12
1 ఇస్రాయేల్‌ప్రజలు యొర్దానుకు అవతల, ప్రొద్దు పొడిచే దిక్కున, అర్నోను లోయనుంచి హెర్మోను పర్వతంవరకు ఉన్న ప్రదేశాన్నీ తూర్పుగా ఉన్న అరాబా లోయ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకొని అక్కడి రాజులను హతమార్చారు. 2 ఆ రాజులలో ఒకడు అమోరీవాడు సీహోను. అతడు హెష్బోనులో ఉంటూ అర్నోను నది ఒడ్డున ఉన్న అరోయేర్‌నుంచి అక్కడి లోయ మధ్యభాగంనుంచి గిలాదు ప్రదేశంలో సగంవరకు, అమ్మోనువాళ్ళ సరిహద్దు యబ్బోకు నదివరకు పరిపాలించేవాడు.
3 కిన్నెరెతు సరస్సు తూర్పుగా ఉన్న ప్రాంతంనుంచి అరాబాసరస్సు – అంటే ఉప్పు సరస్సు – తూర్పుగా ఉన్న బేత్ యేషీమోతుకు పోయే దారివరకు, దక్షిణంగా పిస్గాకొండ దిగువప్రాంతం వరకు ఉన్న అరాబా లోయ ప్రదేశాన్ని కూడా సీహోను పరిపాలించేవాడు. 4 ఇస్రాయేల్‌వారు హతమార్చిన మరో రాజు బాషానురాజు ఓగు. అతడు మిగిలిన రెఫాయింలో ఒకడు. 5 అష్తారోతులో, ఎద్రెయీలో నివసించి గెషూరివాళ్ళ, మాయకాతివాళ్ళ సరిహద్దువరకు బాషాను ప్రదేశాన్నంతా, సలేకాను, హెర్మోను పర్వత ప్రాంతాన్ని పరిపాలించేవాడు. హెష్బోను రాజైన సీహోను సరిహద్దులవరకు గిలాదు ప్రదేశంలో సగం భాగాన్నికూడా పరిపాలించేవాడు. 6 యెహోవా సేవకుడైన మోషే, ఇస్రాయేల్‌ప్రజలు ఆ రాజులను హత మార్చారు. యెహోవా సేవకుడైన మోషే ఆ ప్రాంతాలను రూబేను గోత్రికులకూ గాదుగోత్రికులకూ మనష్షే అర్ధ గోత్రంవారికీ సొత్తుగా ఇచ్చాడు.
7 యెహోషువ, ఇస్రాయేల్‌ప్రజలు యొర్దానుకు ఇవతల పడమటవైపు లెబానోను లోయలో ఉన్న బయల్ గాదు నుంచి శేయీరు పర్వతం సమీపమైన హలాక్ పర్వతంవరకు ఉన్న ప్రదేశాల రాజులను హతమార్చారు. ఆ భూములను ఇస్రాయేల్ వారి గోత్రాలకు ఆ గోత్ర విభజనప్రకారం యెహోషువ సొత్తుగా ఇచ్చాడు. 8 కొండసీమలో, దిగువ ప్రదేశాలలో, ఎడారిలో, దక్షిణ ప్రదేశంలో హిత్తి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతులవాళ్ళ భూములను ఇస్రాయేల్‌వారి గోత్రాల కిచ్చాడు.
వారు హతమార్చిన రాజులు: 9 యెరికో రాజు, బేతేల్‌ప్రక్క ఉన్న హాయీ రాజు, 10 జెరుసలం రాజు, హెబ్రోను రాజు, 11 యర్మూతు రాజు, లాకీషు రాజు, 12 ఎగ్లోను రాజు, గెజెరు రాజు, 13 దెబీరు రాజు, గెదెరు రాజు, 14 హోర్మా రాజు, అరాదు రాజు, 15 లిబ్నా రాజు, అదుల్లాం, రాజు, 16 మక్కేదా రాజు, బేతేల్ రాజు, 17 తప్పూయ రాజు, హెపెరు రాజు, 18 ఆఫెకు రాజు, లష్షారోను రాజు, 19 మాదోను రాజు, హాసోర్ రాజు, 20 షిమ్రోన్‌మెరోను రాజు, అక్షాపు రాజు, 21 తానాకు రాజు, మెగిద్దో రాజు, 22 కెదెషు రాజు, కర్మెల్ పర్వతంలో యొక్‌నెయాం రాజు, 23 దోరు ఎత్తయిన ప్రాంతంలో దోరు రాజు, గిల్గాల్‌లో ఉన్న గోయీంవాళ్ళ రాజు, 24 తిర్సా రాజు. మొత్తం ముప్ఫయి యొక్కమంది రాజులు.