7
1 శాపానికి గురి అయిన వస్తువుల విషయంలో ఇస్రాయేల్‌ ప్రజలు అపరాధం చేశారు. ఆకాను ఆ వస్తువులలో కొన్ని తీసుకొన్నాడు. అతడు యూదా గోత్రికుడు, జీరా మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మి కొడుకు. ఇస్రాయేల్ ప్రజల పై యెహోవా కోపాగ్ని రగులుకొంది.
2 యెహోషువ యెరికోనుంచి హాయీకి మనుషులను పంపిస్తూ “వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూచిరండి” అన్నాడు.
హాయీ బేత్‌ఆవెనుకు దగ్గరగా బేతేల్‌కు తూర్పుగా ఉంది. వారు వెళ్ళి హాయీని చూశారు. 3 తిరిగి వచ్చి యెహోషువతో ఇలా చెప్పారు: “ప్రజలందరినీ అక్కడికి వెళ్ళనియ్యకండి. రెండు మూడు వేలమంది వెళితే చాలు. హాయీని పట్టుకోవచ్చు. ఆ ఊరివాళ్ళు కొద్దిమందే గనుక ప్రజలంతా అక్కడ కష్టపడేలా చేయకండి.”
4 అందుచేత ప్రజలలో సుమారు మూడు వేలమంది అక్కడికి వెళ్ళారు. కానీ వారు హాయీవాళ్ళ ఎదుటనుంచి పారిపోయారు. 5 అంతే గాక హాయీవాళ్ళు వారిలో ముప్ఫై ఆరుగురిని కూలగొట్టారు. ఊరి ద్వారం దగ్గర నుంచి షెబారిం వరకు వారిని తరిమి మోరాదులోవారిని కూల్చారు. కాబట్టి ప్రజలకు ధైర్యం లేకుండా పోయింది. వారి గుండెలు నీరుగారిపోయాయి.
6 యెహోషువ తన బట్టలు చింపుకొని యెహోవా పెట్టె ముందు సాయంత్రంవరకు సాష్టాంగపడి ఉన్నాడు. అతడూ ఇస్రాయేల్ ప్రజల పెద్దలూ అలా చేశారు. తమ తలలమీద దుమ్ము పోసుకొన్నారు. 7  యెహోషువ ఇలా అన్నాడు: “అయ్యో, ప్రభూ! యెహోవా! ఈ ప్రజను యొర్దానును ఎందుకు దాటించావు! మమ్ములను నాశనం చేసేలా అమోరీవాళ్ళ చేతికి అప్పగించడానికేనా? మేము యొర్దాను అవతల ఆగిపోవడానికి నిర్ణయం చేసుకొని ఉంటే ఎంత బాగుండేది! 8 ఇస్రాయేల్ ప్రజ శత్రువులకు వెన్ను చూపిస్తూ ఉంటే, ప్రభూ! నేనేమి చెప్పాలి? 9 కనానువాళ్ళు, ఈ దేశవాసులంతా ఈ సంగతి విని మమ్మల్ని చుట్టుముట్టి భూమిమీద మా పేరు లేకుండా కొట్టివేస్తారు. నీ ఘనమైన పేరుకోసం నీవేమి చేస్తావు?”
10 యెహోషువతో యెహోవా ఇలా అన్నాడు. “లే! ఎందుకలా సాష్టాంగపడి ఉన్నావు? 11 ఇస్రాయేల్ ప్రజలు పాపం చేశారు. నేను వారికి నిర్ణయించిన నా ఒడంబడికను మీరారు. శాపానికి గురి అయిన వస్తువులు కొన్ని తెచ్చు కొన్నారు. వారు దొంగిలించి కపటంగా ప్రవర్తించి వాటిని వారి సొంత సామానులో ఉంచారు. 12 అందుచేతనే శత్రువుల ఎదుట ఇస్రాయేల్ ప్రజలు నిలబడలేకపోతున్నారు. వారు శాపానికి గురి కావడంవల్లే శత్రువులకు వెన్నిచ్చి పారిపోతున్నారు. శాపానికి గురి అయిన ఆ వస్తువులు వారి మధ్య లేకుండా చేయాలి. లేకపోతే ఇప్పటినుంచి నేను మీతో ఉండను. 13 లే! ప్రజను పవిత్రపరచు. వారితో ఇలా చెప్పు: ‘రేపటికి మిమ్ములను పవిత్రం చేసుకోండి. ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే ఇస్రాయేల్ ప్రజలారా! మీలో శాపానికి గురి అయిన సొమ్ము ఉంది. మీరు మీ మధ్యనుంచి దానిని తీసివేసేవరకూ మీరు మీ శత్రువుల ముందు నిలబడలేరు. 14 రేపు ప్రొద్దున మీరంతా గోత్రాలుగా ఇక్కడ హాజరు కావాలి. అప్పుడు యెహోవా ఎన్నుకొనే గోత్రం, వారి వంశాలుగా ముందుకు రావాలి. యెహోవా ఎన్నుకొనే వంశం, కుటుంబాలుగా దగ్గరకు రావాలి. యెహోవా ఎన్నుకొనే వారి కుటుంబం ఒక్కొక్క మనిషి రావాలి. 15 శాపానికి గురి అయిన ఆ వస్తువులు ఏ మనిషిదగ్గర కనిపిస్తాయో వాణ్ణి పట్టుకొని వాణ్ణీ వాడిదంతా కాల్చివేయాలి. వాడు యెహోవా ఒడంబడికను మీరాడు, ఇస్రాయేల్ ప్రజల మధ్య మూర్ఖమైన చెడ్డ పని చేశాడు.”
16 యెహోషువ పెందలకడ లేచి ఇస్రాయేల్ ప్రజను వారి వారి గోత్రాలప్రకారం రప్పించాడు. వారిలో యూదాగోత్రం దొరికింది. 17 అతడు యూదా వంశాలను దగ్గరికి రప్పించాడు. జెరహువారి వంశం దొరికింది. జెరహు వంశీయులను ఒక్కొక్కరిని అతడు రప్పించాడు. అప్పుడు జబ్ది దొరికాడు. 18 యెహోషువ జబ్ది కుటుంబంవారిని ఒక్కొక్కరిని దగ్గరికి రప్పించాడు. ఆకాను దొరికాడు. వాడు యూదా గోత్రికుడు, జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మి కొడుకు. 19 యెహోషువ అప్పుడు ఆకానును చూచి “నా కుమారుడా, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు మహిమ కలిగించు. ఆయన దగ్గర ఒప్పుకో. నీవేం చేశావో నాతో చెప్పు. అది దాచకు” అన్నాడు.
20 అప్పుడు ఆకాను యెహోషువతో “నిజంగా నేను ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాను. 21 దోపిడిలో షీనార్ దేశం చక్కని వస్త్రమొకటి, రెండు వందల తులాల వెండి, యాభై తులాల బరువుగల బంగారు కడ్డీ నాకు కనిపించాయి. వాటిని ఆశపడి తెచ్చుకొన్నాను. అదిగో నా డేరా మధ్య భూమిలో కప్పి పెట్టాను. ఆ వెండి అన్నిటి క్రింద ఉంది” అన్నాడు.
22 యెహోషువ ఆ డేరాకు మనుషులను పంపించాడు. వారు పరుగెత్తి వెళ్ళి డేరాలో అదంతా కప్పి పెట్టి ఉండడం చూశారు. దానిక్రింద ఆ వెండి ఉంది. 23 ఆ డేరా మధ్యనుంచి వారు వాటిని తీసి యెహోషువ దగ్గరికీ ఇస్రాయేల్ ప్రజలందరి దగ్గరకూ తెచ్చి యెహోవా సన్నిధానంలో వాటిని పెట్టారు. 24 అప్పుడు యెహోషువ అతడితోపాటు ఇస్రాయేల్ ప్రజలంతా జెరహు వంశస్థుడైన ఆకానునూ ఆ వెండినీ ఆ వస్త్రాన్నీ ఆ బంగారు కడ్డీనీ ఆకాను కొడుకులనూ కూతుళ్ళనూ అతడి ఎద్దులనూ గాడిదలనూ గొర్రెలనూ అతడి డేరానూ అతడికున్న సమస్తాన్నీ పట్టుకొని ఆకోరు లోయకు తెచ్చారు.
25 అక్కడ యెహోషువ “నీవు మమ్మల్ని ఎందుకిలా బాధపెట్టావు? ఈ వేళ నిన్ను యెహోవా బాధిస్తాడు” అన్నాడు. అప్పుడు ఇస్రాయేల్ ప్రజలంతా ఆకానును రాళ్ళు రువ్వి చంపారు. అంతేగాక రాళ్ళు రువ్వి అతడి వాళ్ళను చంపి అతణ్ణీ వారినీ అతడికి చెందినదాన్నంతటినీ కాల్చి వేశారు. 26 అతడిమీద పెద్ద రాళ్ళ కుప్ప వేశారు (అది ఈ నాటికీ ఉంది). అప్పుడు యెహోవా తీవ్రమైన కోపాగ్ని చల్లారింది. ఈనాటికి ఆ స్థలాన్ని “ఆకోరు లోయ” అంటారు.