యెహోషువ
1
1 యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తరువాత యెహోవా నూను కొడుకూ మోషే సేవకుడూ అయిన యెహోషువతో ఇలా అన్నాడు: 2 “నా సేవకుడు మోషే చనిపోయాడు గనుక నీవు, ఈ ప్రజలంతా బయలుదేరి ఈ యొర్దాను నదిని దాటి నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చే దేశానికి వెళ్ళండి. 3 నేను మోషేకు ప్రమాణం చేసినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిచ్చాను. 4 లెబానోను నుంచి, ఎడారినుంచి యూఫ్రటీసు మహానదివరకు, పడమరగా మహా సముద్రంవరకు మీ సరిహద్దులవుతాయి. హిత్తిజాతివారి దేశమంతా మీదవుతుంది. 5 నీవు బ్రతికినన్నాళ్ళు నీముందు ఎవ్వడూ నిలబడలేడు. నేను మోషేతో ఉన్నట్టే నీతోనూ ఉంటాను. నీతో ఎప్పటికీ ఉంటాను. నిన్ను విడిచిపెట్టను. 6 దృఢంగా ధైర్యంగా ఉండు. నేను ఈ దేశాన్ని ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వీకులతో వాగ్దానం చేశాను. వారు ఈ దేశాన్ని వారసత్వంగా స్వాధీనం చేసుకొనేలా నీవు చేస్తావు. 7 నీవు ధైర్య స్థిరతలతో మాత్రం ఉండి నా సేవకుడు మోషే నీకు ఆదేశించిన ఉపదేశమంతా జాగ్రత్తగా పాటించు. దాని నుంచి కుడికి గానీ ఎడమకు గానీ తొలగకు. అప్పుడు నీవెక్కడికి వెళ్ళినా అక్కడ నీకు విజయం చేకూరుతుంది. 8 ఈ ధర్మశాస్త్రగ్రంథంలో ఉన్న వాక్కులు నీ నోటికి ఎన్నడూ దూరం కాకూడదు. అందులో వ్రాసి ఉన్నదంతటి ప్రకారం నీవు ప్రవర్తించడానికి జాగ్రత్తగా ఉండేలా రాత్రింబగళ్ళు దానిని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు నీ త్రోవలో నీవు వర్ధిల్లుతావు, నీకు విజయం చేకూరుతుంది. 9 దృఢంగా, ధైర్యంగా ఉండమని నేను నీకు ఆదేశించాను గదా. కనుక భయపడకు, హడలిపోకు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు యెహోవా నీతో ఉంటాడు.”
10 అప్పుడు యెహోషువ ప్రజా నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు: 11 “ఇంకా మూడు రోజుల్లో వశపరుచు కోవడానికి మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చిన దేశానికి యొర్దాను దాటి వెళ్ళాలి గనుక మీరు భోజనాలు సిద్ధం చేసుకోండి అని మీరు శిబిరంలో వెళ్తూ ప్రజలతో చెప్పండి.”
12 యెహోషువ రూబేను గోత్రికులతో, గాదు గోత్రికులతో, మనష్షే అర్ధ గోత్రంవారితో ఇలా చెప్పాడు: 13 “మీ దేవుడు యెహోవా మీకు విశ్రాంతి ప్రసాదించి ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తాడని యెహోవా సేవకుడైన మోషే మీకాదేశించిన మాట జ్ఞాపకం తెచ్చుకోండి. 14 మీ భార్య బిడ్డలూ మీ పశువులూ యొర్దాను ఇవతల మోషే మీకిచ్చిన ఈ ప్రదేశంలో ఉండి పోవాలి. అయితే మీలో ఉన్న యోధులందరూ ఆయుధాలు పట్టుకొని మీ సాటి ఇస్రాయేల్‌వారికి ముందుగా వెళ్తూ వారికి సహాయం చేయాలి. 15 యెహోవా వారికీ మీకూ విశ్రమం ప్రసాదించేవరకు, వారు కూడా మీ దేవుడు యెహోవా వారికిచ్చే భూమిని స్వాధీనం చేసుకొనేవరకు, మీరు వారికి సహాయం చేయాలి. ఆ తరువాత తూర్పుదిక్కుగా యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాధీనమైన ఈ ప్రదేశానికి తిరిగి రావచ్చు.”
16 అప్పుడు వారు యెహోషువతో ఇలా బదులు చెప్పారు. “మీరు మాకు ఆదేశించినట్టే అంతా చేస్తాం. మీరెక్కడికి మమ్మల్ని పంపిస్తే అక్కడికి వెళ్తాం. 17 అన్ని విషయాల్లో మోషే మాట ఎలా విన్నామో మీ మాట కూడా అలాగే వింటాం. మీ దేవుడు యెహోవా మోషేతో ఉన్నట్టే మీతోనూ ఉంటాడు గాక! 18 మీ ఆజ్ఞలను ఎదిరించి ఏ విషయంలోనైనా మీ మాటలు పెడచెవిని పెట్టిన ప్రతి ఒక్కరూ మరణశిక్ష పొందుతారు. మీరు మాత్రం దృఢంగా, ధైర్యంగా ఉండాలి.”