3
1 మరుసటి ప్రొద్దున తెల్లవారగానే యెహోషువ లేచాడు. అతడూ ఇస్రాయేల్‌ప్రజలంతా షిత్తీంనుంచి బయలుదేరి యొర్దానుకు వచ్చారు. నదిని దాటేముందు వారు అక్కడ మకాం చేశారు. 2 మూడు రోజులయ్యాక అధికారులు శిబిరంలోకి వెళ్ళి ప్రజలకిలా ఆజ్ఞాపించారు:
3 “మీ దేవుడు యెహోవా యొక్క ఒడంబడికపెట్టెను యాజులైన లేవీవారు మోయడం మీరు చూచినప్పుడు మీరున్న చోట్లనుంచి బయలుదేరి దానివెనుక నడవాలి. 4 ఈ దారి ఇంతకుముందు మీరు వెళ్ళినది కాదు గనుక ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి మీరు అలా చేయాలి కానీ మీకూ ఆ మందసానికీ మధ్య సుమారు మూడు వేల అడుగుల ఎడముండాలి. దానిదగ్గరికి మాత్రం రాకూడదు.”
5 ప్రజతో యెహోషువ “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తాడు గనుక మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోండి” అన్నాడు.
6 యెహోవా యాజులతో “ఒడంబడిక పెట్టెను ఎత్తుకొని ప్రజల ముందు వెళ్ళండి” అన్నాడు. వారు ఒడంబడిక పెట్టెను ఎత్తుకొని ప్రజలముందు నడిచారు.
7 యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: “ఈ రోజున ఇస్రాయేల్ ప్రజల సమక్షంలో నిన్ను గొప్ప చేయడం ఆరంభిస్తాను. నేను మోషేతో ఉన్నట్టు నీతోనూ ఉంటానని అప్పుడు వారు తెలుసుకొంటారు. 8 ఒడంబడిక పెట్టెను మోసే యాజులతో ‘మీరు యొర్దాను నది నీటిదరి చేరినప్పుడు యొర్దానులో నిలబడాల’ని నీవు వారికాజ్ఞాపించాలి.”
9 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలతో యెహోషువ “మీరు ఇలా రండి. మీ దేవుడు యెహోవా వాక్కులు వినండి” అన్నాడు. 10 యెహోషువ ఇంకా అన్నాడు, “సజీవ దేవుడు మీమధ్య ఉన్నాడనీ ఆయన కనాను, హిత్తి, హివ్వి, పెరిజ్జి, గిర్గాషి, అమోరీ, యోబూసి జాతులను మీ ముందు నుంచి తప్పక తోలివేస్తాడనీ ఈ విధంగా మీరు తెలుసుకొంటారు. 11 ఇదిగో ప్రపంచమంతటికీ ప్రభువైన యెహోవా ఒడంబడిక పెట్టె మీ ముందు యొర్దానులోకి వెళ్తుంది. 12 ఇప్పుడు ఇస్రాయేల్‌కు చెందిన ప్రతి గోత్రం నుంచీ గోత్రానికి ఒక్కొక్క మనిషి చొప్పున పన్నెండుమందిని ఏర్పాటు చేయండి. 13 ప్రపంచమంతటికీ ప్రభువైన యెహోవా పెట్టెను మోసే యాజులు యొర్దాను నీళ్ళలో అడుగుపెట్టగానే యొర్దాను నీళ్ళు పారడం ఆగి పోతాయి. పైనుంచి క్రిందికి పారే నీళ్ళు రాశిలాగా నిలబడిపోతాయి.”
14 ప్రజలు వారి గుడారాల్లో నుంచి యొర్దాను దాటడానికి బయలుదేరారు. ప్రజలముందు యాజులు ఒడంబడికపెట్టెను మోస్తూ నడుస్తున్నారు. 15 పెట్టెను మోసేవారు యొర్దానుకు వచ్చినప్పుడు పెట్టెను మోసే యాజుల పాదాలు నీళ్ళలో మునిగిన వెంటనే పైనుంచి వచ్చే నీళ్ళు ఆగిపోయాయి. (అది కోతకాలం, యొర్దాను నది పొంగి గట్ల మీద ప్రవహిస్తూ ఉన్నకాలం). 16 ఆ నీళ్ళు ఆగిపోయి సారెతాను ప్రక్క ఉన్న ఆదాం అనే ఊరిదగ్గర చాలా దూరంగా ఎత్తయిన రాశిలాగా అయ్యాయి. అరాబా సరస్సు వైపు ఆ ఉప్పు సరస్సులోకి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు. 17 ఇస్రాయేల్ ప్రజలంతా యొర్దాను దాటేవరకు యెహోవా ఒడంబడికపెట్టెను మోసే యాజులు యొర్దాను నది మధ్యలో పొడి నేలమీద అక్కడే నిలబడి ఉన్నారు. అలా ప్రజలంతా పొడి నేలమీద యొర్దాను దాటారు.