9
1 యొర్దానుకు పడమరగా ఉన్న కొండసీమలో కొండల దిగువ భూములలో, లెబానోనువరకు ఉన్న మహాసముద్ర తీరాన అంతటా ఉన్న రాజులు – హిత్తి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతుల రాజులు– ఈ విషయం విన్నారు. 2 వాళ్ళంతా యెహోషువతోను ఇస్రాయేల్ ప్రజలతోను యుద్ధం చేయడానికి ఏకంగా సమకూడారు.
3 యెహోషువ యెరికోకూ హాయీకీ చేసినది గిబియోను వాసులు విన్నప్పుడు 4 వాళ్ళు యుక్తిగా ప్రవర్తించారు. రాయబారులుగా నటిస్తూ గాడిదలమీద పాత గోనెసంచులూ పాతగిలి చినిగిపోయి కుట్టివున్న ద్రాక్షరసం తిత్తులూ వేసుకొన్నారు. 5 కాళ్ళకు అరిగిపోయిన పాత చెప్పులూ పాతపడిపోయిన బట్టలూ వేసుకొన్నారు. వాళ్ళు తెచ్చుకొన్న రొట్టెలు ఎండిపోయి ముక్కలయ్యాయి. 6 వాళ్ళు గిల్గాల్‌లో ఉన్న శిబిరానికి యెహోషువ దగ్గరికి వచ్చి అతనితోను ఇస్రాయేల్ ప్రజలతోను “మేము దూర దేశంనుంచి వచ్చాం. ఇప్పుడు మీరు మాతో ఒడంబడిక చేయండి” అన్నారు.
7 కానీ ఇస్రాయేల్‌వారు ఆ హివ్వివాళ్ళతో “ఒక వేళ మీరు మా మధ్యనే నివసించే జనమేమో. మీతో మేము ఎలా ఒడంబడిక చేసుకొంటాం?” అన్నారు.
8 వాళ్ళు “మేము మీ దాసులం” అని యెహోషువతో అన్నారు. “మీరెవరు? ఎక్కడనుంచి వచ్చారు?” అని యెహోషువ వాళ్ళనడిగాడు.
9 అందుకు వాళ్ళు ఇలా జవాబిచ్చారు: “మీ దాసులైన మేము చాలా దూర దేశంనుంచి వచ్చాం. మీ దేవుడైన యెహోవా పేరు ప్రతిష్ఠలు విని ఆయన ఈజిప్ట్‌లో చేసినది విని ఆయన కీర్తికారణంగా వచ్చాం. 10 యొర్దానుకు అవతల ఉన్న ఆ ఇద్దరు అమోరీవాళ్ళ రాజుల్ని – హెష్బోనురాజు సీహోనునూ అష్తారోతులో ఉండే బాషానురాజు ఓగునూ – యెహోవా ఏం చేశాడో అది కూడా మేము విన్నాం. 11 కాబట్టి మా పెద్దలు, మా దేశవాసులంతా మాతో ఇలా అన్నారు: ప్రయాణానికి భోజనం చేతపట్టుకువెళ్ళి వారిని కలుసుకొని వారితో ‘మేం మీ దాసులం, మాతో ఒడంబడిక చేయండి’ అని చెప్పాలి. 12 మేము మీదగ్గరికి రావడానికి బయలుదేరిన రోజున మా ప్రయాణానికి మా ఇళ్ళదగ్గర నుంచి తెచ్చిన ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు గదా, ఇవి ఎండి ముక్కలయ్యాయి. 13 ఈ ద్రాక్షరసం తిత్తులు మేము నింపినప్పుడు క్రొత్తవే. ఇవిగో! ఇప్పుడు చిరిగిపోయాయి. ఇంత పెద్ద ప్రయాణం మూలాన ఈ బట్టలూ చెప్పులూ పాతపడిపోయాయి.”
14 ఇస్రాయేల్‌ప్రజలు యెహోవాను సంప్రదించకుండానే వాళ్ళ భోజన పదార్థాలలో కొంత తీసుకొన్నారు. 15 యెహోషువ వాళ్ళతో సంధి చేసుకొని వాళ్ళను బ్రతకనిస్తామని ఒడంబడిక చేశాడు. సమాజంలో ప్రజానాయకులు వాళ్ళకు ప్రమాణం చేశారు.
16 వాళ్ళతో ఒడంబడిక చేసిన మూడు రోజులకు వాళ్ళు పొరుగు ప్రదేశంవాళ్ళే అనీ తమ దగ్గరే నివసించేవాళ్ళనీ ఇస్రాయేల్‌ప్రజలకు వినవచ్చింది. 17 ఇస్రాయేల్‌ప్రజలు ప్రయాణమై మూడో రోజున వాళ్ళ పట్టణాలు చేరారు. గిబియోను, కెఫీరా, బెయోరోత్, కిర్యత్‌యారీం అనేవి వాళ్ళ పట్టణాలు. 18 ఇస్రాయేల్‌ప్రజల సమాజ నాయకులు ఇస్రాయేల్‌యొక్క దేవుడైన యెహోవా పేర వాళ్ళకు ప్రమాణం చేశారు గనుక ఇస్రాయేల్‌ప్రజలు ఆ పట్టణాలవాళ్ళను చంపలేదు. కానీ సమాజమంతా నాయకులమీద సణుగు కొన్నారు. 19 కనుక ఆ నాయకులంతా సమాజమంతటితో ఇలా చెప్పారు: “ఇస్రాయేల్ యొక్క దేవుడైన యెహోవామీద మేము వాళ్ళకు ప్రమాణం చేశాం. అందుచేత మేము వాళ్ళను తాకడానికి వీలు లేదు. 20 మనం వాళ్ళకు ఇలా చేద్దాం– మేము వాళ్ళకు చేసిన ప్రమాణంవల్ల మనమీదికి దైవోగ్రత రాకుండా ఉండేలా వాళ్లను బ్రతకనిద్దాం.” 21 ఆ నాయకులు వారితో ఇంకా అన్నారు, “వాళ్ళను బ్రతకనివ్వండి. వాళ్ళు సమాజ మంతటికీ కట్టెలు కొట్టేవాళ్ళుగా, నీళ్ళు తెచ్చేవాళ్ళుగా ఉంటారు.” నాయకులు చెప్పిన ప్రకారం వారు చేశారు.
22 యెహోషువ ఆ గిబియోనువాళ్ళను పిలిపించి వాళ్ళతో ఇలా అన్నాడు: “మీరు మా దగ్గరే నివసిస్తూ ‘మేము చాలా దూరంగా ఉండేవాళ్ళమ’ని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? 23 కాబట్టి మీరు ఇప్పుడు శాపం క్రింద ఉన్నారు. మీరు నా దేవుని నివాసానికి కట్టెలు కొట్టేవాళ్ళుగా, నీళ్ళు తెచ్చే వాళ్ళుగా ఉంటారు. ఈ దాసత్వంనుంచి మీరు ఎన్నడూ విముక్తి కారు.”
24 వాళ్ళు యెహోషువకు ఇలా జవాబిచ్చారు: “తన సేవకుడు మోషే ఈ దేశాన్నంతా మీకివ్వాలనీ ఈ దేశవాసు లందరినీ మీ ఎదుట నాశనం చేయాలనీ మీ దేవుడు యెహోవా ఆయనకాజ్ఞాపించిన సంగతి మీదాసులైన మాకు ఖచ్చితంగా తెలిసింది. దానితో మీ వల్ల మా ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి మేమిలా చేశాం. 25 ఇక ఇదిగో! మేము మీ చేతులలో ఉన్నాం. మీరు ఏది మంచి, ఏది ధర్మం అనుకొంటే ఆ విధంగా మాకు చెయ్యండి.”
26 ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళను చంపకుండా యెహోషువ చేసి ప్రజల చేతిలోనుంచి వాళ్ళను విడిపించాడు. 27 అయితే సమాజానికీ యెహోవా బలిపీఠానికీ యెహోవా నిర్ణయించిన చోట కట్టెలు కొట్టేవారుగా నీళ్ళు తోడేవారుగా యెహోషువ వాళ్ళను ఆ రోజు నియమించాడు. ఈనాటికీ వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు.