10
1 యెహోషువ హాయీని వశపరచుకొని యెరికోనూ దాని రాజునూ చేసినట్టే హాయీనీ దాని రాజునూ చేసి ఆ ఊరిని సర్వనాశనం చేశాడని జెరుసలం రాజైన అదోనీసెదెకు విన్నాడు. గిబియోను వాసులు ఇస్రాయేల్ ప్రజలను సఖ్యపరచుకొని వారితోనే ఉంటున్నారని కూడా అతడు విన్నాడు. 2 అతడికి చాలా భయం వేసింది. ఎందుకంటే గిబియోను ఒక మహా పట్టణం. రాజపురంలాంటిది; హాయీకంటే పెద్దది. దాని నివాసులంతా యుద్ధవీరులు. 3 అందుచేత జెరుసలంరాజు అదోనీసెదెకు హెబ్రోను రాజైన హోహాంకూ యర్మూతు రాజైన పైరాంకూ లాకీషు రాజైన యాఫీయకూ ఎగ్లోను రాజైన దెబీర్‌కూ ఈ విధంగా కబురు పంపాడు:
4 “నా దగ్గరికి రండి. గిబియోనువాళ్ళు యెహోషువతో ఇస్రాయేల్‌ప్రజతో సఖ్యపడ్డారు. గిబియోనును నాశనం చేయడానికి నాకు సహాయం చెయ్యండి.”
5 అమోరీవాళ్ళ రాజులు అయిదుగురు – జెరుసలం రాజూ హెబ్రోను రాజూ యర్మూతు రాజూ లాకీషు రాజూ ఎగ్లోను రాజూ – సమకూడారు. వాళ్ళు, వాళ్ళ సైన్యాలన్నీ బయలుదేరి గిబియోనును ముట్టడించి దానితో యుద్ధం జరిగించారు.
6 అప్పుడు గిబియోనువాళ్ళు గిల్గాల్‌లోని శిబిరంలో ఉన్న యెహోషువకు ఇలా కబురు పంపారు. “కొండసీమలలో నివసించే అమోరీ రాజులందరూ కలుసుకొని మామీదికి దండెత్తారు. మీ దాసులైన మా చెయ్యి విడవకండి. త్వరగా మాదగ్గరికి రండి. మాకు సహాయం చెయ్యండి. మమ్మల్ని రక్షించండి.”
7 కాబట్టి యెహోషువ, అతనితోపాటు సైనికులంతా, యుద్ధ వీరులంతా గిల్గాల్ నుంచి తరలివెళ్ళారు. 8  అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా అన్నాడు:
“వారంటే భయపడకు. నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఒక్కడూ నీ ఎదుట ఆగలేడు.”
9 యెహోషువ రాత్రంతా గిల్గాల్ నుంచి ప్రయాణం చేసి వాళ్ళ మీద హఠాత్తుగా పడ్డాడు. 10 యెహోవా వాళ్ళను ఇస్రాయేల్‌వారి ఎదుట ఓడించి పారదోలాడు. గిబియోను దగ్గర యెహోషువ వాళ్ళను ఘోరంగా వధించాడు. బేత్‌హోరోనుకు పైకి పోయే దారి వెంట వాళ్ళను తరుముతూ అజేకా వరకూ మక్కేదావరకూ వాళ్ళను హతమారుస్తూ వచ్చాడు. 11 వాళ్ళు ఇస్రాయేల్‌వారి ముందునుంచి పారిపోతూ ఉంటే బేత్‌హోరోను కనుమలో అజేకావరకు యెహోవా వాళ్ళపై ఆకాశంనుంచి పెద్దపెద్ద వడగండ్లు కురిపించాడు. వాళ్ళు చచ్చారు. ఇస్రాయేల్ వారు కత్తితో చంపినవాళ్ళ కంటే వడగండ్లవల్ల చచ్చినవాళ్ళే ఎక్కువమంది.
12 యెహోవా అమోరీవాళ్ళను ఇస్రాయేల్‌వారి వశం చేసిన రోజున యెహోషువ యెహోవాతో మాట్లాడి ఇస్రాయేల్ వారి సమక్షంలో ఇలా అన్నాడు:
“సూర్యగోళమా, గిబియోను మీద ఆగిపో! చంద్రబింబమా, అయ్యాలోను లోయపైగా ఆగిపో!”
13 శత్రువులమీద ఇస్రాయేల్‌ప్రజ పగ తీర్చుకొనేంతవరకు సూర్యగోళం నిలిచింది, చంద్రబింబం ఆగిపోయింది. ఈ సంగతి యాషారు గ్రంథంలో వ్రాసి ఉంది గదా. ఆకాశం మధ్యలో సూర్యగోళం నిలిచివుండి దాదాపు ఆ రోజంతా అస్తమించడానికి ఆలస్యం చేసింది. 14 యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందు గానీ ఆ తరువాత గానీ లేదు. యెహోవా ఇస్రాయేల్ ప్రజల కోసం యుద్ధం చేశాడు! 15  ఆ తరువాత యెహోషువ అతనితో పాటు ఇస్రాయేల్ వారంతా గిల్గాల్ లో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చారు.
16 ఆ అయిదుగురు రాజులు పారిపోయి మక్కేదా దగ్గర ఒక గుహలో దాగుకొన్నారు. 17 “ఆ అయిదుగురు రాజులు మక్కేదాదగ్గర గుహలో దాక్కొన్నారని తెలిసింది” అని ఎవరో యెహోషువకు చెప్పారు. 18 యెహోషువ అన్నాడు:
“గుహ ద్వారానికి పెద్దపెద్ద రాళ్ళను దొర్లించి మూసి వేయండి. దానిప్రక్క మనుషులను కాపలా పెట్టండి. 19 మీరు అక్కడ ఆగకుండా శత్రువులను తరుముతూ ఉండండి, వెనుక ఉన్నవాళ్ళను కూల్చండి. వాళ్ళ పట్టణాలలోకి వాళ్ళను వెళ్ళనియ్యకండి. మీ దేవుడు యెహోవా వాళ్ళను మీ చేతికి అప్పగించాడు.”
20 వాళ్ళు నాశనమయ్యేవరకు యెహోషువ, ఇస్రాయేల్ వారు మహా వధ చేసి ముగించారు. వాళ్ళలో మిగిలినవాళ్ళు ప్రాకారాలు ఉన్న పట్టణాలలోకి చేరుకొన్నారు. 21 అప్పుడు ఇస్రాయేల్ వారంతా మక్కేదాదగ్గర ఉన్న శిబిరానికి యెహోషువ దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇస్రాయేల్‌ప్రజలను ఎవ్వడూ ఒక్క మాట కూడా అనడానికి తెగించలేదు.
22 యెహోషువ “గుహ ద్వారం తెరచి గుహనుంచి వెలుపలికి నాదగ్గరికి ఆ అయిదుగురు రాజులను తీసుకురండి” అన్నాడు. 23 వారు అలా చేసి ఆ అయిదుగురు రాజులను – జెరుసలం రాజునూ హెబ్రోను రాజునూ యర్మూతు రాజునూ లాకీషు రాజునూ ఎగ్లోను రాజునూ – గుహనుంచి బయటికి తెచ్చారు. 24 ఆ రాజులను వారు యెహోషువ దగ్గరికి తీసుకువచ్చాక యెహోషువ ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి తనతో వెళ్ళిన సైనికుల అధిపతులతో “నా దగ్గరికి రండి, మీ పాదాలు ఈ రాజుల మెడలమీద పెట్టండి” అన్నాడు. కనుక వారు దగ్గరికి వచ్చి వాళ్ళ మెడలమీద తమ పాదాలు పెట్టారు.
25 అప్పుడు యెహోషువ వారితో అన్నాడు, “మీరు యుద్ధం చేసే మీ శత్రువులందరికీ యెహోవా ఈ విధంగానే చేస్తాడు. గనుక భయపడకండి, హడలిపోకండి. దృఢంగా, ధైర్యంగా ఉండండి.”
26 ఆ తరువాత యెహోషువ ఆ రాజులను కొట్టి చంపి వాళ్ళ శవాలను అయిదు చెట్లకు వ్రేలాడదీశాడు. సాయంకాలం వరకు వాళ్ళు ఆ చెట్లమీద వ్రేలాడుతూనే ఉన్నారు. 27 ప్రొద్దు క్రుంకే సమయాన యెహోషువ ఆజ్ఞప్రకారం వాళ్ళను చెట్లమీదనుంచి దింపి వాళ్ళు దాగుకొన్న గుహలోనే పారవేసి గుహ ద్వారానికి అడ్డంగా పెద్దపెద్ద రాళ్లను దొర్లించారు. అవి ఈనాటికి అలాగే ఉన్నాయి.
28 ఆ రోజే యెహోషువ మక్కేదాను పట్టుకొని దానినీ దాని రాజునూ కత్తిపాలు చేశాడు. ఆ ఊరినీ దానిలో ఉన్న అందరినీ సర్వనాశనం చేశాడు. ఒక్కణ్ణీ మిగల్చలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్టే మక్కేదా రాజుకు చేశాడు. 29 మక్కేదానుంచి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా లిబనాకు వెళ్ళి దానిపై యుద్ధం చేశారు. 30 దానినీ దాని రాజునూ కూడా యెహోవా ఇస్రాయేల్‌వారి చేతికి అప్పగించాడు. వారు దానినీ దానిలో ఉన్న వాళ్ళందరినీ కత్తితో సంహరించారు. వారు దానిలో ఒక్కరినీ మిగలనివ్వలేదు. యెరికోరాజును చేసినట్టే ఆ రాజును చేశారు. 31 లిబనానుంచి బయలుదేరి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా లాకీషుకు వెళ్లి దానిని ముట్టడించి దానిపై యుద్ధం చేశారు. 32 యెహోవా ఇస్రాయేల్‌వారి చేతికి లాకీషును కూడా అప్పగించాడు. రెండో రోజున వారు దానిని పట్టుకొని లిబనాను చేసినట్టే దానినీ దానిలో ఉన్న వాళ్ళందరినీ కత్తితో నాశనం చేశారు.
33 లాకీషుకు సహాయంగా గెజెరు రాజైన హోరాం వచ్చాడు. యెహోషువ అతణ్ణీ, అతడి జనంలో ఒక్కడూ మిగలకుండా వారినీ కూలగొట్టాడు. 34 లాకీషునుంచి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా ఎగ్లోనుకు వెళ్ళి దానిని ముట్టడించి దానిపై యుద్ధం చేశారు. 35 చేరిన రోజే దానిని పట్టుకొని దానిని కత్తితో నాశనం చేశారు. లాకీషును చేసినట్టే దానిలో ఉన్నవాళ్ళందరినీ ఆ రోజున చంపారు. 36 ఎగ్లోనునుంచి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా హెబ్రోనుకు వెళ్ళి దానిమీద యుద్ధం చేశారు. 37 వారు దానిని పట్టుకొని దానినీ దాని రాజునూ దానికి చెందిన అన్ని గ్రామాలనూ దానిలో ఉన్న వాళ్ళందరినీ కత్తిపాలు చేశారు. ఎగ్లోనుకు ఎలా చేశారో అలాగే వారు ఒక్కరినీ మిగల్చలేదు. దానినీ దానిలో ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేశారు. 38 అక్కడనుంచి తిరిగి, యెహోషువ అతనితోపాటు ఇస్రాయేల్ వారంతా దెబీరుకు వచ్చి దానిపై యుద్ధం చేశారు. 39 వారు దానినీ దాని రాజునూ దానికి చెందిన అన్ని గ్రామాలనూ పట్టుకొన్నారు. కత్తితో వాటిని నాశనం చేశారు. దెబీరులో ఉన్నవాళ్ళందరినీ చంపారు. ఒక్కరినీ మిగల్చలేదు. హెబ్రోనునూ లిబనానూ దాని రాజునూ చేసినట్టే దెబీరును చేశారు.
40 యెహోషువ కొండల ప్రదేశాన్నంతా దక్షిణ ప్రాంతాన్నంతా దిగువ ప్రదేశాలన్నిటినీ వాలు ప్రాంతాలన్నిటినీ ఆ ప్రదేశాల రాజులను జయించాడు. ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్టే ప్రాణం ఉన్నవాళ్ళందరినీ అతడు సంహరించాడు. ఒక్కడినీ మిగలనివ్వలేదు. 41 కాదేష్‌బర్నెయా నుంచి గాజా వరకు గోషెను ప్రదేశాన్నంతా గిబియోనువరకు అతడు జయించాడు. 42 ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇస్రాయేల్‌వారి పక్షంగా యుద్ధం చేశాడు గనుక ఆ రాజులందరినీ వాళ్ళ ప్రదేశాలనూ ఒకే సారి యెహోషువ పట్టుకొన్నాడు. 43 ఆ తరువాత యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా గిల్గాల్‌లో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చారు.