24
1 ✽ఇస్రాయేల్ గోత్రాలన్నిటిని షెకెం దగ్గర యెహోషువ సమకూర్చాడు. ఇస్రాయేల్‌ప్రజ పెద్దలనూ నాయకులనూ న్యాయాధిపతులనూ అధికారులనూ పిలిపించాడు. వారు దేవుని సన్నిధానంలో హాజరయ్యారు. 2 యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు✽ – మునుపు మీ పూర్వీకులు✽, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీస్ నది అవతల కాపురముండేవారు – వారు ఇతర దేవుళ్ళను కొలిచేవారు. 3 ఆ నది అవతల ఉన్న మీ పూర్వీకుడైన అబ్రాహామును నేను తీసుకువచ్చి కనాను దేశమంతా సంచరించేలా చేశాను. అతని సంతానాన్ని సంఖ్యలో అధికం చేశాను. అతనికి ఇస్సాకును ప్రసాదించాను. 4 ✝ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ అనుగ్రహించాను. స్వాధీనం చేసుకొమ్మని ఏశావుకు శేయీరు పర్వతప్రదేశం ఇచ్చాను. యాకోబు, అతని కొడుకులు దిగువనున్న ఈజిప్ట్‌కు వెళ్ళారు.5 ✝“తరువాత మోషేనూ అహరోనునూ నేను పంపి అక్కడ నేను చేసిన చర్యలవల్ల ఈజిప్ట్ దేశాన్ని బాధపెట్టాను. ఆ తరువాత నేను మిమ్ములను వెలుపలికి తీసుకువచ్చాను. 6 ✝మీ పూర్వీకులను ఈజిప్ట్‌నుంచి నేను బయటికి తీసుకువచ్చి నప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈజిప్ట్‌వాళ్ళు రథాలతో రౌతులతో మీ పూర్వీకులను తరుముతూ ఆ ఎర్ర సముద్రం చేరారు. 7 ✝మీ పూర్వీకులు యెహోవాకు మొరపెట్టి నప్పుడు ఆయన మీకూ ఈజిప్ట్‌వాళ్ళకూ మధ్య కారు చీకటి కలిగించాడు. సముద్రం వాళ్ళ పైబడి ముంచేలా చేశాడు. నేను ఈజిప్ట్‌లో ఏం చేశానో మీరు కళ్ళారా చూశారు. తరువాత మీరు ఎడారిలో చాలా కాలం✽ ఉండిపోయారు.
8 ✝“అప్పుడు నేను యొర్దాను అవతల ఉండే అమోరీవాళ్ళ దేశానికి మిమ్ములను తీసుకువచ్చాను. వాళ్ళు మీతో యుద్ధం చేశారు గాని నేను వాళ్ళను మీ చేతికప్పగించాను. నేను వాళ్ళను మీ ముందు నాశనం చేసినందుకు మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 9 ✝అప్పుడు సిప్పోరు కొడుకూ మోయాబు రాజైన బాలాకు బయలుదేరి ఇస్రాయేల్‌ప్రజతో యుద్ధం చేశాడు. బెయోరు కొడుకైన బిలాం మిమ్ములను శపించాలని అతణ్ణి బాలాకు రప్పించాడు. 10 ✽కాని బిలాం మాట నేను వినలేదు. గనుక అతడు మిమ్ములను దీవించవలసి వచ్చింది. ఆవిధంగా నేను అతడి చేతినుంచి మిమ్ములను కాపాడాను. 11 ✝మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. యెరికో అధికారులు మీతో యుద్ధం జరిగించారు. అమోరీ, పెరిజ్జి, కనాను, హిత్తి, గిర్గాషి, హివ్వి, యెబూసి జాతులవారు కూడా మీతో యుద్ధం చేశారు గాని వాళ్ళను నేను మీ వశం చేశాను. 12 మీ ముందు కందిరీగలను✽ పంపించాను. అవి అమోరీవాళ్ళ ఇద్దరు రాజులను మీ దగ్గరనుంచి పారదోలాయి. మీ ఖడ్గంవల్ల, మీ వింటి✽వల్ల అది కాలేదు. 13 ✽ మీరు కష్టపడని ఒక దేశాన్ని మీరు కట్టని పట్టణాలను నేను మీకిచ్చాను. మీరు వాటిలో కాపురం ఉన్నారు. మీరు నాటని ద్రాక్షతోటల, ఆలీవ్‌తోటల పండ్లు తింటున్నారు.
14 ✽“అందుచేత యెహోవాపట్ల భయభక్తులతో✽ ఉండండి. ఆయనను హృదయపూర్వకంగా యథార్థంగా✽ సేవిస్తూ ఉండండి. యూఫ్రటీసు నది అవతల ఈజిప్ట్‌లో మీ పూర్వీకులు సేవించి పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టండి✽. యెహోవానే సేవించండి. 15 యెహోవాను సేవించడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏ దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి– యూఫ్రటీసు నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను గానీ మీరు కాపురముంటున్న ఈ దేశంలో ఉన్న అమోరీవాళ్ళ దేవుళ్ళనూ గానీ ఎన్నుకోవచ్చు✽. అయితే నేనూ నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం.”
16 ✽అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు: “యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను సేవించడం మాకు దూరం అవుతుంది గాక! 17 ఎందుచేతనంటే, ఈజిప్ట్‌దేశం నుంచి – ఆ దాస్య గృహం నుంచి మనల్నీ మన పూర్వీకులనూ వెలుపలికి తీసుకువచ్చినది మన దేవుడు యెహోవాయే. మన కళ్ళెదుట ఆ మహా సూచకమైన అద్భుతాలు చేసినవాడు, మనం చేసిన ప్రయాణమంతా మనం వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మనల్ని సంరక్షించినవాడు ఆయనే. 18 యెహోవా ఈ దేశంలో నివసించిన అమోరీవాళ్ళనూ జనాలందరినీ మన ఎదుటనుంచి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు గనుక మేము కూడా యెహోవానే సేవిస్తాం”.
19 అందుకు యెహోషువ ప్రజలతో ఇలా అన్నాడు: “యెహోవా పవిత్ర✽ దేవుడు గనుక మీరు ఆయనను సేవించ లేక పోతారు✽. ఆయన రోషంగల✽ దేవుడు. ఆయన మీ అపరాధాలూ పాపాలూ క్షమించడు✽. 20 మీరు యెహోవాను విసర్జించి పరాయి దేవుళ్ళను సేవిస్తే ఆయన తన వైఖరి మార్చుకొని మీకు హాని చేస్తాడు. ఇంత కాలం మీకు మేలు చేసిన తరువాత అప్పుడు మిమ్ములను నాశనం చేస్తాడు.”
21 ప్రజలు “అలా కాదు. మేము యెహోవానే సేవిస్తాం” అని యెహోషువతో అన్నారు.
22 యెహోషువ ప్రజలతో “మీరు యెహోవానే సేవిస్తామని ఆయనను మీరు కోరుకొన్నారు. దానికి మీ అంతట మీరే సాక్షులు” అన్నాడు. “అలాగే మేము సాక్షులం” అని వారు చెప్పారు.
23 ✽అతడు అన్నాడు “అయితే మీ మధ్య ఉన్న పరాయి దేవుళ్ళను పారవేయండి. “ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పండి.”
24 ✽ప్రజలు యెహోషువతో “మన దేవుడు యెహోవానే సేవిస్తాం, ఆయన మాట వింటాం” అన్నారు.
25 ✽గనుక ఆ రోజు యెహోషువ ప్రజతో ఒక ఒప్పందం చేయించి షెకెంలో ఒక శాసనం, ఒక న్యాయనిర్ణయం నియమించాడు.
26 యెహోషువ ఈ మాటలు దేవుని ధర్మశాస్త్రగ్రంథంలో✽ వ్రాశాడు. అప్పుడు పెద్ద రాయి తెచ్చి యెహోవా పవిత్ర స్థానం ప్రక్కన ఉన్న సిందూర వృక్షం క్రింద దానిని నిలబెట్టాడు. 27 అప్పుడు యెహోషువ ప్రజలందరితో “ఇదిగో! యెహోవా మనతో పలికిన మాటలన్నీ ఈ రాయికి వినిపించాయి. గనుక ఇది మనకొక సాక్షిలాగా ఉంటుంది. మీరు మీ దేవుణ్ణి ఎరగమని చెప్పినా ఇది మీకు సాక్షిలాగా ఉంటుంది” అన్నాడు. 28 ఆ తరువాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు.
29 ఇవన్నీ అయినతరువాత నూను కొడుకూ యెహోవా సేవకుడూ అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయసులో చనిపోయాడు. 30 అతడు వారసత్వంగా పొందిన ప్రాంతం భూమిలో తిమ్నాత్‌సెరహులో వారు అతణ్ణి పాతి పెట్టారు. ఆ ఊరు ఎఫ్రాయిం కొండసీమలో గాషు కొండకు ఉత్తరం వైపుగా ఉంది. 31 ✝యెహోషువ బ్రతికిన కాలమంతా యెహోవా ఇస్రాయేల్‌ప్రజకు చేసిన చర్యలన్నీ తెలుసుకొని యెహోషువ కంటే ఇంకా బ్రతికిన పెద్దల కాలమంతా ఇస్రాయేల్‌ప్రజలు యెహోవాను సేవించారు.
32 ఈజిప్ట్‌నుంచి ఇస్రాయేల్ ప్రజలు తెచ్చిన యోసేపు ఎముకల✽ను షెకెంలో పాతిపెట్టారు. షెకెం తండ్రి అయిన హమోరు వంశంవారిదగ్గర యాకోబు✽ వంద వెండి నాణేలు ఇచ్చి కొన్న భూభాగంలో పాతిపెట్టారు. అది యోసేపు సంతానానికి వారసత్వం అయింది. 33 ✽అహరోను కొడుకైన ఎలియాజరు చనిపోయాడు. అతని కొడుకు ఫీనెహాసుకు ఎఫ్రాయిం కొండసీమలో చీట్లవల్ల లభించిన గిబియాలో వారతణ్ణి పాతిపెట్టారు.