8
1 యెహోవా అప్పుడు యెహోషువతో ఇలా అన్నాడు: “భయపడకు, హడలిపోకు✽. సైనికులందరినీ✽ నీతో తీసుకొని లేచి హాయీమీద దండెత్తు. నేను హాయీ రాజునూ అతడి జనాన్నీ ఊరినీ ప్రాంతాన్నీ నీకు స్వాధీనం చేశాను. 2 ✽యెరికోనూ దాని రాజునూ నీవు ఏ విధంగా చేశావో అలాగే హాయీనీ దాని రాజునూ చేయాలి. కాని ఆ ఊరి పశువులనూ సొమ్మునూ మీకోసం దోచుకోవచ్చు. ఊరి వెనుక మాటు పెట్టు.”3 కనుక యెహోషువ సైనికులంతా హాయీమీదికి వెళ్ళడానికి బయలు దేరారు. ముప్ఫయి వేలమంది పరాక్రమ వంతులను యెహోషువ ఎన్నుకొని రాత్రివేళ వారిని పంపిస్తూ వారికిలా ఆజ్ఞాపించాడు:
4 “మీరు ఊరికి వెనుక పొంచి ఉండాలి. ఊరికి బాగా దూరంగా పోవద్దు సుమా! మీరంతా సిద్ధంగా మాత్రం ఉండండి. 5 నేనూ నాతో ఉన్నవారంతా ఊరి దగ్గరికి వస్తాం. ఆ ఊరివాళ్ళు మాకెదురుగా వచ్చినప్పుడు మునుపటిలాగే మేము పారిపోతాం✽. 6 ‘మునుపు పారిపోయినట్టు పారిపోతున్నారు’ అనుకొని వాళ్ళు మా వెంటపడతారు. ఆ విధంగా మేము వాళ్ళ ఎదుటనుంచి పారిపోతూ వాళ్ళు ఊరి దగ్గర నుంచి వచ్చేలా చేస్తాం. 7 అప్పుడు మీరు మాటునుంచి బయటికి వచ్చి ఊరిని పట్టుకోవాలి. మీ దేవుడు యెహోవా ఆ ఊరిని మీ వశం చేస్తాడు. 8 ✝ఊరిని పట్టుకొన్న తరువాత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దానికి మీరు అగ్ని పెట్టాలి. చూడండి ఇది నా ఆజ్ఞ.”
9 యెహోషువ వారిని పంపించాడు. వారు వెళ్ళి బేతేల్‌కు హాయీకి మధ్య హాయీకి పడమటి వైపున మాటు వేశారు. యెహోషువ మాత్రం శిబిరంలో ఆ రాత్రి గడిపాడు.
10 యెహోషువ పెందలకడ లేచి ప్రజలను సమకూర్చి ఇస్రాయేల్ ప్రజల పెద్దలతోపాటు ప్రజలముందు నడుస్తూ హాయీమీదికి వెళ్ళాడు. 11 అతనితో వస్తున్న సైనికులంతా వెళ్ళి హాయిదగ్గరికి చేరి దానికి ఉత్తర దిక్కుగా దిగారు. హాయీకి వారికీ మధ్య లోయ ఉంది. 12 ✽అప్పుడతడు అయిదు వేలమందిని ఎన్నుకొని బేతేల్‌కూ హాయీకీ మధ్య ఊరికి పడమటివైపు మాటుంచాడు. 13 ఈ విధంగా ఊరికి ఉత్తరంగా జనాన్ని, పడమర మాటున సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి యెహోషువ ఆ లోయ మధ్యభాగానికి వెళ్ళాడు. 14 హాయీరాజు అది చూచినప్పుడు అతడూ ఆ ఊరివాళ్ళంతా తెల్లవారగానే తొందరగా లేచి మైదానం ఎదుట తాము నిర్ణయించుకొన్న స్థలంలో ఇస్రాయేల్ ప్రజతో యుద్ధం చేయడానికి ఊరి బయటికి వచ్చారు. అయితే ఊరి వెనుక తనను పట్టుకోవడానికి కొంతమంది మాటున పొంచి ఉన్నారని రాజుకు తెలియదు. 15 యెహోషువ, ఇస్రాయేల్ ప్రజలంతా వాళ్ళ వల్ల ఓడిపోయినట్టు నటించి ఎడారి త్రోవను పారి పోయారు. 16 వారిని తరమడానికి హాయీ వాళ్ళందరినీ వాళ్ళ నాయకులు పిలిపించారు. వాళ్ళు యెహోషువ వెంటపడుతూ ఊరికి దూరమయ్యారు. 17 ఇస్రాయేల్ ప్రజలను తరమడానికి రానివారు ఒక్కడూ హాయీలో గానీ బేతేల్‌లో గానీ మిగలలేదు. వాళ్ళు ఊరిని బట్టబయలుగా వదిలివేసి ఇస్రాయేల్ ప్రజల వెంటపడ్డారు.
18 ✝అప్పుడు యెహోవా “నీ చేతిలో ఉన్న ఈటెను హాయీ వైపు చాపు. ఆ ఊరిని నీ చేతికిస్తాను” అని యెహోషువతో చెప్పాడు. యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఊరివైపు చాపాడు. 19 మాటున ఉన్నవారు త్వరగా తమ స్థలంలోనుంచి బయటికి వచ్చారు. యెహోషువ చెయ్యి చాపి చాపడంతోనే వారు పరుగెత్తి ఊరిలో చొరబడి దానిని వశం చేసుకొని త్వరత్వరగా దానికి నిప్పంటించారు. 20 హాయీవాళ్ళు వెనక్కు చూచేటప్పటికీ ఊరిలోనుంచి పొగ ఆకాశంవరకు లేస్తూ ఉండడం వాళ్ళకు కన్పించింది. ఇంతలో ఎడారివైపు పారిపోతూ ఉన్నవారు తరిమేవాళ్ళ వైపు తిరిగి వాళ్ళ పై పడ్డారు. గనుక హాయీవాళ్ళకు ఇటు గానీ అటు గానీ పరుగెత్తడానికి అవకాశం లేకపోయింది. 21 మాటున పొంచినవారు ఊరిని వశం చేసుకోవడం, ఊరినుంచి పొగపైకి లేవడం యెహోషువ, ఇస్రాయేల్ వారంతా చూచి హాయీవాళ్ళ వైపుకు తిరిగి వాళ్ళను కూల్చారు. 22 ఈ లోగా ఊరిలో ఉన్న ఇస్రాయేల్ వారు కూడా వాళ్ళతో పోరాడడానికి బయటికి వచ్చారు. కాబట్టి ఇస్రాయేల్‌వారు కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు ఉండడంచేత ఇస్రాయేల్‌వారి మధ్య హాయీవాళ్ళు చిక్కుపడ్డారు. వాళ్ళలో బ్రతికి బయటపడ్డ వాడంటూ ఎవ్వరూ లేకుండా వారు వాళ్ళను కూల్చారు. 23 హాయీ రాజును మాత్రమే వారు ప్రాణంతో పట్టుకొని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు.
24 పొలాలలో, ఎడారి ప్రాంతంలో తమ్మును తరిమిన హాయీ కాపురస్థులందరినీ ఇస్రాయేల్‌వారు చంపివేశారు – వాళ్ళంతా నాశనమయ్యేవరకు వాళ్ళు ఖడ్గం పాలయ్యారు. ఆ తరువాత ఇస్రాయేల్‌వారంతా హాయీకి తిరిగి వచ్చి ఖడ్గంతో దానిని నాశనం చేశారు. 25 ఆరోజు హాయీ జనమంతా చచ్చారు. చచ్చిన స్త్రీపురుషులు పన్నెండు వేలమంది. 26 హాయీ కాపురస్థులంతా పూర్తిగా నాశనమయ్యేవరకు యెహోషువ ఈటెను, చాపిన చెయ్యి ముడుచుకోలేదు. 27 యెహోవా యెహోషువకు జారీచేసిన ఆజ్ఞ ప్రకారం ఆ ఊరి పశువులను, దోపుడు సొమ్మును మాత్రమే ఇస్రాయేల్‌ప్రజలు సొంతానికి ఉంచుకొన్నారు. 28 యెహోషువ హాయీని కాల్చివేసి అది ఎల్లకాలం పాడుదిబ్బగా ఉండేలా చేశాడు. ఈనాటికి అది అలాగే ఉంది. 29 ✝యెహోషువ హాయీ రాజును ఒక చెట్టుకు ఉరితీశాడు. సాయంత్రంవరకు ఆ రాజు దానికి వ్రేలాడుతూ ఉన్నాడు. ప్రొద్దు క్రుంకేటప్పుడు యెహోషువ ఆజ్ఞ జారీ చేశాడు. వారు వాడి శవాన్ని చెట్టుమీద నుంచి దించి ఊరిలోకి ప్రవేశించే ద్వారం దగ్గర పారవేసి ఆ శవం పై పెద్ద రాళ్ళ కుప్ప వేశారు. అది ఈనాటికి అక్కడే ఉంది.
30 ✽ అప్పుడు యెహోషువ ఏబాల్ పర్వతం✽మీద ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. 31 ✝ఇస్రాయేల్ ప్రజకు యెహోవా సేవకుడు అయిన మోషే ఆజ్ఞాపించినట్టే మోషే ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాసి ఉన్నట్టే ఏ మనిషీ ఇనుప పనిముట్టుతో తాకని, మలచని రాళ్ళతోనే ఆ బలిపీఠం కట్టాడు. దానిమీద వారు యెహోవాకు హోమ బలులూ శాంతిబలులూ అర్పించారు. 32 ఇస్రాయేల్ ప్రజల సమక్షంలో మోషే వ్రాసిన ధర్మశాస్త్రం ప్రతిని యెహోషువ ఆ రాళ్ళమీద వ్రాశాడు. 33 ✽యెహోవా ఒడంబడికపెట్టెను మోసే లేవీగోత్రికులైన యాజుల ముందు ఇస్రాయేల్ ప్రజలంతా వారి పెద్దలూ నాయకులూ న్యాయాధిపతులూ ఆ పెట్టెకు ఈ ప్రక్కన, ఆ ప్రక్కన నిలబడ్డారు. వారితో పాటు వారి మధ్య ఉన్న పరదేశులు✽ కూడా అలా నిలబడ్డారు. ప్రజలలో సగంమంది గెరిజీం పర్వతం ఎదురుగా, సగంమంది ఏబాల్ పర్వతం ఎదురుగా నిలబడ్డారు. ఇస్రాయేల్‌ప్రజ ఆశీర్వాదం పొందడానికి వారు అలా నిలబడాలని అంతకుముందే మోషే ఆజ్ఞాపించాడు. 34 ఆ తరువాత యెహోషువ ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాసి ఉన్నప్రకారం – ఆశీర్వచనాలనూ శాపవచనాలనూ – ధర్మశాస్త్ర వాక్కులన్నీ చదివి వినిపించాడు. 35 వారితోపాటు స్త్రీలూ పిల్లలూ వారి మధ్య ఉంటున్న పరదేశస్థులూ నిలబడి ఉంటే ఇస్రాయేల్‌ప్రజా సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించినవాటిలో యెహోషువ వినిపించకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు.