13
1 యెహోషువ వయసు మళ్ళిన ముసలివాడు✽ అయ్యాడు అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “నీవు వయసు మళ్ళిన ముసలివాడివయ్యావు. కానీ ఇంకా స్వాధీనం చేసుకోవలసిన భూమి చాలా మిగిలిపోయింది✽. 2 ఇంకా మిగిలిపోయిన భూములేవంటే ఫిలిష్తీయవాళ్ళ ప్రాంతాలన్నీ; గెషూరివాళ్ళ ప్రదేశమంతా, 3 (ఈజిప్ట్‌కు తూర్పుగా ఉన్న షీహోరు నుంచి ఉత్తర దిక్కున ఎక్రోను సరిహద్దువరకు ఉన్న ప్రాంతం కనానువాళ్ళదని ఎంచుతారు. ఫిలిష్తీయవాళ్ళ అయిదుగురు నాయకులు గాజా, అష్డోదు, అష్‌కెలోను, గాతు, ఎక్రోను అనే పట్టణాల రాజులు.) దక్షిణ దిక్కున ఆవివాళ్ళ ప్రాంతం; 4 ఆఫెకువరకు, అమోరీవాళ్ళ సరిహద్దువరకు ఉన్న కనానువాళ్ళ ప్రదేశమంతా, సీదోనువాళ్ళ మేరా ప్రాంతం; 5 గీబ్లీవాళ్ళ ప్రదేశం; హెర్మోను పర్వతం దిగువ ఉన్న బయల్‌గాదు నుంచి హమాతు కనుమ వరకు తూర్పు లెబానోను దేశమంతా; 6 ✽లెబానోనునుంచి మిశ్‌రేపోత్ మాయిం వరకు ఉన్న పర్వత నివాసులందరి ప్రాంతం; సీదోనువాళ్ళ ప్రదేశమంతా. నేను ఇస్రాయేల్ ప్రజల ఎదుట నుంచి ఈ జనాలను వెళ్ళగొట్టివేస్తాను. నీవు మాత్రం నేను నీకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేల్‌ప్రజకు వారసత్వంగా ఈ దేశాన్ని పంచిపెట్టు. 7 తొమ్మిది గోత్రాలవారికి, మనష్షే అర్ధ గోత్రం వారికి వారసత్వంగా ఈ దేశాన్ని పంచిపెట్టు.”8 ✝మనష్షే గోత్రంలో తక్కినవారు, రూబేనుగోత్రికులు, గాదుగోత్రికులు యొర్దాను తూర్పుగా యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన ప్రకారం వారి వారసత్వం పుచ్చుకొన్నారు. 9 మోషే వారికి ఇచ్చినది అర్నోను లోయదగ్గర ఉన్న అరోయేర్ నుంచి ఆ లోయ మధ్య ఉన్న పట్టణం నుంచి దీబోను వరకు ఉన్న మేదెబా మైదానాల ప్రాంతమంతా; 10 హెష్బోనులో ఉండే అమోరీవాళ్ళ రాజు సీహోను పట్టణాన్ని, అమ్మోనువాళ్ళ సరిహద్దువరకు ఉన్న ప్రాంతమంతా; 11 గిలాదు ప్రదేశం; గెషూరివాళ్ళ, మాయకాతివాళ్ళ ప్రదేశం; హెర్మోను పర్వత ప్రదేశమంతా; సల్కావరకు బాషాను ప్రదేశమంతా; 12 రెఫాయింవాళ్ళలో చివరివాడైన అష్‌తారోతులో, ఎద్రెయీలో పరిపాలించిన బాషాను రాజైన ఓగు రాజ్యమంతా. మోషే ఆ రాజులను హతమార్చి వాళ్ళ దేశాలను ఆక్రమించాడు. 13 ✽కానీ ఇస్రాయేల్‌ప్రజలు గెషూరివాళ్ళనూ మాయాకాతి వాళ్ళనూ బయటికి వెళ్ళగొట్టలేదు. ఈనాటికి గెషూరివాళ్ళూ మాయకాతివాళ్ళూ ఇస్రాయేల్‌ప్రజల మధ్యనే కాపుర ముంటున్నారు. 14 మోషే లేవీగోత్రికులకు మాత్రమే వారసత్వాన్ని ఇవ్వలేదు. యెహోవా వారికి చెప్పినట్టు ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు అర్పించబడ్డ హోమబలులే వారికి వారసత్వం.
15 వారి కుటుంబాలప్రకారం రూబేను గోత్రప్రజలకు మోషే వారసత్వాన్ని ఇచ్చాడు. 16 వారి ప్రాంతం అర్నోనునది గట్టుపై ఉన్న అరోయేర్‌నుంచి, ఆ లోయ మధ్య ఉన్న పట్టణంనుంచి మేదెబావరకు ఉండే మైదానాల ప్రాంతం. 17 హెష్బోను, మైదానాల ప్రాంతంలోఉన్న దాని పట్టణాలన్నీ; దీబోను, బామెత్‌బయల్, బేత్‌బయల్‌మెయోన్, 18 యాహాసు, కెదేమోతు, మేఫాతు; 19 కిర్యతాయిం, సిబ్మా, ఆ లోయలోని కొండమీద ఉన్న శెరెత్‌షహారు; 20 బేత్ పయోరు, పిస్గాకొండ వాలు ప్రదేశం; బేత్‌యేషిమోతు; 21 మైదానాల ప్రాంతంలోని ఆ పట్టణాలన్నీ, హెష్బోనులో పరిపాలించిన అమోరీవాళ్ళ రాజు సీహోను రాజ్యమంతా మోషే సీహోనునూ సీహోను దేశంలో నివసిస్తూ, అతడి చేతిక్రింద ఉండే ఎవీ, రేకెం, సూరు, హోరు, రేబ అన్మే మిద్యానువాళ్ళ పాలకులనూ హతమార్చాడు.
22 తాము చంపిన వాళ్ళతోపాటు ఇస్రాయేల్‌వారు బెయోరు కొడుకూ శకునాలు చెప్పేవాడూ అయిన బిలాం✽ను ఖడ్గంతో చంపారు. 23 రూబేనువారి సరిహద్దు యొర్దాను ఒడ్డు. రూబేను వారికి వారి కుటుంబాల ప్రకారం వారసత్వం, దానిలోని పట్టణాలూ గ్రామాలూ ఇవే.
24 గాదు గోత్రికులకు వారి కుటుంబాల ప్రకారం వారసత్వం మోషే ఇచ్చాడు. 25 గాదువారికి లభించింది యాజెరు, గిలాదు ప్రదేశంలోని పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేర్‌వరకు అమ్మోనువాళ్ళ దేశంలో సగం, 26 హెష్బోను నుంచి రామాత్‌మిజ్పె, బెటొనీం వరకు; మహనయీం నుంచి దెబీరు సరిహద్దువరకు ఉన్న ప్రాంతం; 27 లోయలో హెష్బోను రాజు సీహోను రాజ్యంలో మిగతా భాగమైన బేతారం, బేత్‌నిమ్రా, సుక్కోతు, సాపోను, యొర్దానుకు తూర్పుగా ఈ ప్రాంతం సరిహద్దు కిన్నెరెతు సరస్సు దక్షిణ తీరం వరకు యొర్దాను నది. 28 గాదుగోత్రికులకు లభించిన వారసత్వం, దానిలోని పట్టణాలూ గ్రామాలూ ఇవే.
29 మనష్షే అర్ధ గోత్రంవారికి మోషే వారసత్వాన్ని ఇచ్చాడు. మనష్షే అర్ధగోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం లభించినది 30 మహనయీం నుంచి బాషాను ప్రదేశమంతా – బాషానురాజు ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరుకు చెందిన అరవై ఊళ్ళు, 31 గిలాదు ప్రదేశంలో సగం, బాషానులోని ఓగు రాజ్యంలో ఉన్న అష్‌తారోతు, ఎద్రయీ అనే పట్టణాలు మనష్షే కొడుకు మాకీరు సంతతివారిలో సగంమందికి వారి కుటుంబాల ప్రకారం లభించాయి.
32 యెరికోకు తూర్పువైపుగా, యొర్దాను అవతల, మోయాబు మైదానాల ప్రాంతంలో మోషే వారసత్వంగా పంచిపెట్టిన ప్రదేశాలు ఇవే. 33 కానీ లేవీగోత్రికులకు మాత్రం మోషే ఏ వారసత్వాన్నీ ఇవ్వలేదు. ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవా వారితో చెప్పినట్టు యెహోవాయే వారి వారసత్వం.