14
1 ✝ఇస్రాయేల్ ప్రజలకు కనానుదేశంలో వారసత్వంగా వచ్చిన ప్రదేశాలు ఇవి: వీటిని యాజి అయిన ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ, ఇస్రాయేల్‌ప్రజల వంశాల పెద్దలు 2 ✽ చీట్లు వేసి తొమ్మిది గోత్రాలకు, అర్ధ గోత్రంవారికి ఈ వారసత్వాలు పంచి ఇచ్చారు. ఇది యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్టే జరిగింది. 3 రెండు గోత్రాలకూ అర్ధగోత్రంవారికి మోషే యొర్దాను అవతల వారసత్వం ఇచ్చాడు. అయితే లేవీగోత్రికులకు✽ మాత్రం వారి మధ్య వారసత్వమేమీ ఇవ్వలేదు. 4 (యోసేపు సంతానం మనష్షే గోత్రమూ ఎఫ్రాయిం✽గోత్రమూ అనే రెండు గోత్రాలయ్యారు.) లేవీగోత్రికులకు కాపురం ఉండడానికి పట్టణాలు, వారి పశువులకూ మందలకూ వాటి పచ్చిక మైదానాలు తప్ప దేశంలో వారసత్వమేమీ ఇవ్వలేదు. 5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్‌ప్రజ ఆ దేశాన్ని పంచిపెట్టారు.6 ✽గిల్గాల్‌లో యెహోషువ దగ్గరికి యూదా సంతతివారు వచ్చారు. కెనెజివాడు యెఫున్నె కొడుకైన కాలేబు అతనితో ఇలా అన్నాడు. “నా గురించి, నీ గురించి, కాదేష్‌బర్నెయాలో దేవుని మనిషి అయిన మోషేతో యెహోవా చెప్పినది నీకు తెలుసు. 7 ✝కాదేష్‌బర్నెయానుంచి దేశాన్ని గూఢచారిగా చూడడానికి యెహోవా సేవకుడైన మోషే నన్ను పంపినప్పుడు నా వయసు నలభై ఏళ్ళు. నేను తిరిగి వచ్చి ఉన్నది ఉన్నట్టు అతనికి చెప్పాను. 8 నాతోపాటు వెళ్ళి వచ్చిన మా ఇస్రాయేల్‌వారు, ప్రజలకు హృదయం నీరైపోయేలా చేశారు గాని నేను నా దేవుడు యెహోవాను పూర్తిగా అనుసరించాను. 9 ✝ఆ రోజు మోషే నాతో ‘నీవు నీ దేవుడు యెహోవాను పూర్తిగా అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నీకూ నీ సంతానానికీ ఎప్పటికీ వారసత్వం అవుతుంద’ని ప్రమాణం చేశాడు. 10 ✽ఇస్రాయేల్ ప్రజ ఎడారిలో తిరుగాడే కాలంలో మోషేతో యెహోవా ఈ మాట చెప్పినప్పటినుంచి ఈ నలభై అయిదేళ్ళు, ఆయన చెప్పినట్టే ఇదిగో యెహోవా నన్ను బతికించే ఉంచాడు. నాకిప్పుడు ఎనభై అయిదేళ్ళు. 11 ✽మోషే నన్ను పంపిన ఆ రోజు నాకెంత బలం ఉందో ఈ రోజు అంతే బలం ఉంది. యుద్ధానికి గానీ, వెళ్ళడానికీ రావడానికి గానీ నేను ఆ రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు అంతే బలంగా ఉన్నాను. 12 కనుక యెహోవా ఆ రోజు చెప్పిన ఈ కొండసీమ నాకు ఇయ్యి. అనాకువాళ్ళు అక్కడున్నారనీ వాళ్ళ పట్టణాలు గొప్పవి, ప్రాకారాలూ కోటలూ గలవి అనీ నీవు విన్నావు. యెహోవా నాతో ఉంటే ఆయన చెప్పినట్లే నేను వాళ్ళను పారదోలుతాను.”
13 యెహోషువ యెఫున్నె కొడుకైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు. 14 కెనెజివాడు యెఫున్నె కొడుకైన కాలేబు ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాను పూర్తిగా అనుసరించాడు గనుక హెబ్రోను ఈ నాటికి అతని వారసత్వం. 15 హెబ్రోనుకు ముందు పేరు కిర్యాత్ అర్బా. అనాకువాళ్ళలో అర్బా మహా గొప్పవాడు. యుద్ధాలు పోయి దేశం ప్రశాంతంగా ఉంది.