4
1 ప్రజలంతా పూర్తిగా యొర్దాను దాటిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. 2 ✽ “ప్రజల్లో నుంచి గోత్రానికి ఒక్కరుగా పన్నెండుమందిని ఎన్నుకో. 3 వారికిలా ఆజ్ఞాపించు: యొర్దాను మధ్యభాగంనుంచి ఎక్కడ యాజుల పాదాలు నిలిచాయో అక్కడనుంచి మీరు పన్నెండు రాళ్ళను తీయండి. వాటిని మీతో తీసుకువెళ్ళి మీరు ఈ రాత్రి ఎక్కడ దిగుతారో అక్కడ వాటిని ఉంచండి.”4 అప్పుడు గోత్రానికి ఒకరుగా ఇస్రాయేల్ ప్రజల్లో నుంచి నిర్ణయించిన పన్నెండుమందిని యెహోషువ పిలిచి వారితో ఇలా చెప్పాడు: 5 “మీ దేవుడైన యెహోవా పెట్టెముందు మీరు యొర్దాను మధ్యకు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజల గోత్రాల లెక్క ప్రకారం ఒక్కొక్కడు భుజాలమీద ఒక రాయిని ఎత్తుకోండి. 6 ఆ రాళ్ళు ఒక గుర్తుగా మీ మధ్య ఉంటాయి. ‘ఆ రాళ్ళు ఏమిటి?’ అని మీ సంతానం రాబోయే కాలంలో అడిగితే 7 మీరు వారికిలా చెప్పాలి: ‘యెహోవా ఒడంబడిక పెట్టెముందు యొర్దాను నీళ్ళు పారడం ఆగిపోయాయి. ఆ పెట్టె యొర్దాను దాటినప్పుడు యొర్దాను నీళ్ళు పారడం ఆగిపోయాయి’. ఈ రాళ్ళు ఇస్రాయేల్ ప్రజకు ఒక స్మృతిచిహ్నంగా ఎప్పటికీ ఉంటాయి.”
8 యెహోషువ ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజ చేశారు. యెహోవా యెహోషువకు చెప్పినట్టే ఇస్రాయేల్ ప్రజల గోత్రాల లెక్కప్రకారం యొర్దాను మధ్యనుంచి పన్నెండు రాళ్ళు తీసి తాము మకాం వేసిన చోటికి మోసుకువచ్చి అక్కడ ఉంచారు. 9 ఒడంబడికపెట్టెను మోసిన యాజుల పాదాలు ఎక్కడ మోపారో అక్కడ యొర్దాను మధ్యలో యెహోషువ పన్నెండు రాళ్ళు నిలబెట్టాడు. అవి ఈ నాటికి అక్కడే ఉన్నాయి. 10 యెహోషువకు మోషే ఆజ్ఞాపించిన ప్రకారం ప్రజలతో చెప్పుమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన దంతా ముగిసేవరకు పెట్టెను మోసే యాజులు యొర్దాను మధ్య నిలబడ్డారు. ప్రజలు తొందర తొందరగా నదిని దాటి పోయారు. 11 ప్రజలంతా దాటిన తరువాత వారు చూస్తూ ఉంటే యెహోవా పెట్టెను మోసే యాజులు దాటారు. 12 ✝రూబేను గోత్రికులూ గాదు గోత్రికులూ మనష్షే అర్ధ గోత్రంవారూ మోషే ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేల్ ప్రజల ముందు యుద్ధానికి సంసిద్ధులై దాటారు. 13 ✽ఆయుధాలతో ఉన్న సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా సమక్షంలో దాటి యెరికో మైదానాలకు యుద్ధానికి వెళ్ళారు. 14 ✝ఆ రోజు ఇస్రాయేల్‌ప్రజలందరి సమక్షంలో యెహోవా యెహోషువను గొప్ప చేశాడు. మోషే బ్రతికిన కాలమంతా అతడికి ప్రజలు భయపడినట్టు యెహోషువకు కూడా భయపడ్డారు.
15 యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: 16 “శాసనాల పెట్టెను మోస్తున్న యాజులకు యొర్దానునుంచి పైకి రండని ఆజ్ఞాపించు.”
17 కనుక యెహోషువ “యొర్దానునుంచి పైకి రండ”ని యాజులకు ఆజ్ఞ జారీ చేశాడు. 18 యెహోవా ఒడంబడిక పెట్టెను మోస్తున్న యాజులు యొర్దాను మధ్యనుంచి పైకి వచ్చిన తరువాత ఆ యాజుల పాదాలు పొడి నేలకు అంటిన వెంటనే యొర్దాను నీళ్ళు మళ్ళీ మామూలుగా వచ్చాయి. అంతకు ముందులాగే నీళ్ళు గట్లపైకి పొంగి పారాయి.
19 మొదటి నెల✽ పదో రోజున ప్రజలు యొర్దానునుంచి గట్టెక్కి వచ్చారు. యెరికో తూర్పు సరిహద్దున గిల్గాల్✽లో దిగారు. 20 వారు యొర్దానునుంచి తెచ్చిన పన్నెండు రాళ్ళు యెహోషువ గిల్గాల్‌లో నిలబెట్టాడు. 21 అతడు ఇస్రాయేల్ ప్రజలతో ఇలా అన్నాడు: “రాబోయే కాలంలో మీ పిల్లలు వాళ్ళ తండ్రులను ‘ఈ రాళ్ళేమిటి?’ అని అడిగితే 22 మీరు మీ పిల్లలకు ఇలా తెలియజేయాలి: ‘ఇస్రాయేల్ ప్రజలు ఈ యొర్దానులో పొడి నేలమీద నడిచిదాటారు. 23 ✝మనం యొర్దానును దాటేవరకు మీ దేవుడు యెహోవా మన ముందు దాని నీళ్ళను ఎండి పోయేలా చేశాడు. పూర్వం మేము ఎర్ర సముద్రాన్ని దాటేవరకు మీ దేవుడు యెహోవా మా ముందు దాన్ని ఎండిపోయేలా చేశాడు గదా. అలాగే ఆయన యొర్దాన్ను కూడా చేశాడు. 24 ✽యెహోవా చెయ్యి ఎంతో బలిష్ఠమైనదని లోకస్థులంతా తెలుసుకోవాలనీ మీరు మీ దేవుడు యెహోవాపట్ల భయభక్తులు ఎప్పటికీ చూపాలనీ ఆయన అలా చేశాడు.”