34
1 ఆ తరువాత మోషే మోయాబు మైదానాలనుంచి నెబో పర్వతమెక్కాడు. అది పిస్గా పర్వతపంక్తి శిఖరం. అది యెరికోకు ఎదురుగా ఉంది. యెహోవా ఆ దేశాన్నంతా అతడికి చూపించాడు. 2 దానువరకు గిలాదు ప్రదేశాన్ని, నఫ్తాలి ప్రాంతాన్నంతా ఎఫ్రాయిం మనష్షేల ప్రదేశాన్ని పశ్చిమ సముద్రం వరకు యూదా ప్రదేశాన్నంతా 3 దక్షిణ ప్రదేశాన్ని, ఈతచెట్లు ఉన్న యెరికోపట్టణంనుంచి సోయర్‌వరకు ఉన్న మైదానాన్ని అతడికి చూపించాడు.
4 అప్పుడు యెహోవా “మీ సంతానానికిస్తానని నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా దాన్ని చూడనిచ్చాను గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళవు.”
5 యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట ప్రకారం అక్కడే, మోయాబు దేశంలోనే చనిపోయాడు. 6 బేత్‌పెయోర్ ఎదుట, మోయాబులో ఒక లోయలో యెహోవా అతణ్ణి పాతిపెట్టాడు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటివరకు ఎవరికీ తెలియదు. 7 మోషే చనిపోయినప్పుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. అతడికి కళ్ళు మసకబారలేదు. బలం తగ్గలేదు. 8 ఇస్రాయేల్‌ప్రజలు మోయాబు మైదానాల ప్రాంతంలో మోషే మృతి విషయం ముప్ఫయి రోజులు శోకించారు. దానితో మోషేను గురించి శోకించడం, విలపించడం ముగించారు.
9 అంతకు ముందు మోషే తన చేతులు నూను కొడుకు యెహోషువ మీద ఉంచాడు. గనుక అతడు జ్ఞానాత్మతో నిండివున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు అతడి మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు. 10 అయితే యెహోవాను ముఖాముఖిగా తెలుసుకొన్న మోషేవంటి మరో ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలలో ఇదివరకు జన్మించలేదు. 11 ఈజిప్ట్‌దేశంలో ఫరోకు, అతడి పరివారంలో ఉన్నవాళ్ళందరికీ, అతడి దేశమంతటికీ ఆ అద్భుతమైన సూచనలన్నీ, మహాక్రియలన్నీ చేయడానికి యెహోవా మోషేను పంపించాడు. 12 ఇస్రాయేల్ ప్రజలందరి కళ్ళెదుటే మోషే మహా బలప్రభావాలతో భయంకరమైన ఆ క్రియలన్నీ చేశాడు. అలాంటి విషయాలలో అతణ్ణి పోలిన మరో ప్రవక్త ఇదివరకు జన్మించలేదు.