5
1 యెహోవా యొర్దాను నీళ్ళను మేము దాటే వరకు ఇస్రాయేల్ ప్రజల ముందు ఎండిపోయేలా చేశాడని యొర్దానుకు ఆవల పడమటి దిక్కుగా ఉన్న అమోరీవాళ్ళ రాజులందరూ సముద్ర తీరాన ఉన్న కనానువాళ్ళ రాజులందరూ విన్నారు. వాళ్ళ గుండెలు నీరైపోయాయి. ఇస్రాయేల్ ప్రజల రాకడ కారణంగా వాళ్ళకు ధైర్యం లేకుండా పోయింది.
2  ఆ సమయంలో యెహోవా యెహోషువతో “చెకుముకి రాతి కత్తులు చేయించి ఇస్రాయేల్‌ప్రజలకు మళ్ళీ సున్నతి చేయించు” అన్నాడు. 3 గనుక యెహోషువ చెకుముకి రాతి కత్తులు చేయించి గిబియత్ హారాలోత్ దగ్గర ఇస్రాయేల్ ప్రజలకు సున్నతి చేయించాడు. 4 యెహోషువ వారికి సున్నతి చేయించడానికి కారణం ఏమిటంటే ఈజిప్ట్‌నుంచి బయటికి వచ్చిన ప్రజలలో మగవారంతా, ఆ యుద్ధసన్నద్ధు లంతా, ఈజిప్ట్‌నుంచి వచ్చాక ఎడారి త్రోవలోనే చనిపోయారు. 5 అలా బయటికి వచ్చిన వారంతా ఇంతకుముందు సున్నతి పొందినవారే గాని ఈజిప్ట్‌నుంచి ఇవతలకు వచ్చాక ఎడారి త్రోవలో పుట్టినవారిలో ఎవ్వడూ సున్నతి పొందలేదు. 6 ఇస్రాయేల్‌ప్రజలు యెహోవా వాక్కు పెడచెవిని పెట్టారు. గనుకనే ఈజిప్ట్‌నుంచి బయటికి వచ్చిన యుద్ధ సన్నద్ధులంతా సర్వనాశనం అయ్యేవరకు ఇస్రాయేల్‌ప్రజలు నలభై ఏళ్ళు ఎడారిలో తిరుగాడారు. మనకిస్తానని యెహోవా వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని, పాలు తేనెలు నదులై పారుతున్న ఈ దేశాన్ని, వారికి చూపించనని శపథం చేశాడు. 7 వారికి బదులుగా యెహోవా ఎన్నుకొన్న వారి కొడుకులకు యెహోషువ సున్నతి చేయించాడు. దారిలో వారికి ఎవ్వరూ సున్నతి చేయలేదు గనుక వారు సున్నతి లేనివారే. 8 వారంతా సున్నతి పొందాక వారందరికీ మానేవరకు వారు శిబిరంలో తమ తమ చోట్లలో ఉండిపోయారు.
9 అప్పుడు యెహోవా యెహోషువతో “ఈ రోజు మీనుంచి ఈజిప్ట్ నిందను తీసివేశాను” అన్నాడు. అందుకని ఈనాటి వరకు ఆ స్థలాన్ని గిల్గాల్ అంటారు.
10 ఇస్రాయేల్‌ప్రజ గిల్గాల్‌లో డేరాలు వేసుకొని యెరికో మైదానాలమీద ఆ నెల పద్నాలుగో రోజున సాయంకాల సమయాన పస్కా పండుగ ఆచరించారు. 11 పస్కాపండుగ అయిన మరుసటి రోజే ఆ దేశం పాత పంట తిన్నారు. పొంగని రొట్టెలు, కాల్చిన కంకులు తిన్నారు. 12 ఆ దేశం పాత పంట వారు తిన్న మరుసటి రోజే మన్నా ఆగిపోయింది. ఆ తరువాత ఎప్పుడూ ఇస్రాయేల్ ప్రజకు మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశం పంటనే తిన్నారు.
13 యెహోషువ యెరికోదగ్గర ఉన్నప్పుడు అతడు తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు కత్తి దూసి చేతపట్టుకొని ఉన్నాడు. యెహోషువ ఆయన దగ్గరికి వచ్చి, “మీరు మా పక్షంవారా? మా శత్రువుల పక్షంవారా?” అని అడిగాడు.
14 “అలా కాదు, యెహోవా సైన్యానికి అధిపతిగా నేనిప్పుడు వచ్చాను” అని ఆయన జవాబిచ్చాడు. యెహోషువ నేలకు సాష్టాంగపడి ఆయనను ఆరాధించి “ప్రభూ! తమ దాసుడైన నాకు ఇచ్చే ఆదేశమేమిటి?” అని అడిగాడు.
15 యెహోవా సైన్యానికి అధిపతి యెహోషువతో “నీవు నిలబడ్డ ఈ స్థలం పవిత్రం గనుక నీ కాళ్ళనుంచి చెప్పులు తీసివెయ్యి” అన్నాడు. యెహోషువ అలా చేశాడు.