి” అందామె. అందుచేత అతడు ఆమెకు ఎగువనున్న ఊటలూ, దిగువనున్న ఊటలూ ఇచ్చాడు.
20 యూదాగోత్రానికి వారి కుటుంబాల ప్రకారం వారి వారసత్వం అది. 21 యూదాగోత్రంవారి ప్రాంతానికి ఏదోం దేశం సరిహద్దువైపు దక్షిణంగా వచ్చిన పట్టణాలు: కబసెయేల్, ఏదెరు, యాగూరు, 22 కేనా, దిమోనా, అదాదా, 23 కాదేషు, హాసోరు, యిత్నాను, 24 జీఫు, తెలెం, బెయాలోతు, 25 హాసోర్ హదత్తా, కెరీయోతు, హాసోరు అనే హెస్రోను, 26 అమాం, షేమ, మోలాదా, 27 హసర్ గద్దా, హెష్మోను, బేత్‌పెలెతు, 28 హసర్‌షువలు, బేర్‌షెబా, బిజ్యోత్యా, 29 బలా, ఈయ్యె, ఎజెం, 30 ఎల్ తోలదు, కెసీలు, హోర్మా, 31 సిక్లగు, మద్‌మన్నా, సన్‌హన్నా, 32 లెబాయోతు, షిల్హిం, అయీను, రిమ్మోను. ఆ పట్టణాలన్నీ ఇరవై తొమ్మిది. వాటి గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
33 దిగువ ప్రదేశంలో ఈ పట్టణాలు ఉన్నాయి: ఎష్‌తాయోలు, జొర్యా, అష్నా, 34 జానోహా, ఏల్‌గన్నీం, తప్పూయ, ఏనాం, 35 యర్మూతు, అదుల్లాం, శోకో, అజేకా, 36 షరాయిం, అదీతాయిం, గెదేరా, గెదేరా ఓతాయిం. ఆ పట్టణాలు పద్నాలుగు. ఒక గ్రామం కూడా ఈ జాబితాలో ఉంది. 37 సెనాను, హదాషా, మిగదోల్‌గాదు, 38 దిలాను, మిస్పే, యొక్తయేల్, 39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను, 40 కబ్బోను, లహ్మాసు, కిత్లిషు, 41 గెదెరోతు, బేత్‌దాగోను, నయామా, మక్కేదా అనేవి పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు. 42 లిబ్నా, ఎతెరు, ఆషాను. 43 యిస్తా, అష్నా, నెసీబ్, 44 కెయిలా, అక్‌జీబ్, మారేషా వాటి గ్రామాలతో పాటు తొమ్మిది పట్టణాలు. 45 ఎక్రోను, దాని ఊళ్ళూ, గ్రామాలూ, 46 ఎక్రోనునుంచి మహా సముద్రంవరకు అష్డోదుకు దగ్గరగా ఉన్న పట్టణాలన్నీ, వాటి గ్రామాలు, 47 అష్డోదు, దాని ఊళ్ళూ, గ్రామాలూ; గాజా, ఈజిప్ట్‌వాగు వరకు మహా సముద్రతీరం వరకు గాజా ఊళ్ళూ, గ్రామాలూ.
48 కొండసీమలో ఈ పట్టణాలున్నాయి: షామీరు, యతీ, శోకో, 49 దన్నా, కిర్యత్‌సన్నా (అదే దెబీరు), 50 అనాబ్, ఎష్‌టెమో, ఆనీం, 51 గోషెన్, హోలోన్, గిలో – పదకొండు పట్టణాలు, వాటి గ్రామాలు. 52 ఆరాబ్, దూమా, ఎషాను, 53 యానీం, బేత్‌తప్పూయ, అపెకా, 54 హుంతా, కిర్యత్ అర్బా (అదే హెబ్రోను), సీయోరు– తొమ్మిది పట్టణాలు, వాటి గ్రామాలు. 55 మయోను, కర్మెల్, జీఫ్, యుట్ట, 56 యెజ్రేల్, యొక్‌దెయాం, జానోహ, 57 కయీను, గిబియా, తిమ్నా – పది పట్టణాలు, వాటి గ్రామాలు. 58 హల్‌హూల్, బేత్‌సూరు, గెదోరు, 59 మారాతు, బేతనోతు, ఎల్‌తేకోను – ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు. 60 కిర్యత్ బయల్ (అదే కిర్యత్ యారీం), రబ్బా – రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.
61 ఎడారిలో బేత్ అరాబా, మిద్దీను, సెకాకా, 62 నిబషాను, యీర్‌మెలఖు, ఎనగెదీ – ఆ ఆరు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.
63  కానీ జెరుసలంలో నివసించే యెబూసి జాతివాళ్ళను మాత్రం యూదా గోత్రంవారు వెళ్ళగొట్టలేకపోయారు. ఈ నాటికీ యెబూసివాళ్ళు యూదావారితో కలిసి జెరుసలంలో కాపురముంటున్నారు.