32
1 ఆకాశాల్లారా! నేను చెప్పేది వినండి!
భూగోళమా! నానోటి మాటలు ఆలకించు!
2 నా ఉపదేశం వానలాగా కురుస్తుంది.
నా వాక్కులు మంచు బొట్లలాగా
లేత గడ్డిమీద పడే చినుకులలాగా
మొక్కలమీద కురిసే జల్లులాగా ఉంటాయి.
3  నేను యెహోవా పేరును ప్రకటిస్తాను.
మీరు మన దేవునికి మహత్తును ఆరోపించండి.
4 ఆయన ఆధారశిలగా ఉన్నాడు.
ఆయన చేసేది లోపం లేనిది.
ఆయన విధానాలన్నీ న్యాయమైనవి.
ఆయన నమ్మదగిన దేవుడు,
పక్షపాతం చూపని దేవుడు.
ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
5 వారైతే చెడిపోయినవారు;
ఆయన పిల్లలు కారు.
వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం వారు.
6 బుద్ధీ భక్తీ లేనివారలారా!
తెలివితక్కువ ప్రజలారా!
ఈ విధంగా యెహోవాకు ప్రతిక్రియ చేస్తారా?
ఆయన మిమ్మల్ని సంపాదించుకొన్న
తండ్రి కాడా?
ఆయన మిమ్మల్ని సృజించి, స్థాపించలేదా?
7 గతించిన రోజులు జ్ఞప్తికి తెచ్చుకోండి.
తరతరాల సంవత్సరాల గురించి తలపోయండి.
మీ తండ్రిని అడగండి,
అతడు మీకు తెలుపుతాడు.
మీ పెద్దలను అడగండి,
వారు మీతో చెపుతారు.
8 సర్వాతీతుడు జనాలకు వారి వారి
వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు,
మానవ జాతులను వేరుపరచినప్పుడు
ఇస్రాయేల్ ప్రజల సంఖ్య ప్రకారం
జనాలకు సరిహద్దులు నిర్ణయించాడు.
9 యెహోవా వంతు ఆయన జనమే.
ఆయనకు వచ్చే వారసత్వం యాకోబు ప్రజలే.
10 ఆయన ఈ జనాన్ని ఎడారి ప్రదేశంలో
కనుగొన్నాడు.
బీకరమైన శబ్దాలు ఉన్న, ఎండిపోయిన
ప్రాంతాలలో ఆ జనం దొరికింది.
ఆ జనాన్ని ఆవరించి పోషించాడు,
తన కనుపాపలాగా కాపాడాడు.
11  గరుడపక్షి తన గూడు రేపి,
తన పిల్లలపైన ఎగురుతూ,
రెక్కలు చాపుకొని ఆ పిల్లలను తీసుకుని
రెక్కలమీద మోసేలాగా యెహోవా చేశాడు.
12 యెహోవా ఒక్కడే ఆ జనానికి
దారిచూపుతూ ఉన్నాడు.
అన్యుల దేవుళ్ళలో ఏ దేవుడూ
ఆయనతోకూడా లేకపోయాడు.
13 లోకంలో ఎత్తయిన స్థలాలమీద
ఆ జనాన్ని ఎక్కించాడు.
పొలాల పంటలు వారికి తినిపించాడు.
కొండ బండనుంచి తేనెతో,
చెకుముకి రాతి నేల నుంచి
నూనెతో వారిని తృప్తిపరచాడు.
14 ఆవు మజ్జిగనూ, గొర్రెమేకల పాలనూ,
గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్ళనూ,
మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోధుమ
పిండినీ మీకిచ్చాడు.
మంచి ద్రాక్ష రసాయనం మీరు తాగారు.
15 యెషూరూన్ కొవ్వినవాడై కాలు తన్నాడు,
(అవును, మీరు కొవ్వి మొద్దయి బలిశారు)
యెషూరూన్ తనను పుట్టించిన దేవుణ్ణి విడిచాడు.
తన రక్షణను, ఆధారశిలను తృణీకరించాడు.
16  వారు ఇతర దేవుళ్ళను అనుసరించి
ఆయనకు రోషం రేపారు.
అసహ్యమైన విగ్రహాలు పెట్టుకొని
ఆయనకు కోపం రెచ్చగొట్టారు.
17 దేవత్వం లేని దయ్యాలకు వారు బలులు అర్పించారు.
తమకు తెలియని దేవతలకూ కొత్తగా కల్పించిన
దేవుళ్ళకూ మీ పూర్వీకులు భయపడని
వేల్పులకూ మ్రొక్కారు.
18 మిమ్మల్ని పుట్టించిన ఆధారశిలలాంటివాణ్ణి
మీరు నిర్లక్ష్యం చేశారు.
మిమ్మల్ని కన్న దేవుణ్ణి మరచిపోయారు.
19 యెహోవా అది చూశాడు,
వారిని నిరాకరించాడు.
తన కొడుకులవల్ల కూతుళ్ళవల్ల
తనకు కలిగిన కోపం కారణంగా
వారిని నిరాకరించాడు.
20 ఆయన అన్నాడు:
“వారి నుంచి నా ముఖం
అటువైపు త్రిప్పుతాను.
వారి చివరి స్థితి ఏమవుతుందో చూస్తాను.
వారు మొండి ప్రజలు,
విశ్వసనీయత లేని పిల్లలు.
21 వారు దేవత్వం లేని దేవుళ్ళవల్ల
నాకు కోపం రేపారు.
గనుక ప్రజ కానివారివల్ల
వారికి రోషం పుట్టిస్తాను.
బుద్ధీ భక్తీలేని జనం వల్ల
వారికి కోపం రేపుతాను.
22 నా కోపాగ్ని రగులుకొని ఉంది.
మృత్యులోకం లోతైన స్థలాలవరకు
అది మండుతుంది.
అది భూమిని, దాని పంటను కాల్చివేస్తుంది,
పర్వతాల పునాదులను రగులబెడుతుంది.
23 వారిమీదికి ఆపదల సమూహాన్ని తెప్పిస్తాను.
వారిమీద నా బాణాలు వేస్తాను.
24 వారు కరవు చేత క్షీణించిపోతారు.
తీవ్రమైన జ్వరంచేత,
కఠిన రోగాలచేత క్షీణించిపోతారు.
దుమ్ములో ప్రాకేవాటి విషాన్ని,
మృగాల కోరలను వారిమీదికి రప్పిస్తాను.
25 బయట ఖడ్గం చంపుతుంది.
లోపల భయం పీడిస్తుంది.
యువకులూ కన్యలూ శిశువులూ నెరసిన
వెండ్రుకలు గలవారూ నాశనం అవుతారు.
26 వారిని తుత్తునియలుగా చేస్తాననీ వారిని
గురించిన జ్ఞాపకం కూడా మనుషులలో
లేకుండా చేస్తాననీ అనుకొని ఉండేవాణ్ణి,
27 గానీ ఎందుకు అలా చేయలేదంటే
వారి శత్రువులు రెచ్చిపోతారేమో,
ఆ శత్రువులు అపార్థం చేసుకొని
‘పైచేయి మనదే!
ఇదంతా చేసినది యెహోవా కాదు’
అంటారేమో అని.”
28 ఈ ప్రజకు ఆలోచన బొత్తిగా లేదు.
వారిలో తెలివి ఏమీ లేదు.
29 వారు జ్ఞానం తెచ్చుకొని,
ఈ మాటలు గ్రహిస్తే,
వారి చివరి స్థితిని తలపోస్తే ఎంత బావుండు!
30 వారి ఆధారశిల వారిని తమ
శత్రువుల వశం చేశాడు.
యెహోవా వారిని వాళ్ళకప్పగించాడు.
లేకపోతే ఒక్కడు వేయిమందిని
ఎలా తరుముతాడు?
ఇద్దరు పదివేల మందిని పారదోలడం ఎలాగా?
31 వాళ్ళ ఆధారశిల మన ఆధారశిల
వంటివాడు కాడు గదా.
ఈ సంగతి మన శత్రువులే వివేచించగలరు.
32 “వాళ్ళ ద్రాక్షచెట్టు సొదొమ
ద్రాక్షచెట్టు నుంచి వచ్చింది.
అది గొమొర్రా పొలాలలో పుట్టింది.
వాళ్ళ ద్రాక్షపండ్లు విషం.
వాళ్ళ గెలలు చేదు.
33 వాళ్ళ ద్రాక్షరసం సర్పాల విషం.
అది నాగుపాముల క్రూర విషం.
34 వాళ్ళ క్రియల లెక్క నా దగ్గర ఉంది గదా.
అది నా ఖజానాలలో మూసివేయబడి ఉంది.
35  పగ తీర్చే పని నాదే. నేనే ప్రతిక్రియ చేస్తాను.
వాళ్ళ కాలు జారిపోయే సమయం వస్తుంది.
వాళ్ళ ఆపద్దినం ఆసన్నమైంది.
వాళ్ళ గతి త్వరలో వాళ్ళకు దాపురిస్తుంది.”
36 తన ప్రజ బలం ఉడిగిపోవడం,
చెరలో ఉన్నవారూ దిక్కులేనివారూ తప్ప
మరెవ్వరూ లేకపోవడం యెహోవా చూచినప్పుడు
ఆయనకు తన సేవకుల మీద జాలి వేస్తుంది.
ఆయన తన ప్రజలకు న్యాయం చేకూరుస్తాడు.
37 ఆయన ఇలా అంటాడు:
“వాళ్ళ దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు?
వాళ్ళు నమ్ముకొన్న ఆధారశిల ఏమయింది?
38 వాళ్ళ బలుల క్రొవ్వును తిని,
వాళ్ళు పానార్పణగా తెచ్చే
ద్రాక్షరసం త్రాగిన దేవుళ్ళు ఏమయ్యారు?
అలాంటి దేవుళ్ళు లేచి మీకు సాయం చేయగలరా?
మీకు ఆశ్రయం ఇవ్వగలరా?
39 ఇదిగో, వినండి.
నేను, నేను మాత్రమే దేవుణ్ణి.
మరో దేవుడు లేనే లేడు.
మరణానికి గురి చేసే వాణ్ణి నేనే,
బ్రతికించేవాణ్ణి నేనే.
గాయపరచేవాణ్ణి, బాగుచేసేవాణ్ణి నేనే.
నా చేతిలో నుంచి విడిపించగలవాడు
ఎవ్వడూ ఉండడు.
40 నిగనిగలాడే నా ఖడ్గం నూరి, న్యాయం
జరిగించడానికి నా చెయ్యి చాపినప్పుడు
నా పగవారికి ప్రతిక్రియ చేస్తాననీ,
నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాననీ,
41 ఆకాశంవైపు నా చెయ్యి ఎత్తి,
నా శాశ్వత జీవంతోడని శపథం చేస్తున్నాను.
42 రక్తంచేత నా బాణాలు మత్తిల్లేలా చేస్తాను!
హతమైన వారి రక్తం, బందీల రక్తం
శత్రువులలో నాయకుల తలలతోపాటు
నా ఖడ్గం మాంసం తినివేస్తుంది!
43 ఇతర జనాల్లారా!
ఆయన ప్రజతో కూడా సంతోషించండి!
వధ అయిన తన సేవకుల రక్తం విషయం
ఆయన ప్రతిక్రియ చేస్తాడు.
తన పగవారికి ప్రతీకారం చేస్తాడు.
తన దేశం, తన ప్రజల పాపాలను కప్పివేస్తాడు.
 
44 మోషే, నూను కొడుకైన యెహోషువ ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించారు. 45 మోషే ఈ మాటలన్నీ ఇస్రాయేల్ ప్రజలందరితో చెప్పడం ముగించాక అతడు వారితో ఇంకా అన్నాడు, 46 “ఈ రోజు నేను మిమ్మల్ని హెచ్చరించే ఈ మాటలన్నీ మనసులో ఉంచుకోవాలి; మీ సంతానం ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ పాటించి, వాటిప్రకారం ప్రవర్తించాలని వారికాజ్ఞాపించాలి. 47 ఈ ఉపదేశం వట్టిది కాదు. ఇది మీకు జీవమే. మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటిపోయే దేశంలో దీనివల్లే చాలా కాలం నివసిస్తారు.
48 ఆ రోజే యెహోవా మోషేతో అన్నాడు, 49 “యెరికో ఎదుట, మోయాబు దేశంలో ఉన్న ఈ అబారీం పర్వతపంక్తి, నెబోపర్వత శిఖరమెక్కు, నేను ఇస్రాయేల్ ప్రజలకు స్వదేశంగా ఇచ్చే కనాను దేశాన్ని అక్కడనుంచి చూడు. 50 నీ అన్న అహరోను హోర్ పర్వతంమీద చనిపోయి తన పూర్వీకుల దగ్గరికి చేరినట్టు నీవు కూడా ఎక్కబోయే పర్వతంమీద చనిపోయి నీ ప్రజలదగ్గరికి చేరుతావు. 51 ఎందుకంటే, మీరిద్దరూ సీన్ ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ళదగ్గర ఇస్రాయేల్ ప్రజల మధ్య విశ్వసనీయులుగా లేరు; ఇస్రాయేల్ ప్రజల మధ్య నా పవిత్రతను ఘనపరచలేదు. 52 దూరంగా ఉండి ఆ దేశాన్ని చూస్తావు గాని, నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చే ఆ దేశంలో అడుగు పెట్టవు.”