6
1 ఇక యెరికో పట్టణం ఇస్రాయేల్ ప్రజ కారణంగా మూతపడింది. ఎవరూ బయటికి రావడం లేదు, లోనికి వెళ్ళడం లేదు. 2 యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: “చూడు! యెరికోనూ దాని రాజునూ దానిలో ఉన్న మహా యోధులతోకూడా నీకు స్వాధీనం చేశాను. 3 సైనికులైన మీరంతా పట్టణంచుట్టూ తిరగాలి. ఒకసారి ప్రదక్షిణం చేయాలి. ఈ విధంగా మీరు ఆరు రోజులు చేయాలి. 4 ఒడంబడిక పెట్టె ముందు ఏడుగురు యాజులు ఏడు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని మీతో వెళ్ళాలి. ఏడో రోజున పట్టణం చుట్టు ఏడు సార్లు తిరగాలి. అప్పుడు యాజులు బూరలు ఊదాలి. 5 వారు పొట్టేలు కొమ్ము బూరలు దీర్ఘంగా ఊదడం మీరు విన్నప్పుడు ప్రజలంతా పెద్దగా కేకలు వేయాలి. అప్పుడు పట్టణం గోడ నేల కూలిపోతుంది. జనం ఎవరికి ఎదురుగా వారు పట్టణంలోకి నేరుగా వెళ్ళాలి.”
6 నూను కొడుకైన యెహోషువ యాజులను పిలిచి “ఒడంబడికపెట్టెను ఎత్తుకోండి. యెహోవా పెట్టె ముందు ఏడుగురు యాజులు ఏడు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని నడవండి” అన్నాడు.
7 అతడు ప్రజతో “ముందుకు పదండి. పట్టణం చుట్టు వెళ్ళండి. ఆయుధాలున్నవారు యెహోవాపెట్టె ముందు నడవండి” అన్నాడు.
8 యెహోషువ ప్రజలతో ఈ విధంగా చెప్పాక యెహోవా సన్నిధానంలో ఏడు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొన్న ఆ ఏడుగురు యాజులు ముందుకు సాగుతూ ఆ బూరలు ఊదారు. వారి వెనకాల యెహోవా ఒడంబడికపెట్టె వెళ్ళింది. 9 బూరలు ఊదే యాజులముందు ఆయుధాలు పట్టుకొన్నవారు నడిచారు. యాజులు నడుస్తూ బూరలు ఊదుతూ ఉంటే సైన్యంలో మిగతావారు పెట్టె వెనుక నడుస్తూ ఉన్నారు. 10 అంతకుముందు యెహోషువ ప్రజలకు ఇలా ఆజ్ఞ జారీ చేశాడు:
“నేను మిమ్ములను కేకలు వేయండని ఆజ్ఞాపించే రోజువరకు మీరు కేకలు వేయవద్దు. మీ స్వరం ఏమాత్రం వినబడకూడదు. మీ నోటినుంచి ఒక్క మాట కూడా రాకూడదు. నేను కేకలు వేయమన్నప్పుడే మీరు కేకలు వేయాలి”.
11 ఆ విధంగా యెహోవాపెట్టె పట్టణం చుట్టూ ఒక్కసారి వెళ్ళేట్టు చేశాడు. ఆ తరువాత వారు శిబిరానికి వచ్చి అక్కడ రాత్రి గడిపారు.
12 మరుసటి ప్రొద్దున యెహోషువ పెందలకడ లేచాడు. యెహోవాపెట్టెను యాజులు ఎత్తుకొన్నారు. 13 ఏడు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొన్న ఆ ఏడుగురు యాజులు యెహోవాపెట్టె ముందు నడుస్తూ బూరలూదుతూ ఉన్నారు. వారి ముందు ఆయుధాలు ఉన్నవారు నడుస్తూ ఉన్నారు. యాజులు బూరలు ఊదుతూ ఉంటే పెట్టె వెనుక సైన్యంలో మిగతావారు నడుస్తూ ఉన్నారు. 14 రెండో రోజు కూడా వారు పట్టణం చుట్టు ఒక్క సారి తిరిగి, శిబిరానికి మళ్ళీ వచ్చారు. ఈ విధంగా ఆరు రోజులు చేశారు. 15 ఏడో రోజున తెల్లవారగానే లేచి అదేవిధంగా ఏడుసార్లు ఆ పట్టణం చుట్టు వెళ్ళారు. ఆ రోజు మాత్రమే పట్టణాన్ని ఏడు సార్లు ప్రదక్షిణం చేశారు. 16 ఏడో సారి చేశాక యాజులు బూరలూదినప్పుడు యెహోషువ ప్రజలతో అన్నాడు: “ఇక కేకలు పెట్టండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకిచ్చాడు. 17 అయితే పట్టణాన్ని దానిలో ఉన్నదాన్నంతా యెహోవా శపించాడు. మనం పంపించినవారిని రాహాబు అనే వేశ్య దాచింది గనుక ఆమె, ఆమెతోపాటు ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళంతా మాత్రమే బ్రతుకుతారు. 18 శాపానికి గురి అయిన వస్తువులకు మీరు తప్పక దూరంగా ఉండాలి. అలా గాక, శాపానికి గురి అయిన దేనినైనా మీరు తీసుకొంటే మీకు శాపం తగులుతుంది జాగ్రత్త! ఇస్రాయేల్ ప్రజల శిబిరాన్ని కూడా శాపానికి గురి చేసి దానిమీదికి ఆపద తెచ్చినవారవుతారు సుమా! 19 వెండి బంగారాలూ, కంచు ఇనుప పాత్రలూ యెహోవాకు ప్రతిష్ఠం అవుతాయి. అవి యెహోవా ధనాగారం లోకి రావాలి”.
20 ప్రజలు కేకలు వేశారు, యాజులు బూరలూదారు. ప్రజలు బూరధ్వని విని పెద్దగా కేకలు వేయడంతోనే గోడ కుప్పగా కూలిపోయింది. ప్రజ ఎవరికి ఎదురుగా వారంతా సూటిగా పట్టణంలో ప్రవేశించి పట్టణాన్ని స్వాధీనం చేసు కొన్నారు. 21  పట్టణంలో ఉన్న యావత్తూ మగవారినీ ఆడవారినీ యువతీ యువకులనూ ముసలివారినీ ఎద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఖడ్గంతో నాశనం చేశారు. 22 కానీ ఆ దేశాన్ని వేగు చూచి వచ్చిన ఆ ఇద్దరు గూఢచారులతో యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళండి. మీరు ఆమెకు ప్రమాణం చేసినట్టే ఆమెనూ ఆమెకున్న వారందరినీ బయటికి తీసుకురండి” అన్నాడు.
23 గూఢచారులుగా పని చేసిన ఆ యువకులు అలాగే వెళ్ళి రాహాబునూ ఆమె తండ్రినీ తల్లినీ అన్నదమ్ములనూ ఆమెకున్న వారందరినీ బయటికీ తీసుకువచ్చారు. ఆమె బంధువులందరినీ వారు అలా బయటికి తీసుకువచ్చి ఇస్రాయేల్ శిబిరం బయట ఉంచారు. 24 ఆ తరువాత ప్రజ ఆ పట్టణాన్నీ దానిలో ఉన్నదాన్నంతా కాల్చివేశారు. వెండి బంగారాలనూ కంచు ఇనుప పాత్రలనూ మాత్రం వారు యెహోవా నివాసంలోని ధనాగారంలో పెట్టారు. 25 వేశ్య అయిన రాహాబునూ ఆమె పుట్టింటివారినీ ఆమెకున్న వారందరినీ బ్రతికి ఉండేలా యెహోషువ రక్షించాడు. యెరికోను చూడడానికి యెహోషువ పంపిన గూఢచారులను ఆమె దాచింది గనుక ఆమె ఈనాటికీ ఇస్రాయేల్ ప్రజల్లో నివాసం చేస్తూ ఉంది.
26 ఆ సమయంలో యెహోషువ ప్రజలచేత ఇలా శపథం చేయించాడు: “యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించడానికి ఎవడు పూనుకొంటాడో వాడిమీదికి యెహోవా శాపం వస్తుంది గాక! దాని పునాది వేసే వాడి పెద్ద కొడుకు చస్తాడు. దాని ద్వారబంధాలు నిలబెట్టేవాడి కనిష్ఠుడు చస్తాడు.”
27 ఈ విధంగా యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది.