11
1 ✽హాసోరు రాజైన యాబీను ఈ విషయాలు విని ఈ రాజులకు కబురు పంపాడు. మాదోను రాజైన యోబాబుకూ షిమ్రోను రాజుకూ అక్షాపు రాజుకూ 2 ✽ఉత్తరాన కొండ ప్రదేశాలలో ఉన్న రాజులకూ కిన్నెరెతు సరస్సుకు దక్షిణంగా ఉన్న అరాబా లోయ ప్రాంతంలో ఉన్న రాజులకూ దిగువ ప్రదేశంలో రాజులకూ పడమటిగా ఉన్న దోరు ఎత్తయిన ప్రదేశం రాజుకూ, 3 తూర్పున, పడమట ఉన్న కనానువాళ్ళకూ అమోరీ, హిత్తి, పెరిజ్జి జాతుల వాళ్ళకూ పర్వతాలలో ఉన్న యెబూసివాళ్ళకూ, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వివాళ్ళకూ. 4 వాళ్ళూ వాళ్ళ సైన్యాలన్నీ మహా గొప్ప గుర్రాల, రథాల సమూహంతో బయలుదేరారు. వాళ్ళు లెక్కకు సముద్ర తీరాన ఉన్న ఇసుకలాగా ఉన్నారు. 5 ఈ రాజులంతా ఏకీభవించి ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేయడానికి మెరోం నీళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ సమకూడి మకాం చేశారు.6 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “వాళ్ళను చూచి నీవు భయపడకు. రేపు ఈ వేళకు వాళ్ళనందరినీ ఇస్రాయేల్ వారు వధించేలా చేస్తాను. వాళ్ళ గుర్రాల గుదికాళ్ళ నరాలను✽ తెగగొట్టి వాళ్ళ రథాలను మంటల్లో వేసి కాల్చివేస్తావు.”
7 కాబట్టి యెహోషువ, అతనితోపాటు సైనికులంతా బయలుదేరి మెరోం నీళ్ళ దగ్గర హఠాత్తుగా వాళ్ళ మీద పడ్డారు. 8 ✽యెహోవా ఇస్రాయేల్‌వారి చేతికి వాళ్ళ నప్పగించాడు గనుక వాళ్ళను ఓడించి మహా సీదోను నగరం వరకు, మిన్‌రఫోతు నీళ్ళవరకు, తూర్పుగా మిస్పే లోయవరకు వాళ్ళను తరిమారు, వాళ్ళందరినీ కూల్చారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలలేదు. 9 యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం యెహోషువ వాళ్ళకు చేశాడు. వాళ్ళ గుర్రాల గుదికాళ్ళ నరాలను తెగగొట్టి వాళ్ళ రథాలను మంటల్లో వేసి కాల్చివేశాడు.
10 యెహోషువ ఆ సమయంలో వెనక్కు తిరిగి హాసోరును వశపరచుకొన్నాడు, దాని రాజును ఖడ్గంతో వధించాడు. అంతకుముందు హాసోరు పట్టణం ఆ రాజ్యాలన్నిటికీ తలగా ఉండేది. 11 ✝అక్కడున్న వాళ్ళందరినీ వారు ఖడ్గంతో చంపివేశారు. గాలి పీల్చుకొనేవాడంటూ లేకుండా చేసి హాసోరును కాల్చివేశారు. 12 ఆ రాజులందరినీ, వాళ్ళ పట్టణాలనూ యెహోషువ పట్టుకొని ఖడ్గంతో హతమార్చి యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టే సర్వనాశనం చేశాడు. 13 యెహోషువ హాసోరును తగలబెట్టాడు గాని మట్టిదిబ్బలమీద ఉన్న ఆ మిగతా పట్టణాలను ఇస్రాయేల్ వారు తగలబెట్టలేదు. 14 ఆ పట్టణాలలో దొరికిన దోపుడు సొమ్మునూ పశువులనూ ఇస్రాయేల్‌వారు తమ సొంతానికి తీసుకొన్నారు. కానీ మనుషులందరూ నాశనమయ్యేవరకు వాళ్ళను ఖడ్గంతో కూల్చారు. గాలి పీల్చుకొనే ఏ వ్యక్తినీ విడిచి పెట్టలేదు. 15 ✽యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే యెహోషువ చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విషయాలలో అతడు నెరవేర్చకుండా ఒక్కటి కూడా విడువలేదు.
16 యెహోషువ ఆ దేశాన్నంతా – శేయీరు పర్వతం దిక్కుగా ఉన్న హలాక్ పర్వతంనుంచి హెర్మోను పర్వతంక్రింద లెబానోను లోయలో ఉన్న బయల్‌గాదు వరకు ఆ దేశాన్నంతా వశపరచుకొన్నాడు. 17 కొండసీమనూ దక్షిణదేశాన్నీ గోషెను ప్రదేశాన్నంతా దిగువప్రదేశాలనూ అరాబా లోయ ప్రాంతాన్నీ– ఇస్రాయేల్ దేశంలోని కొండ ప్రదేశాలనూ దిగువ ప్రదేశాలనూ అతడు వశపరచుకొన్నాడు. ఆ ప్రదేశాల రాజులందరినీ పట్టుకొని వాళ్ళను కొట్టి చంపాడు. 18 ఆ రాజులందరితో యెహోషువ చాలా కాలం✽ యుద్ధం చేశాడు. 19 గిబియోను వాసులైన ఆ హివ్వివాళ్ళు తప్ప ఇస్రాయేల్‌ప్రజతో ఏ పట్టణం కూడా సంధి చేసుకోలేదు. తక్కిన పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలోనే జయించారు. 20 ఆ దేశస్థులు ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసి పూర్తిగా నాశనం అయ్యేలా యెహోవా వాళ్ళ గుండెలు బండబారిపోయేలా✽ చేశాడు. తాను మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజ వాళ్ళను దయ చూడకుండా వాళ్ళను నిర్మూలం✽ చేయాలని యెహోవా నిర్ణయం.
21 ఆ సమయంలోనే యెహోషువ వచ్చి కొండసీమనుంచి, హెబ్రోనునుంచి, దెబీరునుంచి, అనాబునుంచి – యూదా కొండ ప్రదేశమంతటి నుంచీ అనాకువాళ్ళను✽ రూపుమాపాడు. వాళ్ళ పట్టణాలతో పాటు వాళ్ళను సమూల నాశనం చేశాడు. 22 ఇస్రాయేల్‌ప్రజల దేశంలో ఒక్క అనాకువాడు కూడా మిగలలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొంతమంది మిగిలారు. 23 ✽ యెహోవా మోషేతో చెప్పిన ప్రకారం యెహోషువ దేశాన్నంతా స్వాధీనం చేసుకొన్నాడు. ఇస్రాయేల్‌ప్రజలకు వారి గోత్రాల భాగాల ప్రకారం అతడు దానిని వారసత్వంగా ఇచ్చాడు.
యుద్ధాలు పోయి దేశం ప్రశాంతంగా ఉంది.