2
1 నూను కొడుకు యెహోషువ ఇద్దరు గూఢచారులను షిత్తీంనుంచి రహస్యంగా పంపిస్తూ “వెళ్ళి ఆ దేశాన్ని, ముఖ్యంగా యెరికో పట్టణాన్ని చూచి రండి” అని వారితో చెప్పాడు. వారు వెళ్ళి ఒక వేశ్య ఇంటికి చేరి అక్కడ బసచేశారు. ఆ వేశ్య పేరు రాహాబు.
2 “ఇస్రాయేల్ మనుషులు దేశాన్ని వేగు చూడడానికి ఇక్కడికి వచ్చారని” ఎవరో యెరికో రాజుకు తెలియజేశారు.
3 యెరికోరాజు “నీదగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన వాళ్ళను తీసుకురా! వాళ్ళు దేశమంతా వేగు చూడడానికి వచ్చార”ని రాహాబుకు కబురు పంపాడు.
4 అయితే ఆమె ఆ ఇద్దరిని దాచివేసి వచ్చినవాళ్ళతో “నాదగ్గరికి మనుషులు రావడానికి వచ్చారు గాని వాళ్ళెక్కడ నుంచి వచ్చారో నాకేమీ తెలియదు. 5 చీకటి పడ్డప్పుడు, పట్టణం ద్వారం మూసే సమయంలో వాళ్ళు బయటికి వెళ్ళారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. త్వరగా వాళ్ళ వెంట పడండి. వాళ్ళు దొరుకుతారు” అంది. 6 కానీ అంతకుముందు ఆమె వారిని మిద్దె మీదికి తీసుకువెళ్ళి అక్కడ వరుసగా పేర్చిఉన్న జనపకట్టెల్లో వారిని దాచింది. 7 రాజు పంపించిన మనుషులు యొర్దాను దారిలో రేవుల వరకు వారిని పట్టుకోవడానికి వెళ్ళారు. వారిని పట్టుకోవడానికి వెళ్లినవాళ్ళు బయలుదేరిన వెంటనే పట్టణం ద్వారం మూశారు.
8 ఆ గూఢచారులు పడుకొనేముందు రాహాబు పైకప్పు మీదికి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఇలా అంది: 9 “యెహోవా ఈ దేశం మీకిచ్చాడనీ మీ గురించిన భయం మామీదికి వచ్చిందనీ దేశంలో జనమంతా మీరంటే నీరైపోతున్నారనీ నాకు తెలుసు. 10 ఎందుకంటే మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు యెహోవా మీ ముందు ఎర్ర సముద్రాన్ని ఎండిపోజేసిన సంగతి మేము విన్నాం. యొర్దాను అవతల ఉన్న ఆ ఇద్దరు అమోరీ రాజులకు మీరేం చేశారో అంటే సీహోన్నూ ఓగునూ ఎలా సర్వనాశనం చేశారో అది కూడా మేము విన్నాం. 11 ఈ విషయాలు విన్నప్పుడు మా గుండెలు నీరైపొయ్యాయి. మీరంటే ఎవరిలోనూ ధైర్యం ఏ కోశానా లేదు. ఎందుచేతనంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమిమీదా దేవుడు. 12 నేను మీకు దయ చూపించాను గదా. కనుక మీరు మా నాన్న కుటుంబంమీద దయ చూపిస్తారని నాతో యెహోవా పేర ప్రమాణం చేయండి. నాకు ఖచ్చితమైన ఆనవాలు ఇవ్వండి. 13 మీరు మా నాన్ననూ అమ్మనూ అన్నదమ్ముల్నీ అక్కచెల్లెండ్రనూ వారి బలగాన్నంతా ప్రాణాలతో రక్షించాలి, చావకుండా మమ్మల్ని కాపాడాలి.”
14 అందుకు వారు “నీవు మా సంగతి చెప్పకుండా ఉంటే నీవు మా ప్రాణం రక్షించినట్టే మేము మీ ప్రాణాలు రక్షిస్తాం. యెహోవా ఈ దేశాన్ని మా వశం చేసినప్పుడు మేము మీపట్ల దయగా నమ్మకంగా వ్యవహరిస్తాం” అన్నారు.
15 అప్పుడామె వారిని కిటికీలో నుంచి త్రాడుతో క్రిందికి దింపింది. ఆమె ఇల్లు పట్టణం గోడమీద ఉంది. ఆమె ఆ గోడమీదే కాపురం ఉంది.
16 ఆమె వారితో “మీరు కొండలకు వెళ్ళండి. లేకపోతే మీకోసం వెదికేవాళ్ళు మిమ్మల్ని పట్టుకొంటారు. పట్టబోయేవారు తిరిగి వచ్చేవరకు అక్కడ మూడు రోజులు దాక్కోండి. ఆ తరువాత మీ దారిని మీరు పోవచ్చు” అని చెప్పింది.
17 వారు ఆమెతో ఇలా అన్నారు: “ఇదిగో విను. మేము ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ ఎర్రని దారాన్ని నీవు మమ్మల్ని కిందికి దించిన కిటికీకి కట్టాలి. మీ నాన్ననూ అమ్మనూ మీ అన్నదమ్ములనూ మీ నాన్న కుటుంబం వాళ్ళందరినీ నీ ఇంటిలోకి తెచ్చుకోవాలి. 18 నీవు అలా చేయకపోతే నీవు మాతో పెట్టించిన ఒట్టు నుంచి మేము విడుదల అవుతాం. 19 నీ ఇంటినుంచి ఎవరైనా బయటికి గనుక వెళ్ళితే వారి ప్రాణాలకు వారే జవాబుదారులు. మాకు దోషం ఏమీ ఉండదు. ఇంటిలో నీదగ్గర ఎవరు ఉంటారో వారికేదైనా ప్రమాదం జరిగితే మాది బాధ్యత. 20 ఒకవేళ నీవు మా సంగతి చెపితే ఇక నీవు మాతో చేయించిన ప్రమాణం చెల్లదు.”
21 అందుకామె “అలాగే, మీ మాట ప్రకారమే కానివ్వండి” అని వారిని పంపించింది. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ ఎర్రని దారం కిటికీకి కట్టింది.
22 వారు కొండల్లోకి వెళ్ళారు. వారిని పట్టబోయేవాళ్ళు పట్టణానికి తిరిగి చేరేవరకు అక్కడ మూడు రోజులు ఉండిపోయారు. పట్టబోయినవాళ్ళు దారి పొడుగునా వెదికారు గాని వారిని కనుక్కోలేకపోయారు. 23 అలా ఆ ఇద్దరు తిరిగి ఆ కొండలు దిగి నదిని దాటి నూను కొడుకైన యెహోషువ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పారు. 24 వారు యెహోషువతో “నిజంగా యెహోవా ఆ దేశాన్నంతా మన వశం చేస్తున్నాడు; మనమంటే ఆ దేశంవాళ్ళు నీరైపోతున్నారు” అన్నారు.