33
1 దేవుని మనిషి మోషే చనిపోయేముందు ఇస్రాయేల్ ప్రజలను గురించి ఆశీర్వచనాలు పలికాడు. ఆ ఆశీర్వచనాలు ఇవే.
2 “యెహోవా సీనాయి పర్వతం నుంచి
బయలుదేరాడు.
శేయీర్‌కొండ నుంచి వారికి ఉదయించాడు.
ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు.
వేలాది వేల పవిత్ర సమూహాల
మధ్య నుంచి ఆయన వచ్చాడు.
ఆయన కుడిప్రక్కన మంటలు
మండుతున్నాయి.
3 ఈ ప్రజలంటే నీకు ప్రేమ
అందులో అనుమానం లేదు.
పవిత్రులందరూ నీ చేతిలో ఉన్నారు.
వారంతా నీ పాదాల దగ్గర కూర్చుని
నీ ఉపదేశం పొందుతారు.
4 మోషే మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
అది యాకోబు సమాజంవారి పిత్రార్జితం.
5 ప్రజల నాయకులూ, ఇస్రాయేల్ గోత్రాలూ
సమకూడినప్పుడు యెషూరూన్ జనం మధ్య
యెహోవా రాజుగా ఉన్నాడు.
6 “రూబేను గోత్రికులు తక్కువ కావడంవల్ల
ఆ గోత్రం అంతరించి పోకుండా,
జీవిస్తుంది గాక.”
7 యూదా విషయం ఇలా పలికాడు:
“యెహోవా! యూదా గోత్రికుల మనవి విని,
వారిని వారి ప్రజల దగ్గరికి చేర్చు.
ఆ గోత్రానికి గొప్ప యుద్ధ బలాన్ని ప్రసాదించు.
వారి పగవారికి విరోధంగా నీవు వారికి
సహాయం చేస్తావు గాక.”
8 లేవీ విషయం ఇలా అన్నాడు:
“నీ తుమ్మీం, ఊరీం నీ భక్తుడి
కోసం ఉన్నాయి.
మస్సాలో నీవు ఆ గోత్రాన్ని పరీక్షించావు.
9  వారు తమ తల్లిదండ్రులను గురించి
వారిని ఎరగనన్నారు.
తమ సొంత ప్రజలను లక్ష్యపెట్టలేదు,
తమ సంతానంతో సంబంధం ఎంచలేదు.
వారు నీ మాట ప్రకారం ప్రవర్తించారు,
నీ ఒడంబడికను పాటించారు.
10 వారు యాకోబు ప్రజలకు
నీ న్యాయ నిర్ణయాలను,
ఇస్రాయేల్ జనానికి నీ ధర్మశాస్త్రాన్ని
ఉపదేశిస్తారు.
నీ సన్నిధానంలో ధూపం వేస్తారు,
నీ బలిపీఠం మీద హోమ బలులు అర్పిస్తారు.
11 యెహోవా! వారి బలసామర్థ్యాలను దీవించు.
వారి కార్యకలాపాలను స్వీకరించు.
వారిపైబడేవాళ్ళూ, వారిని ద్వేషించేవాళ్ళూ
లేవకుండా వాళ్ళ నడుములు విరగగొట్టు.”
12 బెన్యామీను విషయం ఇలా అన్నాడు:
“యెహోవాకు ప్రియమైనవారు
ఆయన దగ్గర సురక్షితంగా నివసిస్తారు.
ఎప్పుడూ ఆయన వారికి అండగా ఉంటాడు,
ఆయన వారిమధ్య నివాసం చేస్తాడు.”
13  యోసేపు విషయం ఇలా అన్నాడు:
“యెహోవా వారి భూభాగాన్ని
దీవిస్తాడు గాక!
ఆకాశంనుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచువల్ల,
కింద ఉన్న జలాగాధంవల్ల,
14 ఎండచేత కలిగే శ్రేష్ఠ ఫలాల వల్ల,
నెల నెల పండే మేలిరకమైన పంటల వల్ల,
15 పురాతన పర్వతాల శిఖరాల వాటివల్ల,
ఎల్లకాలం ఉండే కొండల మేలైనవాటివల్ల,
16 భూమి ప్రశస్తమైన వాటివల్ల,
దాని సమృద్ధివల్ల,
యెహోవా ఈ గోత్రాన్ని దీవిస్తాడు గాక!
పొదలో ఉన్నవాని దయ
యోసేపు మీద ఉంటుంది గాక!
తన అన్నదమ్ములలో ప్రఖ్యాతి చెందినవాని
గోత్రం మీద అది ఉంటుంది గాక!
17 మొదట పుట్టిన వృషభంలాగా ఈ గోత్రం
ఘనత వహించింది.
దాని కొమ్ములు గురుపోతు కొమ్ముల్లాంటివి.
ఆ కొమ్ములతో జనాలను – భూమి కొనలలో
ఉండే జనాలను కూడా అది పొడుస్తుంది.
ఎఫ్రాయింకు చెందిన వేలాది వేలమంది,
మనష్షేకు చెందిన వేలమంది
అలాగే అంటారు.”
18 జెబూలూను విషయం ఇలా అన్నాడు:
“జెబూలూనూ! నీవు బయలుదేరేటప్పుడు
సంతోషించు!
ఇశ్శాకారు! నీ గుడారాలలో సంతోషించు!
19 వారు జనాలను
తమ పర్వతానికి పిలుస్తారు.
అక్కడ సరైన బలులు అర్పిస్తారు.
వారు సముద్రాల సమృద్ధిని,
ఇసుకలో గుప్తమైన నిధులను
బయటికి తీస్తారు.”
20 గాదు విషయం ఇలా అన్నాడు:
“గాదు ప్రాంతాన్ని విశాలపరచినవానికి
స్తుతి కలుగుతుంది గాక!
ఈ గోత్రం ఆడు సింహంలాగా పొంచివుంటుంది.
హస్తాన్ని, నడినెత్తిని చీల్చివేస్తుంది.
21  అది తనకోసం మొదటి భాగం చూచుకొంది.
అక్కడ నాయకుడి భాగం దానికోసం
ప్రత్యేకించి ఉంచబడింది.
ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు
యెహోవా తీర్చిన న్యాయాన్ని
జరిగించినది ఆ గోత్రం.
ఇస్రాయేల్ ప్రజల విషయం యెహోవా న్యాయ
నిర్ణయాల ప్రకారం చేసింది.”
22 దాను విషయం ఇలా అన్నాడు:
“దాను సింహం పిల్లలాంటిది.
అది బాషానునుంచి దూకుతుంది.”
23  నఫ్తాలి విషయం ఇలా అన్నాడు:
“అనుగ్రహం చేత సంతుష్టి చెందిన నఫ్తాలీ!
యెహోవా ఆశీస్సులచేత నిండిపోయిన నఫ్తాలీ!
సరస్సునూ దక్షిణ భూభాగాన్నీ
స్వాధీనం చేసుకో!”
24 ఆషేరు విషయం ఇలా అన్నాడు:
“ఆషేరు పొందిన ఆశీస్సులు
కొడుకులకంటే ఉత్తమం.
సాటి గోత్రాలు దాన్ని మెచ్చుకుంటాయి గాక!
దాని పాదాలు నూనెలో ముంచుకొంటుంది.
25 నీ కమ్ములు ఇనుపవి, కంచువి.
నీవు బ్రతికినన్నాళ్ళు నీకు
బలం ఉంటుంది గాక!
26 “యెషూరూన్ యొక్క దేవుణ్ణి పోలిన
వాడెవ్వడూ లేడు.
నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా వస్తాడు!
తన తేజస్సుతో మేఘవాహనుడై వస్తాడు!
27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం.
ఎప్పటికీ ఉండే హస్తాలు నీక్రింద ఉంటాయి.
ఆయన నీ ఎదుటనుంచి శత్రువులను పారదోలి,
‘నాశనం చెయ్యి!’ అంటాడు.”
28 “ఇస్రాయేల్ ప్రజలు నిర్భయంగా
కాపురముంటున్నారు.
యాకోబు యొక్క ఊట
ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ ప్రజలు ధాన్య ద్రాక్షరసాలు ఉన్న
దేశంలో ఉంటారు.
అక్కడ ఆకాశం మంచు కురిపిస్తుంది.
29 ఇస్రాయేల్ ప్రజలారా! ఎంత ధన్యులు మీరు!
యెహోవా రక్షించిన ప్రజలు మీరు!
మిమ్మల్ని పోలిన వారెవ్వరు?
ఆయన మిమ్మల్ని కాపాడే డాలులాంటివాడు.
ఆయన మీకు ఘనమైన ఖడ్గంవంటివాడు.
మీ శత్రువులు మీ ఎదుట ముడుచుకుపోతారు.
మీరు వాళ్ళ ఎత్తయిన స్థలాలను తొక్కుతారు.”